సామెతల ఊట -సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు,ఖమ్మం

 సామెత -71-అమాయికుడికి అక్షింతలు ఇస్తే -అవతలికి వెళ్ళి నోట్లో వేసుకుండట
****
"అరెరే ఏందిరా వారీ! ఒక్క పనన్న సరిగ్గ చెయ్యవు గదరా? పెన్నెట్ల పడుతుందా? అని దాని ములికి దీసి సూత్తవు? కూరగాయల గింజలు నాటుబెడ్తే నాటుకున్నయా లేదా సూడురా! అన్న పాపానికి దినాం  పాదుల్ల నుంచి తీసుడు,సూసుడు జేసి ఇంగవి మొల్వకుండ జేసినవు.ఎట్లరా అయ్యా నీతోటి? అమాయికుడికి అచ్చింతలిత్తె అవతలికెల్లి నోట్లో ఏసుకున్నట్టుంది నీ కత!.
కత అన్న మాటిని రయ్యిన ఉరికొచ్చి భూలచ్మి "అవ్వా! అవ్వా! గా కతేందో చెప్పవా? తమ్మి లాంటోడు ఏం జేసిండేంది? జర జెల్ది చెప్పవ్వా! యినబుద్దైతాంది" బల్లెపీట మీద కూసోని తమ్ముడితో మాట్లాడుతున్న అవ్వ భుజాల మీద శేతులేసి గార్వాలు బోతూ అడ్గడంతో శెప్పుడు షురూ చేసిందవ్వ.
అన్గనగా ఒకూల్లె ఒకవ్వకి బుడ్డోడంత మన్వడుండు. వాడొట్టి అమాయికుడు. వాడికి తెల్వి ఎప్పుడొత్తదో ఏమోనని రంధి పెట్టుకుంటది.
అవ్వా ! అవ్వా!తెల్వేగా నేను బయటికెల్లి తెచ్చుకుంటనని, ఎంత ఆపినా ఆగకుండా ఉరుక్కుంట ఎల్తడు. దార్లో ఒకాయన మేకల్ని తోలుకొని అడివికి ఎల్తూ ఈ బుడ్డోన్ని చూసి నా మేకల్ని కాత్తవా? నీకో మేకపిల్లనిత్త అంటడు.గట్ల పొద్దుగాల ఉరికి పోవుడు పొద్దుగూకి వచ్చుడు. గట్ల పది దినాల్కి మేకలాయన ఓ  మేక పిల్లను ఇచ్చి సాదుకోమంటడు. గీ బుడ్డోడు గా మేకపిల్లని నెత్తి మీద బెట్కొని వత్తుంటే అవ్వ జూసి గట్ల గాదురా! దాని మెడకి తాడు గట్కొని తోల్కరావాలె అంటుది.
గట్లనే ఓ పాలి  అవ్వోళ్ళ  అక్కకి చేతగాట్లేదని తెల్సి గింత సాయం చేసిరారా అని పంపిత్తది.
అవ్వోల్ల అక్కకి  రొట్టెలు చేయడానికి సాయం చేత్తే ఓ రొట్టెను ఇంటికి కొంటబో అని ఇస్తుంది. గాదాన్ని సూడంగనే అవ్వ మాటలు మతికొత్తయి.ఎంటనే బయటికొచ్చి రొట్టెకి తాడు గట్టి దారెంబటి గుంజుకుంట తెచ్చే తల్కి గా రొట్టె నిండా మన్ను బురద,శెత్త అంటుతై.
"గిట్ల దెచ్చినవేరా?" అంటే "నువ్వేగా తాడు గట్టి తెమ్మంది అంటడు. "గిస్మంటివి ఎవలన్న గట్ల తెత్తరా? కీసలో బెట్కొని రావాలె " అని చెబ్తుంది.బుద్ధిగ తలూప్తడు.
గట్ల మల్లోపాలి ఓ తాత బర్రెకు గడ్డి కోస్కరమ్మంటె పచ్చిగడ్డి కోస్కొచ్చి ఇత్తడు.గట్ల వారం దినాలైనంక ఆ తాత ఓ గిన్నెనిండ ఎన్నముద్ద పెట్టి ఇంటికి కొంటబొమ్మని శెప్తడు.గప్పుడు గీ బుడ్డోడు గిన్నెద్దు ఏమొద్దు అన్కుంట ఎన్న ముద్దను కీసలేస్కొని వత్తడు.గది కాత్త ఎండకి కర్గి కీసనించి జారిపోద్ది. వాళ్ళవ్వ మస్తు రంధి పడుద్ది. గట్లనే ఓ సుట్టాల పెండ్లికి తోల్కపోద్ది.
గక్కడ పెండ్లి పిల్ల, పెండ్లి పిలగాని మీద జల్లేందుకు అచ్చింతలు పంచుతరు. గవ్వి పిడికిట్ల బట్కొని ఏం జెయ్యాలో తెల్వక అవతల్కి ఎల్లి నోట్లె ఏస్కుంటడు.
గజ్జూసిన సుట్టపోళ్ళు వొక్కడ వొక్కడ నవ్వుకుంట గీడికి ఎవులల్లా అచ్చింతలిచ్చింది? తెల్వదాయె మిడకదాయె. "అమాయికుడికి అచ్చింతలిత్తె- అవతలికెల్లి నోట్లో ఏసుకునె" అని ఒక్క తీర్గ అనబట్టిండ్రు.
గట్ల గా బుడ్డోడి అమాయికత్వం పోగొట్టడాన్కి అవ్వ శెయ్యని పయత్నాలు లెవ్వు. అచ్చం ఆడి లెక్కనే నువ్వు సుత. ఏం జెయ్యాలో ఏమో" అంటుంటే...
"అవ్వా! నేనేం గట్ల గాదు. నాకు చానా తెల్వుంది.బల్లె సార్లు నన్ను మస్తు మెచ్చుకుంటరు" అంటుంటే..నువ్వుకుంట"గట్ల మొక్కల్నెందుకు పాడుజేసినవ్ రా మరి"అనంగనే బుడ్డోడు అవ్వా ! గవి ఉడ్కబెట్టినయ్.గవ్వి నాటుకుంటయా లేదాని దినాం జూస్నగని మొల్వలే. గట్ల ఉడ్కబెట్టినయ్ మొల్వవని తెల్సుకున్న తెల్సా?
"వార్నీ !నీ తెల్వి! అన్కుంట దగ్గరకు తీసుకొని ముద్దుబెట్టుకుంది అవ్వ.
గదండీ సంగతి! "అమాయికుడికి అచ్చింతలిత్తె- అవతలికెల్లి నోట్లో ఏసుకున్నట్టుంది " అంటే గిదే.గస్మంటోళ్ళు ఇచ్చిన,వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేరు.గిట్ల అమాయికమైన పనులు చేసి అందరి నోళ్ళల్ల బడుతుంటరు.

కామెంట్‌లు