భలే పిల్లలు (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు

 తన ఇంటి ముందు స్నేహితురాలితో రింగ్ బాల్ ఆట ఆడుతుంది శ్రుతి. కాసేపు అలా ఆడుకోగానే హఠాత్తుగా ఒక దృశ్యం మీదికి చూపు నిలిచింది శ్రుతికి. తన ఇంటి ముందు కాంపౌండ్ వాల్ మీద ఒక బుల్లి పక్షి వాలి ఉంది. చాలా ముద్దుగా ఉంది. ఆ పక్షిని ఎన్నడూ చూడలేదు శ్రుతి. ఇది రోజూ తన ఇంటి ముందుకు వచ్చి, తిరుగుతంటే ఎంత బాగుంటుంది? అనిపించింది శ్రుతికి. రోజూ ముచ్చట తీరా దీనితో ఆడుకోవచ్చు అనిపించింది. ఇంట్లోకి వెళ్ళి సెల్ ఫోన్ తెచ్చి, ఆ పక్షిని ఫోటో తీసింది శ్రుతి. ఆ పక్షి బెదిరి, ఎగిరి మరోచోట వాలింది. శ్రుతి ఆ పక్షిని బెదరగొట్టడం ఇష్టం లేక మళ్ళీ ఆ పక్షి వాలిన వైపు వెళ్ళి దూరం నుంచే తనివి తీరా చూస్తుంది. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చింరో ఓ మాయదారి దిక్కుమాలిన పిల్లి ఆ పక్షిని నోట కరచుకొని వెళ్ళింది. శ్రుతికి ఏడుపు ఆగలేదు. 
     శ్రుతి స్నేహితురాలు లయ "ఎందుకు అంతలా ఏడుస్తున్నావు. ఇలాంటి పక్షులను ముందు ముందు ఎన్నింటినో చూడవచ్చు. వాటితో ఆడుకోవచ్చు." అన్నది. శ్రుతి ఏడుపు ఆగలేదు. లయ వెళ్ళి శ్రుతి తల్లిదండ్రులతో విషయం చెప్పింది. తల్లిదండ్రులకు నోట మాట రాలేదు. దీనికే ఇంతలా ఏడవాలా? అనుకున్నారు. ఎలా ఓదార్చాలో వారికి అర్థం కాలేదు. 
     ఆ తర్వాత రోజు సాయంత్రం శ్రుతిని తండ్రి డాబా పైకి తీసుకెళ్ళి ఆకాశంలో ఎగురుతున్న రామచిలుకలను చూపించాడు. అప్పుడు కొన్ని, అప్పుడు కొన్ని అదేపనిగా ఎగురుతున్నాయి. శ్రుతి ఆరోజు నుంచి ప్రతిరోజూ వాటిని చూస్తూ ఆనందించింది. కానీ తృప్తి కలగలేదు. లయ ఒక సలహా ఇచ్చింది. ఏదైనా పాత్ర తీసుకుని వాటిలో ఆహార ధాన్యాలను ఉంచమని వాటిని తినడానికి పక్షులు వస్తాయని, అప్పుడు వాటిని మన నేస్తాలే అనుకొని వాటిని చూస్తూ సమయం గడపవచ్చని లయ సలహా ఇచ్చింది. శ్రుతి రోజూ సాయంత్రం కాసేపు లయ చెప్పినట్లు చేసేది. ఎండాకాలం వస్తే పాత్రలలో మంచినీళ్ళు ఉంచి పక్షులు వచ్చి తాగుతుంటే ఆనందించేది శ్రుతి. శ్రుతితో లయ కూడా ఆ ఆనందంలో పాలు పంచుకుంది. ఈ రోజుల్లో పిల్లలు విలువైన సమయాన్ని సెల్ ఫోన్ల ఆటలతో వృథా చేస్తున్నారు. వారితో పోల్చితే ఈ పిల్లలు చాలా ముచ్చట అనిపించారు పెద్దలకు.

కామెంట్‌లు