ఎవరు మూర్ఖుడు?: - - యామిజాల జగదీశ్
 అనగనగా ఒక బిచ్చగాడికి రోడ్డు మీద ఒక విలువైన వజ్రం దొరికింది. 
అది విలువైన వజ్రం అని అతనికి తెలియదు.‌ కనుక దానిని తన గాడిద చెవికి తగిలించాడు. 
దీనిని గమనిస్తున్న ఒక వజ్రాల వ్యాపారి అతని దగ్గరకు వచ్చి, “ఈ రాయి నాకు ఇస్తే, నేను నీకు డబ్బు ఇస్తాను. నీకు ఎంత కావాలో అడుగు” అని అన్నాడు.
బిచ్చగాడు వెంటనే, “అయితే నాకు 100 రూపాయలు ఇచ్చి ఈ రాయిని ఉంచుకో” అని అన్నాడు.
అయితే వజ్రాల వ్యాపారి, దానిని  మరింత తక్కువ ధరకు దక్కించుకోవాలనే దురాలోచనతో, 
“దీనికి వంద రూపాయలు చాలా ఎక్కువ! నేను నీకు 50 రూపాయలు ఇస్తాను. ఇస్తే ఇవ్వు” అని అన్నాడు.
“మీ దగ్గర లేకపోతే పోనివ్వండి. ఈ రాయి గాడిద చెవికే ఉండనిస్తా" అన్నాడు బిచ్చగాడు ముందుకెళ్ళాడు.
కానీ వజ్రాల వ్యాపారిలో ఓ ఆశ. బిచ్చగాడు మనసు మార్చుకుని  దానిని తనకు 50 రూపాయలకే తనకిస్తాడేమోనని అతని పక్కనే నెమ్మదిగా నడుస్తున్నాడు. 
ఇంతలో అక్కడికి మరొక వ్యాపారి వచ్చి బిచ్చగాడికి 1000 రూపాయలిచ్చి బిచ్చగాడి నుంచి వజ్రాన్ని కొన్నాడు.
ఇలా జరుగుతుందని అస్సలు ఊహించని మొదటి 
వజ్రాల వ్యాపారి కంగుతిని“ఓరీ మూర్ఖుడా! కోట్ల రూపాయల విలువైన వజ్రాన్ని కేవలం వెయ్యి రూపాయలకు ఇచ్చేశావు...పైగా చాలా సంతోషంగా ఉన్నావేంటీ! నువ్వు మోసపోయావు!” అన్నాడు.
అప్పుడు బిచ్చగాడు పెద్దగా నవ్వుతూ, “ఎవరు మూర్ఖుడు..? దాని విలువ నాకు తెలీదు. కాబట్టి నేను వెయ్యి రూపాయలకు అమ్మేశాను. నువ్వు మరీ యాభై రూపాయలకే నా వద్ద నుంచి కొట్టేద్దామనుకున్నా వుగా.... నీకంటే అతనే నయం. వెయ్యి రూపాయలు ఇచ్చాడు. నాకది చాలా పెద్ద మొత్తం. కాబట్టే నేను చాలా సంతోషంగా ఉన్నాను. దాని విలువ తెలిసి కూడా 
నువ్వు దానిని కేవలం 50 రూపాయలే ఇస్తానని పోగొట్టుకున్నావు. నీదెంత పెద్ద మూర్ఖత్వమో కదూ !” అని  అన్నాడు.
ఔను, మనలో చాలామంది ఈ విధంగా మన విలువైన జీవితాన్ని 
చిట్టి పొట్టి ఆనందాల కోసం విలువైనవి పోగొట్టుకుంటూ ఉంటాం.

కామెంట్‌లు