సంపూర్ణ మహాభారతము*సరళ వ్యావహారిక భాషలో...!

 వన పర్వము ప్రథమాశ్వాసము-* 69 వ రోజు*:
-మైత్రేయుడు
వ్యాసుడు చెప్పినట్లు కొన్ని రోజుల తరువాత మైత్రేయుడు ముందుగా పాండవులను చూచి హస్థినాపురం వచ్చాడు. ధృతరాష్ట్రుడు మైత్రేయునికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. మైత్రేయుడు " నేను కామ్యక వనంలో ఉన్న పాండవులను చూసి వచ్చాను. వారు అడవులలో కందమూలాలను తిని జీవిస్తున్నారు " అన్నాడు. పాండవులు క్షేమంగా ఉన్నారా " అని ధృతరాష్ట్రుడు అడిగాడు. మైత్రేయుడు " ఓ రాజా! పాండవులు ధర్మబుద్ధి కలవారు. వారికి మహర్షుల దీవెనలు ఉన్నాయి. అందు వలన క్షేమమే " అన్నాడు. దుర్యోధనుని వైపు తిరిగి " కుమారా! నీకు బుద్ధి ఉంటే పాండవులతో వైరం వదులుము. అలా చేస్తే నీవు కురువంశానికి మేలు చేసిన వాడివి ఔతావు. పాండవులు వజ్ర శరీరులు. భీముడు హిడింబుని, బకాసురుని, జరాసంధుని, కిమ్మీరుని వధించిన బలాడ్యుడు. అతనిని వధించగల యోధులు లేరు. శ్రీకృష్ణుడు, దుష్టద్యుమ్నుని బంధుత్వం పాండవులకు మరింత బలాన్నిచ్చింది. కనుక నీవు పాండవులతో స్నేహం చేయటం మంచిది " అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు తన తొడలు చరిచి మహర్షిని అవమానించాడు. అందుకు మైత్రేయుడు ఆగ్రహించి " సుయోధనా ! యుద్ధభూమిలో భీముని గదాఘాతం నీ తొడలను విరవకలదు " అని మైత్రేయుడు అన్నాడు. ధృతరాష్ట్రుడు భయపడి మహర్షిని శాపవిమోచనం ఇవ్వమని వేడుకున్నాడు. మైత్రేయుడు "మహారాజా! నీ కొడుకు పశ్చాత్తాపం చెంది మంచి బుద్ది కలిగి ఉంటే ఈ శాపం వర్తించదు " అన్నాడు.
కిమ్మీర వధ
దుర్యోధనునికి శాపం ఇచ్చిన తరువాత ధృతరాష్ట్రుడు " మహాత్మా! కిమ్మీరుడనే రాక్షసుడు భీముని చేతిలో ఎలా చనిపోయాడో వివరిస్తారా? " అని అడిగాడు. మైత్రేయుడు " నా మాటను నీ కొడుకే వినలేదు. నేనెందుకు చెప్పాలి విదురుని అడిగి తెలుసుకో " అని చెప్పి వెళ్ళి పోయాడు. విదురుడు కిమ్మీరుని వృత్తాంతం ఇలా వివరించ సాగాడు. " పాండవులు ఒకరోజు అడవిలో విశ్రమించవలసి వచ్చింది. వికృతాకారుడైన రాక్షసుడు పాండవుల దారికి అడ్డంగా నిలిచాడు. ఆ రాక్షసుని చూసి ద్రౌపది భయంతో కళ్ళు మూసుకుంది. ఇంతలో ధౌమ్యుడు తన మంత్రశక్తితో ఆ రాక్షసుని మాయను భగ్నం చేసాడు. ఆ రాక్షసుని చూసి ధర్మరాజు " నీ వెవరు ఈ అడవిలో ఎందుకు ఉన్నావు " అని ఆడిగాడు. దానికి ఆ రాక్షసుడు " నేను బకుడు అనే రాక్షసుని తమ్ముడిని. నా పేరు కిమ్మీరుడు. మనుష్యులను చంపి తింటూ ఉంటాను నాకు భయపడి ఎవరూ ఈ అరణ్యానికి రారు. మీరు ఎవరు? ఈ అరణ్యానికి ఎందుకు వచ్చారు? " అని అడిగాడు. ధర్మరాజు " నా పేరు ధర్మరాజు వీరు నా సోదరులు. మేము వనవాసం చేస్తూ ఇక్కడకు వచ్చాము " అన్నాడు. ఇది విని ఆ కిమ్మీరుడు " నా అన్న బకుని చంపిన భీముడు వీడేనా . వీడిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను. నేను వీడి కోసమే వెతుకుతున్నాను " అని వికటాట్టహాసం చేసాడు. ఇది విని అర్జునుడు గాండీవం ఎక్కు పెట్టాడు కానీ ఈలోగా భీముడు కిమ్మీరుని ఎదుర్కొన్నాడు. ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేసారు. చెట్లతోనూ రాళ్ళతోనూ కొట్టుకున్నారు. చివరకు భీముడు కిమ్మీరుని అతని అన్న బకుని చంపినట్లు అతని దేహాన్ని విరగదీసి చంపాడు. ఈ విధంగా భీముడు కామ్యక వనంలో రాక్షస భయం లేకుండా చేసాడు " అని చెప్పాడు. ఇది విని ధృతరాష్ట్రుడు కలత చెందాడు.

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు