సామెత -75: - అడగబోయిన అలీసాబ్ అటే బోయిండు -పిలవబోయిన పీర్ సాబ్ అటే బోయిండు
*****
"ఒరేయ్! బుడ్డోడా! తాతతో గిర్ని కాడికి బో రా!గక్కడ గీ నానబోసిన బియ్యం పడ్తరు గని మనొంతు వచ్చేదన్క ఆగు.తాత మల్లొచ్చి నిన్ను తోల్కొత్తడు. చెవులు వారిచ్చి యింటున్నవా? కదలకుండ గక్కడ్నే కూసో" అంటున్న అవ్వ మాటల్కి...
"గీ పిండితో ఏమేం అప్పలు జేత్తవ్!"నోట్లో ఊరీలు వొత్తుంటే అడిగిండు బుడ్డోడు.
" సకినాలు, బెల్లపరిశెలు జేత్త గని, 'పిండి బట్టుడు ఇంటికొచ్చుడు' ఇంగ కానేలేదు గని గప్పుడే ఊరీలు దీత్తున్న వేరా బుడ్డోడా!" అన్కుంట బుడ్డోడి తలమీద శిన్నగ మొట్టి '"జాగర్త' తాత జెప్పిన కాడ కూసో అటీటు బోకు"మని శెప్పి పంపింది.
"బుడ్డోడ్ని ,బియ్యం క్యానును గిర్ని కాడ దింపొచ్చి "నేను శేను కాడ్కి ఎల్తున్న! అన్కుంట బోతున్న ఇంటాయనొంక జూత్తు "జల్దీ రాండ్రి మల్ల బుడ్డోడ్ని, పిండిని కొంటరావాలె" అంది.
ఒత్తలేయే! గిర్ని కాడ శేంతాడంత పొడుగూత బియ్యం క్యాన్లు బెట్టున్నయ్. మనొంతు వచ్చేతల్కి మద్దేనమవుద్ది" అన్కుంట బోయిండు.
తమ్ముడు లేక ఒక్కతే ఆడ్కోడం శికాకు బుట్టిన భూలచ్మి తాత కోస్రం, బుడ్డోడి కోస్రం ఎదిరి సూత్తూ ఇంకా రాకపోయే తల్కి ఇంగెప్పొడొత్తరని అవ్వని సతాయించుడు మొదలు వెట్టింది.
మద్దేనం అయ్యింది.గప్పుడొచ్చిన ఇంటాయనొంక కోపంగ సూత్తూ "గక్కడ బుడ్డోడు ఏం జేత్తుండో ఏమో! గాడసలే ఆకల్కి ఆగలేడు.గీ బొంగుండలు రెండివ్వుండ్రి అని కాయితంల మడ్తబెట్టి ఇచ్చింది.
"గీయన బొయ్యి గప్పుడే గంటయింది.గక్కడ ఏం మావుల మంటబెడ్తుండో? అన్కుంట" కాలు గాలిన పిల్లొతికె" ఇంట్లె అటూ ఇటూ తిర్గుతున్న అవ్వ గప్పుడే ఇంట్లెకి వొత్తున్న కొడ్కుతో యిసయం జెప్పింది.
గాళ్ళిదర్ని పిల్సుకొత్తనని కొడ్కు సుత అటే బోవడం జూసి" బక్క సుక్కలు బొడ్చేదంక రారా ఏంది?ఏం మడ్సులో ఏమో? గివతలోల్లు ఎద్రు జూసి జూసి ఎంత పరేషానైతరు" అన్కుంట ఆకిట్లకెల్లి గాల్లొచ్చె తొవ్వొంక సూత్తున్న అవ్వతో...
"నేను బొయ్యి తోల్కరానా!" అంటున్న భూలచ్మితో"ఎహె ఆగే తల్లీ!"అడ్గబోయిన అల్లీ సాబ్ అటే బోయిండు -పిల్వబోయిన పీర్ సాబ్ అటే బోయిండు అన్నట్టుంది గీళ్ళ కత."అంది.
"అంటేందవ్వా! గా కతేందో శెప్పవ్వా! అని అడ్గిన భూలచ్మితో...
"ఎన్కటికి ఓలింట్ల ఓ ముస్లాయన శాన్నాల్ల నించి మంచాన బడున్నడు.గాయ్న ఓదినం గప్పటిదాక మంచిగున్న గా ముస్లాయన ఒక్క పాలిగా ఆయె పాయె జేయబట్టిండు.
ఇంటోల్లు గట్లెందుకు సేత్తుండో అడ్గిరమ్మని అల్లీ సాబ్ ని ఆరెంపి డాటరు దగ్గర్కీ పంపిత్తే అటే బోయిండు.ఇగ రాడు.అగరాడు.గంతట్లనే ముస్లాయనకి పానం మీదకి వొచ్చింది.గాయ్నకి అల్లీ సాబ్ అంటే బాగిట్టం.శివరి సూపైన సూస్కుంటడు అల్లీసాబ్ ను పిల్సుక రా పో! అని పీర్ సాబ్ ని పంపిండ్రు.పీర్ సాబ్ సుత గటే బోయిండు.గీ లోపల ముస్లాయన కాత్త గుటుక్కుమండు. గప్పన్నించి గిది సామెతగ మారింది.
గిట్ల మీ తాత,నాయ్న వాళ్ళ లెక్కనే బోయిండ్రు జూస్నవా?అంటుండగంగనే తాత మన్వడు, కొడుకు ముగ్గురు ముచ్చెట్లు బెట్కుంట లోపలికొచ్చిండ్రు. గిదంత బుడ్డోడి వల్లనే జర్గిందని చెప్పిండ్రు. అక్కడ కూసబెట్టి వొత్తె కూసోని కూసోని ఇస్కుబుట్టి తనస్మంటి దోత్తులు కలిత్తే ఆడ్కోడాన్కి బోయిండట. గాన్నెతుక్కొని వచ్చే తల్కి గీ సైమమైందని చెప్పిండ్రు.
"అవ్వోవ్! నువ్వు శెప్పిన కత గిప్పుడు మా బాగ అర్థమైంద్ది" అంటుంటే గదేందో తెల్వక భూలచ్మొంక తెల్లగ సూబడబట్టిండ్రు బుడ్డోడు,తాత, తండ్రి.
గదండీ సంగతి! యిసయం అర్తమైంది కదా "అడగ బోయిన అలీసాబ్ అటే బోయిండు -పిల్వబోయిన పీర్ సాబ్ అటే బోయిండు" అంటే గిదే మరి.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి