నేనూ, నా ప్రాథమిక విద్య:- - యామిజాల జగదీశ్
 టీ. నగర్ (మద్రాసు)లోని గ్రిఫిత్ రోడ్డులోని శ్రీ రామకృష్ణా మిషన్ ఎలిమెంటరీ స్కూల్లో నా ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. అయితే ఆ వీధికి ప్రముఖ సంగీత విద్వాంసుడు మహారాజపురం సంతానం పేరు పెట్టారు. 1961 నుంచి1965 వరకు అయిదు తరగతులు ఇక్కడ చదువుకున్నాను. 
నేను చదువుకున్న ఒకటో తరగతి స్కూలు పక్కనే ముప్పాత్తమ్మన్ పేరిట అమ్మవారి గుడి ఉంది.‌ మామూలు రోజుల్లో కంటే పరీక్షల సమయంలో ఈ గుళ్ళో ఎక్కువ ప్రదక్షిణలు చేసే వాడిని, మార్కులొస్తాయేమోనని. కానీ ఒక విషయం మర్చిపోయే వాడిని....చదివి రాస్తేనే కదా మార్కులొస్తాయనే నిజాన్ని. ఇప్పుడు ఈ విషయాన్ని తలుచుకుంటే నవ్వొస్తోంది. ఎంత అమాయకమైన ఆశతో ప్రదక్షిణలు చేశానో అని. ఈ గుడి కూడా పూర్తిగా మారిపోయింది.
అయినా నేను సగటు మార్కులతో ప్యాసైన వాడిని.‌ ఒక్కొక్కసారైతే క్వార్టర్ ఫైనల్లోనైనా సెమీఫైనల్లోనైనా రెండు మూడు సబ్జెక్టులలోనైనా ఫెయిలై పోయేవాడిని. అయితే ఎలాగోలా ఫైనల్ ఎగ్జామ్సులో అతి కష్టంతో గట్టెక్కే వాడిని. ఎందుకో చదువెక్కలేదు. చేదైంది. 
ఒక్క తెలుగు తప్ప మిగిలిన సబ్జెక్టులన్నీ భయం. అయితే ఎక్కాలలో ఒకటో ఎక్కం, పదో ఎక్కం అంటే ఇష్టం. ఇప్పటికీ ఇష్టం. పదమూడు, పందొమ్మిదో ఎక్కాలంటే చచ్చేంత భయమూ కోపమూ.... 
రెగ్యులర్ గా స్కూలుకి వెళ్ళేవాడిని. భయంతోనో లేక మరే కారణమో గుర్తుకు రావడం లేదు. ఒకటో క్లాసులో అయితే రెండు మూడు వారాలు స్కూలు ఎగ్గొట్టి వీధి మొదట్లో ఉన్న ఓ చిన్నపాటి రాయిమీద కూర్చునే వాడిని. అక్కడ ఇప్పుడు ఆ రాయి ఉంటే ఫోటో తీద్దామనుకున్నాను. కానీ కనిపించలేదు. అయినా నేను చదువుకున్న రామకృష్ణా మిషన్ విద్యాలయమంటే చాలా ఇష్టం. ఒకటో క్లాస్ టీచర్ అన్నపూర్ణగారి రూపం బాగా గుర్తు.


కామెంట్‌లు