ఉత్తమ వ్యసనం : సరికొండ శ్రీనివాసరాజు
 తిరుమలేశు 9వ తరగతి చదువుతున్నాడు. ఇంటిపట్టున అసలే ఉండడు. మిత్రులతో కలసి గంటల తరబడి ఆటలు ఆడి ఎప్పుడో తిరిగి రావడం అతని నిత్య కృత్యం. సెలవు రోజుల్లో తిరుమలేశం ఇంటిపట్టున అసలే ఉండడు. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నం చేసినా మనోడిని మార్చలేకపోయారు. 
       తిరుమలేశం చెల్లెలు సిరి 6వ తరగతి చదువుతున్నది. చాలా తెలివైన అమ్మాయి. సిరి చిన్నతనం నుంచే ఇష్టపడి చదవడం అలవాటు చేసుకుంది. తరగతిలో ఎప్పుడూ మొదటి ర్యాంక్ వచ్చేది. తల్లిదండ్రులకు తిరుమలేశ చదువు మీద దిగులు పెరుగుతుంది. తిరుమలేశ వాళ్ల అమ్మ తన శ్రేయోభిలాషితో తన దిగులు చెప్పుకుంది. నీతికథలను నిరంతరం చెబుతూ ఉండమని, అలాగైనా కొడుకులో మార్పు రావచ్చని హితబోధ చేసింది శ్రేయోభిలాషి. 
      తిరుమలేశ తల్లి నీతి కథల పుస్తకాలను కొనడం మొదలు పెట్టింది. విపరీతంగా కొంటుంది. కొడుకును చదవమని పట్టు పట్టింది. మూర్ఖుడైన తిరుమలేశు తల్లి మాటలను పెడచెవిన పెట్టాడు. కథల పుస్తకాల వైపు చూడటం లేదు. గాలి తిరుగుళ్ళు మానలేదు. అయితే సిరి కథల పుస్తకాలను పుస్తకాల పురుగుగా మారి విపరీతంగా చదువుతుంది. 
       పొరుగునే ఉన్న రాము అనే అబ్బాయికి తిరుమలేశం ఇంట్లో కథల పుస్తకాలు క్రమం తప్పకుండా తెప్పిస్తున్నట్లు తెలిసింది. కథల మీద అభిరుచితో రాము క్రమం తప్పకుండా తిరుమలేశ ఇంటికి వెళ్లి, కథలు చదువుతున్నాడు. కథల మీద రాముకు ఉన్న అభిరుచిని చూసి, తిరుమలేశ తల్లిదండ్రులకు ముచ్చట వేసింది. పొరుగింటి అబ్బాయి రామును చూస్తూ అయినా తన కుమారుడు గుణపాఠం నేర్చుకుంటాడు అనుకున్నారు తిరుమలేశ తల్లిదండ్రులు.  ఒక దశలో తాము ఆశించిన విధంగా నీతి కథల పుస్తకాలు కొడుకును ఏ మాత్రం  ప్రభావితం చేయనందున కథల పుస్తకాలను కొనడం ఆపేద్దాం అనుకున్న తల్లిదండ్రులు తమ కూతురు ఆ నీతి కథల పుస్తకాలకు బానిస అవడంతో పాటు పొరుగింటి అబ్బాయి కూడా ఆ కథల పుస్తకాల కోసం తమ ఇంటికి నిరంతరం రావడం వల్ల తాము ఖర్చు చేస్తున్న డబ్బులకు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని తిరుమలేశు తల్లిదండ్రులు మరింత సంతోషంతో కథల పుస్తకాలను కొనడం పెంచినారు. 

కామెంట్‌లు