వేసవి సెలవులలో అమ్మమ్మ ఇంటికి అమ్మా నాన్నలతో కలిసి పల్లెటూరికి చేరుకున్నారు పిల్లలు. సెలవులలో సరదాగా ఆడుకోకుండా టీవీలో వచ్చే క్రికెట్ ఆటలకు అతుక్కుపోయారు. తల్లిదండ్రులకు అసహనంగా ఉంది. సరదాగా ఆడుకోండి అని ఎంత చెప్పినా ఫలితం శూన్యం. పోనీ ఆ ఆటలైనా సరదాగా చూస్తున్నారా అంటే క్రికెట్ ఆట చూడటం పూర్తి అయ్యాక ఒకరు ఆనందంగా ఉంటే మిగిలిన వారు నిరాశ పడుతున్నారు. ఏ రోజు ఆట గెలిచిందని ఎవరు ఆనందంగా ఉంటారో ఎవరు నిరాశ పడతారో చెప్పడం కష్టం. ఇవేం ఆటలు బాబోయ్ అనుకున్నారు అమ్మమ్మ తాతయ్యలు. మా టీం గెలిచింది, మీ టీం చిత్తుగా ఓడిపోయింది అని చేసుకునే హేళనలు ఎక్కువైనాయి. చివరకు గొడవలు శ్రుతి మించి కొట్టుకోవడం దాకా వచ్చింది. పెద్దమ్మ విమల జోక్యం చేసుకుని, పిల్లల అందరినీ కూర్చోబెట్టుకుని, "ఎండాకాలం సెలవులలో మా చిన్నతనంలో రకరకాల ఆటలు ఆడి, ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పటి పిల్లలు వేస్ట్. టీవీలు, సెల్ ఫోన్లూ, క్రికెట్ ఇది తప్ప మరో లోకమే లేదు." అని తిట్టడం మొదలు పెట్టింది.
తన చెల్లెలి కొడుకు సురేంద్రతో "జూన్ నుంచి నువ్వు ఏ క్లాసులో ఉంటావు?" అని అడిగింది? "10వ తరగతి." అని చెప్పాడు సురేంద్ర. "మరి మొదటి నుంచే ఏరోజు చెప్పే పాఠాలను ఆరోజు చదవాలి. రాత్రి 9 గంటలకే నిద్రపోయినా నష్టం లేదు కానీ రోజూ ఉదయం 4 గంటలకే లేచి చదవుకోవడం మొదలుపెట్టాలి. ఆ ప్రశాంత సమయంలో ఎంత కఠనమైన విషయాలు చదివినా తొందరగా నోటికి వస్తాయి. మళ్ళీ చెబుతున్నా ఉదయం 4 గంటలకే రోజూ నిద్రలేచి చదవడం అలవాటు చేసుకో. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేటప్పుడు పరధ్యానంగా ఉండకుండా శ్రద్ధగా వినడం, అర్థం కాకపోతే మళ్ళీ చెప్పించుకోవడం తప్పనిసరి. అప్పుడు వార్షిక పరీక్షలలో అత్యుత్తమ మార్కులు వస్తాయి." అని హితబోధ చేసింది. వేసవు సెలవుల్లో మిగిలిన రోజులు విమల పిల్లలతో కలిసిపోయి రకరకాల ఆటలు ఆడింది.
సెలవులు ముగిసాయి. పిల్లలు తమ ఊళ్ళకు వచ్చినారు. శ్రీవాణి 7వ తరగతి చదువుతున్నది. ప్రతిరోజూ పడుకునే ముందు వాళ్ల నాన్నను బతిమాలి సెల్ ఫోన్ తీసుకునేది. తెల్లారి ఆ సెల్ ఫోన్ నాన్నకు ఇచ్చేది. సురేంద్ర "నాన్నా! సెల్ ఫోనుతో చెల్లెలు మాత్రమే ఆదుకోవాలా? నాకు ఆడుకునే అర్హత లేదా?" అని అడిగాడు. "నువ్వు ఇప్పుడు 10వ తరగతి. నీకు చదువే ముఖ్యం. టీవీలు, ఫోన్లూ కాదు." అన్నాడు నాన్న. సురేంద్ర అలిగాడు. సురేంద్ర రోజూ తీరికగా 7 గంటలకు నిద్ర లేచేవాడు. చదువును పూర్తిగా పక్కన పెట్టాడు.
దసరా సెలవులు వచ్చాయి. సురేంద్ర వాళ్ల పెద్దమ్మ విమల సెలవులను గడిపేందుకు తన చెల్లెలి ఇంటికి వచ్చింది. సురేంద్ర, శ్రీవాణి ఇద్దరూ పెద్దమ్మ దగ్గరకు వచ్చారు. విమల సురేంద్రను ఎలా చదువుతున్నావని అడిగింది. తాను చాలా బాగా చదువుతన్నానని చెప్పాడు. పెద్దమ్మ చెప్పినట్లు రోజూ ఉదయం 4 గంటలకే లేచి చదువుతున్నానని అన్నాడు. ఫక్కున నవ్వింది శ్రీవాణి. సురేంద్రకు చెల్లెలిని కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది.
విమల సురేంద్రను సబ్జెక్ట్ పుస్తకాలను తెమ్మన్నది. సురేంద్ర తప్పించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. శ్రీవాణి తన సబ్జెక్ట్ పుస్తకాలను తెచ్చి ప్రశ్నలు అడగమంది. విమల ఏ ప్రశ్న అడిగినా శ్రీవాణి టక్కున సమాధానాలు చెబుతుంది. విమల ఆశ్చర్యపోయింది. "పెద్దమ్మా! ఎండాకాలం సెలవుల్లో అన్నయ్యకు ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే లేచి చదివితే ఉపయోగాలను చెప్పావు. అన్నయ్యకే చెబుతావా? నాకు చెప్పవా? 10వ తరగతే గొప్పగా? 7వ తరగతి కాదా? అనిపించింది. నువ్వు చెప్పినట్లు చేయాలని అనిపించింది. అందుకే ప్రతిరోజూ రాత్రి నాన్న సెల్ ఫోన్ తీసుకొని, రోజూ ఉదయం 4 గంటలకు అలారం పెట్టుకుని, పట్టుదలతో చదివాను. మొదటిసారి మా తరగతిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. అవును. ఉదయం ప్రశాంతమైన వాతావరణంలో ఎంత కష్టమైన విషయం చదివినా తేలికగా నోటికి వస్తుంది. థాంక్స్ పెద్దమ్మ!" అన్నది శ్రీవాణి. ఆశ్చర్యపోయింది విమల. సురేంద్ర సిగ్గుతో తల దించుకున్నాడు. చెల్లెలిని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని అనుకున్నాడు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి