కొన్ని సందర్భాలలో మమకారం కూడా మౌనంగా మారుతుంది.
గోకులంలో కృష్ణుని బాల్యం యశోద లాలనతో సాగింది. అతని బాల్య క్రీడల్లో భాగంగా వెన్నదొంగ అయిన కృష్ణుడిని రోటికి కట్టివేయడం, గోపికలను కృష్ణుడు ఆటపట్టించడం, తన నోటిలో విశ్వాన్ని యశోదకు చూపడం వంటివి అబ్బురపరిచే ఘట్టాలు. ఈ విధంగా కృష్ణుడి బాల్యమంతా గోకులంలో యశోద వద్దనే గడుస్తుంది. సాక్షాత్తూ విష్ణువునే బిడ్డగా లాలించే భాగ్యం దక్కిన గొప్ప తల్లి యశోదమ్మ. ఒకసారి కృష్ణుడు మట్టి తిని, తినలేదని అబద్ధం చెప్తాడు. నోరు తెరవాలని యశోద బలవంతం చేస్తుంది. అప్పుడు కృష్ణుడు తన నోట సప్త సముద్రాలను చూపిస్తాడు. మొత్తం విశాల విశ్వాన్ని కూడా ప్రదర్శిస్తాడు. దీంతో యశోద విస్తుపోతుంది. పాల సముద్రంపై తేలియాడే ఆదిశేషుని పానుపుపై లక్ష్మీ సహితంగా ఉన్న విష్ణువును కూడా యశోద ఆ నోట దర్శిస్తుంది. తల్లి ప్రేమకు, వాత్సల్యానికి యశోద పెట్టింది పేరు. ఇక, కృష్ణుడి సోదరుడైన బలరాముడితోనూ యశోదకు ఎంతో అనుబంధముంది. బలరాముడు రోహిణి కుమారుడు. ఈయన సోదరి సుభద్ర. యశోద జన్మనిచ్చిన యోగమాయ అంటే సాక్షాత్తూ కాళి అవతారమే.
కృష్ణుడు గోకులాన్ని విడిచిపెట్టి వెళ్ళ
వలసి వస్తుంది. నందుడు నిశ్శబ్దంగా కృష్ణుడి బట్టల మూటను రథంపై పెడతాడు. ఇదంతా గమనిస్తున్న యశోదను చూసి నందుడు ఇలా అంటాడు....
"ఎందుకు విచారంగా ఉన్నావు యశోదా? పరుల వస్తువుపై నీకు ఏ హక్కు ఉంటుంది?"
యశోద తల వంచి నందుడివైపు చూసింది. ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి.
నందుడు దగ్గరకు వస్తాడు.
యశోద స్వరం పెంచి "అయితే కృష్ణుడిపై మనకకు ఏ హక్కు లేదా? పదకొండు సంవత్సరాలు మనం అబద్ధాలతో బ్మతికేమా?" అని అడుగుతుంది.
నందుడు "ఎందుకు హక్కులు లేవు? కన్నయ్య ఎక్కడ ఉన్నా, వాడు మన బిడ్డే...! కానీ మనకంటే దేవకీ వసుదేవులకు అతనిపై ఎక్కువ హక్కు ఉంది. వారికే కృష్ణుడి అవసరం ఇంకా ఉంది..." అంటాడు.
యశోద నిందితుడి మాటకు అడ్డు తగిలి "అయితే నా ప్రేమకు ఏ విలువ లేదా?" అని అమాయకంగా అడుగుతుంది.
నందుడు అలసిన స్వరంతో అంటాడు "ప్రేమకు విలువ లేదు యశోదా. కానీ ఈ పదకొండు సంవత్సరాలలో కృష్ణుడు మనకు ఏమి ఇవ్వలేదో ఆలోచించు. ముసలి వయసులో బిడ్డపై ఆశ వదులుకున్నప్పుడు మన పెరట్లోకి వచ్చాడు. ఈ పదకొండు సంవత్సరాలలో మనం జీవించినంత సంతోషకరమైన జీవితాన్ని అంతకుముందెన్నడూ జీవించలేదని నువ్వు అనుకోవడం లేదా? పరుల వస్తువు నుండి ఇంకా ఎంత ఆశిస్తావు యశోదా? ఏదో ఒక రోజు కన్నయ్య తనదైన వారిని అడుగుతాడు కదా! కనుక కృష్ణుడిని వెళ్ళనివ్వు యశోదా"
యశోద నందుడి మాటలు తట్టుకోలేకపోయింది. ఉన్న చోటనే కూలబడిపోతుంది. "నన్ను దేనిని వదిలిపెట్టమని అడుగుతున్నారో మీకు అర్థం కావడం లేదు" అని విచార వదనంతో అడుగుతుంది యశోద.
నందుడి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. జీవితంలో ఏదో కోల్పోతున్నామనే బాధతో నందుడు "యశోదా, నువ్వు దేవకికి ఏమి ఇస్తున్నావో నాకంటే ఎక్కువగా ఎవరు అర్థం చేసుకోగలరు! రాబోయే లెక్కలేనన్ని యుగాలలో నీలాంటి మరో ఉదాహరణ ఉండదు. ఈ ప్రపంచం ఎల్లప్పుడూ నీ త్యాగానికి తలవంచుతుంది...." అని యశోదకు ఓదారుస్తాడు.
యశోద తన చీర కొంగుతో ముఖం కప్పుకుని అక్కడి నుంచి ముందుకు అడుగులు వేయగా నందుడు అంటాడిలా "ఇప్పుడు కన్నయ్యను వెళ్ళని చాలు... ఆలస్యం అవుతోంది".
యశోద తన ముఖంపై కొంగును మరింత గట్టిగా నొక్కి, అస్పష్టమైన స్వరంతో "ఒక్కసారి వాడికి నా చేత్తో తినిపించనివ్వండి, ఇప్పుడు వాడు వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత ఎవరికి తెలుసు...మళ్ళీ ఎప్పుడు చూస్తారేమో? అంటుంది.
నందుడు మౌనంగా ఉంటాడు.
యశోద వెన్న గిన్నెతో కూర్చుని, భావావేశంతో కన్నయ్య వైపు చూస్తూ, తన చేతులతో వాడికి తినిపిస్తోంది.
కన్నయ్య "అమ్మా! నేను ఒక విషయం అడగనా?" అని అంటాడు.
యశోద ప్రేమగా అంటుంది "అడుగు కృష్ణా....ఏం కావాలో చెప్పు....నీకు ఏం కావాలన్నా ఈ తల్లి ఇస్తుంది..." అని.
అప్పుడు కృష్ణుడు "వెన్న తిన్నందుకు నువ్వు ప్రతి రోజూ నన్ను తిట్టేదానివి కదా, మరి ఇప్పుడు నీ చేతులతో వెన్నను ఎందుకు తినిపిస్తున్నావు? అని అమాయకంగా అడుగుతాడు.
యశోద సమాధానం చెప్పాలనుకుంది కానీ గొంతు పెగలలేదు. ఆమె మౌనంగా తినిపిస్తూ ఉంటుంది.
అంతట కన్నయ్య అడిగాడు - "అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు?"
యశోద తన కన్నీళ్లను ఆపుకుని అంది "నువ్వు వెళ్లిపోతే నా గోవులను ఎవరు మేపుతారో అని ఆలోచిస్తున్నాను...."
కృష్ణుడు "ఆవుల గురించి ఆలోచిస్తున్న నువ్వు నా గురించి కూడా కొంచెం ఆలోచించమ్మా, అక్కడ నాకిలా వెన్న ఎవరు పెడతారు..." అంటాడు.
యశోద కన్నయ్యను గాఢంగా హత్తుకుని ముద్దు పెట్టి అంటుంది - " కృష్ణా అలా అనకు....అక్కడ దేవకి నీకు ప్రతిరోజూ వెన్న పెడుతుంది. నీకు ఏం లోటూ చేయదు బాబూ"
కృష్ణుడు "సరే, కానీ నీలా ఎవరు ప్రేమిస్తారు అమ్మా నన్ను?" అని యశోదను అడుగుతాడు.
ఈసారి యశోద కృష్ణుడిని మరింత గాఢతతో తనలోకి తీసుకుని మనసులో అనుకుంటుంది - "ఈ యశోదలా ఎవరూ నిన్నూ ప్రేమించలేరు. కానీ బహుశా ఈ ప్రేమకు ఇదే వయసు కాబోలు...." అని.
నందుడు కృష్ణుడిని రథం మీద కూర్చోబెట్టి అక్రూరుడితో కలిసి బయలుదేరినప్పుడు, యశోద అంది : "కొంచెం నా మాట వినండి. మీకు దేవకితో చెప్పండి, ఈ కన్నయ్య అల్లరివాడే కానీ ఎప్పుడూ ఇబ్బందిపెట్టడూ అని"
నందుడు అలాగే అంటాడు.
యశోద "నేను కృష్ణుడిని ఎప్పుడూ నా గుండెల్లోనే పెట్టుకుని పెంచాను..." అని అంటుంది.
నందుడు రథాన్ని ఆపాడు.
యశోద వెనుక నుండి అంటుంది - "ఈ చిన్నోడికి వెన్న అంటే చాలా ఇష్టమని దేవకితో చెప్పండి... అతనికి ఎప్పుడూ తాజా వెన్ననే తినిపించమని చెప్పండి...పాత వెన్నలో పురుగులు పడతాయి..." అని.
నందుడు కళ్ళు మళ్ళీ చెమర్చాయి. అతను గుర్రాన్ని అదిలించాడు. యశోద మళ్ళీ బిగ్గరగా అంది "పెద్ద ముద్దలు కాకుండా గోరుముద్దలు ఏ పెట్టమని ఉండి. పెద్ద ముద్దలైతే అతని గొంతులో అడ్డుపడతాయని చెప్పండి. నెమ్మదిగా తినిపించమని చెప్పండి...ఈ మాట చెప్పడానికి మీరేమీ మొహమాటపడకండి..." అని.
నందుడు గుర్రాన్ని అదిలించాడు, రథం ధూళి రేపుతూ ముందుకు సాగింది.
యశోద అక్కడే నేలపై కూర్చుని అంది.."కృష్ణుడిని నన్ను గుర్తుంచుకోమని చెప్పండి."
మరో రథంలో కూర్చున్న కృష్ణుడు "ఈ ప్రపంచం ఎప్పటికీ నిన్ను గుర్తుంచుకుంటుందమ్మా. నీ తర్వాత నా జీవితంలో ప్రాణం ఎక్కడ నిలుస్తుంది చెప్పమ్మా?" అని.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి