ప్రపంచ మహాసభలకు తిరుమలరావుకు పిలుపు

 పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు మరో ఘనత సాధించారు. ఈనెల 27,28 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు కవుల మహాసభలకు హాజరవ్వాలంటూ తిరుమలరావుకు ఆహ్వానం అందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జానపద అకాడమీ తొలి అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరుగనున్న కార్యక్రమాలకు తిరుమలరావు ఆహ్వానం పొందారు. ప్రపంచీకరణ నేపథ్యంలో, సాంకేతిక సమాజంలో, ఏఐ అనబడే కృత్రిమ మేథస్సు జోరును ఎండగడుతూ మాతృభాషా ప్రయోజనాలను ప్రాముఖ్యతనూ వివరిస్తూ, తెలుగు సాహిత్య సాంస్కృతిక కళాభివృద్ధిని కాంక్షిస్తూ మేము సైతం భాగస్వామ్యులం అంటూ మహాసభలకు తరలిరావాలని ఆహ్వానపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లక్షమంది తెలుగు భాషాభిమానులు సాహిత్య సాంస్కృతిక ప్రముఖులు హాజరౌతున్న ఈ కవుల మహాసభలకు తనకు ఆహ్వానం రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. విజయవాడలో ఐదు వేదికల్లో ఈ కవుల సంబరాలు జరుగుతుండగా ప్రధాన వేదిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, రెండవ వేదిక కలక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశమందిరాన, మూడవ వేదిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మందిరాన,  నాలుగవ వేదిక బుక్ ఫెస్టివల్ మందిరాన, ఐదవ వేదిక రామ్మోహన్ గ్రంథాలయాన నిర్వహించుచున్నారని తిరుమలరావు తెలిపారు. 1994 ప్రపంచ తెలుగు మహాసభలు మద్రాస్ లో నిర్వహించినపుడు కళ్ళు అనే కవిత ద్వారా పురస్కారం పొందిన తిరుమలరావు, తన రచనలతో సహస్ర కవిమిత్ర, తెలుగు దీప్తి, గిడుగు రామమూర్తి పంతులు పురస్కారం, కాళోజీ నారాయణరావు పురస్కారం వంటి పురస్కారాలు ఎన్నో అందుకున్నారు. 
కవితల, కథల, సప్తపదుల, అష్టాక్షరీ, సుభాషితాల, వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో పలు సార్లు విజేతగా నిలిచారు. ఇటీవల సాహితీ విలువలతో కూడిన తపస్వి మనోహరం సంకలనానికి ముఖచిత్రంపై తిరుమలరావును నిలిపి గొప్ప విశిష్టతతో కూడిన గౌరవాన్ని పొందారు. ఐదేళ్ల క్రితం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన హమ్ ఫర్ నేచర్ పాటల పోటీలో విజేతగా నిలిచిన తిరుమలరావు, నేడు ప్రపంచ స్థాయి వేదికపై అవకాశం లభించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు