ఇదా కారణం?: - సరికొండ శ్రీనివాసరాజు
 ప్రతి సెలవు రోజున స్నేహితురాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారితో ఆడుకొని వస్తానని మధుగీతిక తల్లిదండ్రుల అనుమతి తీసుకుంది. మధుగీతిక చిన్నప్పటి నుంచీ చాలా తెలివైన అమ్మాయి. బుద్ధిమంతురాలు. చదువుతో పాటూ ఆటవిడుపూ ఉండాలని తల్లిదండ్రులు కూతురికి ఆటలకు అనుమతి ఇస్తున్నారు. మధుగీతిక అలా ప్రతిరోజూ ఇద్దరు మిత్రుల ఇళ్ళ చొప్పున ఒక్క నెలలో 12 మంది స్నేహితురాళ్ళ ఇళ్ళకు వెళ్ళి కరవు తీరా ఆడుకొని వచ్చింది. ఇంతలో మధుగీతిక పుట్టిన రోజు వచ్చింది. 9 మంది స్నేహితురాళ్ళను మాత్రమే పుట్టిన రోజు వేడుకలకు తన ఇంటికి ఆహ్వానించింది. వేడుకలు చాలా బాగా జరిగాయి.
     మరునాడు మధుగీతిక పాఠశాలకు వెళ్ళగా అనిత, వందన, హారిక అనే అమ్మాయిలు మధుగీతిక వద్దకు వచ్చి, "నిన్న నీ పుట్టిన రోజు వేడుకలకు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? మేము ఏం పాపం చేశాము? ఇటీవల మా ఇళ్ళకు వచ్చి, మాతో బాగా ఆడుకున్నావు కదా!" అని నిలదీశారు. మధుగీతిక ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ ముగ్గురూ మధుగీతిక ప్రాణ మిత్రురాలిని పట్టుకొని, మధుగీతిక తమను ఎందుకు పక్కన పెట్టిందని నిలదీసినారు. ఆ ప్రాణ మిత్రురాలు కారణం చెప్పింది.
     గత సంవత్సరం మధుగీతిక తన ప్రాణమిత్రులైన 12 మందిని తన పుట్టిన రోజు నాడు తన ఇంట్లో జరుగుతున్న వేడుకలకు పిలిచింది. వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంటికి వెళుతున్న స్నేహితులకు తలా ఒక మొక్కను ఇచ్చింది. నిజంగా తన ప్రాణ స్నేహితులైతే ఈ మొక్కలను వారు నాటి, ప్రతిరోజూ వాటి సంరక్షణ బాధ్యతను చూసుకోవాలని చెప్పింది. ఒకవేళ ఆ మొక్కలు నాటుకోకున్నా, మధ్యలో వాటికి ఏమైనా తనకు చెపితే మరో మొక్కను ఇస్తానని చెబుతుంది. వాటిని పెద్ద చెట్లు అయ్యేవరకు వాటిని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకోవాలని చెప్పింది. తన పుట్టిన రోజు మరో నెల రోజులు ఉంది అనగా ఒక్కొక్క సెలవు రోజు ఇద్దరు మిత్రురాళ్ళ ఇళ్ళకు వెళ్ళింది. వాళ్ళతో ఆడుకోవాలి అనే కారణంతో వాళ్ల ఇండ్లకు వెళ్ళి, పనిలో పనిగా తాను గత పుట్టిన రోజు నాడు వాళ్లకు ఇచ్చిన మొక్కలను ఎలా సంరక్షిస్తున్నారో అడిగి, వాటిని చూసింది. అనిత, వందన, హారిక ఇళ్ళలో తాను ఇచ్చిన మొక్కలు లేవు. ఏమైనాయని అడిగితే ఇద్దరు ఏవో కారణాలు చెప్పి, టాపిక్ మార్చి మాట్లాడబోయారు. మరొకరు నీళ్ళు నమిలారు. మధుగీతిక చాలా బాధపడింది. అందుకే వారిని తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంచింది. మంచి స్నేహితురాలి స్నేహాన్ని కోల్పోయామని బాధపడ్డారు ముగ్గురూ. కొత్త మొక్కలను కొనుక్కుని వచ్చి, వాటిని నాటి, నిరంతరం సంరక్షించాలని నిర్ణయించుకున్నారు వారు. 

కామెంట్‌లు