సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు
 సామెత -85- అత్తింట్లె అల్లుడై తినాలె - అడవిలో ఆంబోతై తిరగాలె
******
 "వామ్మో! వాయ్యో! గవేం మరియాదలు,గదేం అర్సుకునుడే అవ్వా!ఏలు బెడితే అందేదాక ఇరాం లేకుండా పెట్టుడే పెట్టుడు.ఇంట్లె ఉన్నోళ్ళంత ఒకలెనక ఒకలు వొంగొంగి జీ హుజూర్! అనుడు.
"తెల్లారి తెల్లార్క మున్పే గదేం శాయో బెడ్డు శాయంట,ఆటెంక పండ్లు దోమిండో లేదో పేద్ద గిలాసల మల్లో పాలి కాపీ కలిపిచ్చుడు. గిట్ల పొద్దుగాల మొదల్కోని రాత్రి మంచమెక్కే దనుక ఏం మరియాదలే అవ్వా! మద్దేనం పూట అన్నానికి లేపితే గన్ని కూరలా? పెండ్లిల సుత గన్ని జెయ్యరవ్వా!" బుగ్గలు నొక్కుకుంట అంటున్న విజ్జెమ్మ వొంక సూస్కుంట...
"అల్లుడా మజాకా! శెల్లె 'పెట్టి పుట్టడమంటే' గిదే మరి.ఆడపిల్లగాండ్ల అమ్మ నాయినల యెతలు మామూలు ఎతలు గావు పో!
 కాల్లు గడిగి,అడ్గిన కట్నమిచ్చి లగ్గం జెయ్యాలె. గందుల్నే అల్గితే గదుమ బట్కొని బతిలాడాలె.ఉన్నదూడ్షి లగ్గం జేసినంక సుత అల్లుడొచ్చినపుడు యినయంగా ఎక్కడ సీమకాలంత తేడా రాకుండా అర్సు కోవాలె.
పూట పూటకీ ఎరైటీ వంటల్తో అల్లుణ్ణి మెప్పిచ్చాలే.అత్తింట్లె అల్లుడు బోగం శెప్పనల్వి గాని బోగంపో.ఏమేం తినాలుందో గా కోరికలన్నీ అత్తింట్లె బుద్ధి తీరగ తీర్సుకోవొచ్చు.అల్లుడు అడ్గాలె గని తలగుడ్డ తాకట్టు పెట్టయిన  కమ్మగ వొండి పెట్టాల్సిందే.పుట్కంటే అల్లుడి పుట్కే పో .
 గందుకే శెల్లె "అత్తింట్లె అల్లుడై తినాలె-అడివిలో ఆంబోతై తిరగాలె" అంటరు.
"అల్లుడంటే సరే గని అడివిల ఆంబోతై తిరగాలె అన్నవ్ మరి గదేంటవ్వా?"
"గద్దెల్వక పోవుడేందే శెల్లె? ఆంబోతుకు అడ్డూ అదుపూ ఉంటుందా? ఎవ్వలన్న దాన్ని అడ్డుకుంటరా?  గది అడివిల పొలాలు, శెల్కల్ల తిరుక్కుంట తిరిగినంత తిరుగుద్ది. తిన్నంత తింటుంది. అది అడివిల తిరగడానికి ..గిది అల్లుడు  ఇంట్లె తినడానికి..."
 గదండీ సంగతి! "అత్తింట్లె అల్లుడై తినాలె-అడివిలో ఆంబోతై తిరగాలె" అంటే గిదే మరి.

కామెంట్‌లు