వన పర్వము తృతీయాశ్వాసము- * 92వ రోజు
కార్తవీర్యార్జునుడిని సమ్హరించుట
ఒకరోజు సహస్రబాహువులు కలిగిన కార్తవీర్యార్జునుడు వేటాడుతూ అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్ని అతనికి తగిన అతిథి సత్కారాలు చేసాడు. కార్తవీర్యుడు రాజగర్వంతో జమదగ్నిని ఇతర మునులను అవమానించాడు. పోతూ పోతూ ఆశ్రమంలోని హోమధేనువును దూడను తీసుకు వెళ్ళాడు. రాముడు ఆసమయంలో ఆశ్రమంలో లేడు. రాముడు రాగానే జరిగినదంతా తండ్రి ద్వారా తెలుసుకున్నాడు. రాముడు ఆగ్రహించి కార్తవీర్యునితో యుద్ధం చేసి అతనిని వధించాడు. కార్తవీర్యుని కొడుకులు రాముడి పై పగపట్టారు. కానీ అతనిని ఏమి చెయ్యలేమని గ్రహించి రాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి జమదగ్నిని చంపి మునులను నిందించి ఆశ్రమాన్ని ధ్వంసం చేసి వెళ్ళారు. రాముడు ఆశ్రమానికి రాగానే తండ్రి మరణ వార్త విని కృద్ధుడై " అనఘుడు, వీతరాగుడు, కరుణాతరంగుడు అయిన నా తండ్రిని బుద్ధి పూర్వకంగా చంపారు కనుక నేను దుర్జనులైన క్షత్రియులను అందరిని చంపుతాను " అని ప్రతిజ్ఞ చేసాడు. ఇలా భూలోకంలోని క్షత్రియులందరిని సంహరించి ఆ భూమిని కశ్యపునకు దానం ఇచ్చాడు. ఆ తరువాత విరాగియై మహేంద్రగిరిపై తపస్సు చేసుకుంటున్నాడు " అని పరశురాముని శిష్యుడైన అకృతవర్ణుడు చెప్పాడు. చతుర్ధశి నాడు పరశురాముని దర్శించి అక్కడి నుండి దక్షిణదిశగా ప్రయాణం అయ్యాడు. త్రయంబకంలో పుట్టిన గోదావరిని దర్శించి అక్కడి నుండి ప్రభాస తీర్థం చేరాడు
ప్రభాస తీర్థం
పాండవుల రాకను తెలుసుకున్న శ్రీకృష్ణుడు బలరాముడు యాదవ ప్రముఖులను వెంటపెట్టుకుని వారిని చూడటానికి వచ్చారు. ధర్మరాజు తాము పడుతున్న కష్టాలు అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళడం వారికి వివరించాడు.
బలరాముడు " ఆ ధృతరాష్ట్రుడు బుద్ధి లేని వాడై ఇంతటి పాపానికి ఒడి గట్టాడు. కనుక మనమంతా ధర్మరాజు పక్షాన నిలిచి అతని రాజ్యాన్ని అతనికి వచ్చేలా చేద్దాం " అని తనతో వచ్చిన వృష్టి రాజులతో పలికాడు. ఆ మాటలు విని సాత్యకి " అనుపమ శౌర్యవంతులు, అమిత బలవంతులు అయిన మీరు శ్రీకృష్ణుడు, సాంబుడు, సారణుడు లాంటి మహావీరులు ఉండగా పాండవులు ఇలా అడవులలో తిరగటం భావ్యమా? భయంకర మైన యాదవసేనల ధాటికి కౌరవసేనలు తట్టుకోగలవా? మనము కేకయరాజులు, సృంజయులు, పాంచాలురు, వృష్టి, భోజక, అంధక మహావీరులతో కలసి శ్రీకృష్ణుని అనుమతితో కౌరవులను సంహరించి పాండవులను రాజ్యాభిషిక్తులను చేద్దాం. అభిమన్యుని అఖిలరాజ్య రక్షకునిగా నిలుపుదాం ఏమంటారు " అని బలరాముడు ఆవేశంగా అన్నాడు. ధర్మరాజు " అయ్యా! మేము ఒక నియమం ప్రకారం అరణ్యవాసం చేస్తున్నాము. కాబట్టి మీరు శాంతించండి " అని యాదవ వీరులను శాంతపరిచాడు. తరువాత శ్రీకృష్ణుడు, బలరాముడు ద్వారకకు వెళ్ళారు. ధర్మరాజు అక్కడి నుండి బయలు దేరి పయోష్ణి నదిలో స్నానం చేసాడు. అక్కడి నుండి వారు నర్మదా నది తీరానికి చేరాడు. అక్కడ వారు వైడూర్య పర్వతాన్ని చూసారు. రోమశుడు ధర్మరాజుకు ఆ స్థల మహత్యాన్ని చెప్పసాగాడు.
చ్యవనుడు
రోమశుడు ధర్మరాజుతో " ధర్మరాజా! భృగుమహర్షి కుమారుడైన చ్యవనుడు ఈ ప్రదేశంలో చాలాకాలం తపస్సు చేసాడు. దీర్ఘకాల తపస్సు కారణం
చేత ఆ ముని శరీరం చుట్టూ పుట్టలు వాటి పై తీగలతో కప్పబడింది. ఒక రోజు శర్యాతి మహారాజు కుమార్తె సుకన్య చ్యవనుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చింది. ఆ పుట్టలో ఉన్న చ్యవనుని కళ్ళు మిలమిలలాడాయి. అది చూసిన సుకన్య కుతూహలంతో ఆ పుట్టను తవ్వించింది. చ్యవనుడు కోపించి శర్యాతిని ససైన్యంతో మూత్రం, పురీషం బంధించాడు. ఈ విషయం తెలుసుకుని శర్యాతి చ్యవనుని వద్దకు వచ్చి తన కుమార్తె తెలియక చేసిన తప్పు క్షమించమని వేడుకున్నాడు. రాజకుమారి సుకన్యని తనకిచ్చి వివాహం చేస్తే క్షమిస్తానని చ్యవనుడు చెప్పాడు. శర్యాతి మహారాజు అందుకు అంగీకరించి సుకన్యను చ్యవనునికి ఇచ్చి వివాహం చేసాడు. సుకన్య చ్యవనుడికి సేవలు చేస్తూ ఉంది.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి