సుప్రభాత కవిత : - బృంద
వేధించే వేదనలో
బాధించే భావనలో
ఘనీభవించిన మనసుపొరలు
కరిగిపోయే కరుణలా..

ప్రేమించే  బంధాల మధ్య
శోధించే కారణాలు వెదికి
పెరిగిన దూరాల మధ్య
చిగురించే ఆశల తోరణంలా..

కదలని శిలలా నిలిచిన 
కరగని మంచు పలకలకింద
చెమ్మ ఏదో కమ్మగా కదిలి
కధ మారే దిశ చూపే బాణంలా....

తలపులతో తలపడి 
తలుపులు మూసిన వాకిట 
కలుపులు తొలగించి 
వలపులు పెంచే కారణంలా..

హిమం కురిసిన రేయిలో 
అహం కొంచెం తరిగేలా..
అంతరంగపు  ఘర్షణలను
ప్రేరేపించే నిరీక్షణలా....

తాకే తొలి కిరణపు వేడికి 
తనకు తానే తొలగే అడ్డులా 
మనసులోపలి మర్మాలకు
మధుర ఫలితం అందించే వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు