బాక్సింగ్ డే- కొన్ని సంగతులు:- - యామిజాల జగదీశ్
 బాక్సింగ్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో డిసెంబర్ 26న పాటించే ప్రభుత్వ సెలవుదినం. ఇది ఒక ముఖ్యమైన సాంస్కృతిక, వాణిజ్య కార్యక్రమం. దీనిని తరచుగా కుటుంబ సభ్యులు, స్నేహితులు సమావేశమై బహుమతులు ఇచ్చిపుచ్చుకునే అవకాశంగా భావిస్తారు. 
డిసెంబర్ 26న బాక్సింగ్ డేనాడు సేవకులు పేదలకు "క్రిస్మస్ పెట్టెలు" (బహుమతులు/డబ్బు) ఇస్తారు. ఈ పద్ధతి తొలిసారిగా ఇంగ్లండులో ఆరంభమైంది. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి కామన్వెల్త్ దేశాలలో ఈ విధానము ఉంది.
ఈ సెలవు రోజుకి ప్రత్యేకమైన సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. అయితే ఇవి ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి.
బాక్సింగ్ డే గురించి తెలుసుకోవలసిన కొన్ని వాస్తవాలు....
ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న బాక్సింగ్ డే జరుపుకుంటారు. ఇది క్రిస్మస్ తర్వాతి రోజు!
దీనిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు జరుపుకుంటాయి.
బాక్సింగ్ డే కేవలం యునైటెడ్ కింగ్‌డమ్‌లో భారీ ఎత్తున పాటిస్తారు. 
ఇది ఇప్పటికీ కామన్వెల్త్‌లో భాగమైన అనేక పూర్వ బ్రిటిష్ కాలనీలలో కూడా జరుపుకుంటారు. ఇందులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెనడా, నైజీరియా, ట్రినిడాడ్ - టొబాగోలో సంబరాలు అంబరాన్నంటుతాయి.
బాక్సింగ్ డేని బాక్సింగ్ డే అని ఎందుకలా పిలుస్తారో అనే దానికి సంబంధించి ఎలాంటి కారణమూ లేదు! బాక్సింగ్ డే అనే పేరు ఎలా వాడుకలోకొచ్చిందో ఇదమిత్థంగా తెలియదు కానీ కొన్ని అభిప్రాయాలు  ఉన్నాయి.
పేదలకు విరాళాలు ఇవ్వడానికి చర్చిల చుట్టూ పెట్టెలు ఉంచుతారు. 16వ శతాబ్దంలో శ్రామిక వర్గానికి చెందిన ప్రజలు తాము పని చేసిన వారి నుండి క్రిస్మస్ పెట్టెలను పొందాలని ఆశించే వారట. అయితే అది ఏదో ఒక పెట్టె రూపంలో ఉండాలి!
బాక్సింగ్ డే షాపింగ్ కి గొప్ప రోజుగా భావిస్తారు. ఖర్చు చేయడానికి కొన్ని క్రిస్మస్ వోచర్లు ఉంటే, వాటిని బాక్సింగ్ డేని ప్రత్యేకించి ఎంపిక చేసుకుంటారు. బాక్సింగ్ డే, నూతన సంవత్సరంలోకి ప్రవేశించేటప్పుడు చాలా తగ్గింపులు లభిస్తాయి. ఈ సమయంలో  పట్టణాలు చాలా రద్దీగా ఉంటాయి.
ఈ రోజంతా చూడటానికి ఎల్లప్పుడూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. క్రీడాభిమానులకు ఎంతో ఇష్టమైన రోజు ఈ బాక్సింగ్ డే‌. 
బాక్సింగ్ డే నాడు ఫుట్‌బాల్, రగ్బీ, క్రికెట్, గుర్రపు పందాలతో సహా చూడటానికి చాలా క్రీడాపోటీలు నిర్వహిస్తారు.
1833లో బాక్సింగ్ డే అనే మాట మొదటిసారిగా ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో ప్రచురితమైంది.
బాక్సింగ్ డే వారాంతంలో వస్తే సోమవారం బ్యాంకులకు సెలవు.
బాక్సింగ్ డే రోజునే సెయింట్ స్టీఫెన్స్ డే కూడా జరుపుకుంటారు. దీనిని ఎక్కువగా రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌లో జరుపుకుంటారు. సెయింట్ స్టీఫెన్ గుర్రాల పోషకుడు. బాక్సింగ్ డే నాడు గుర్రపు పందాలు జరగడానికి ఇదే కారణం!
ఒకప్పుడు నక్కల వేటకు వెళ్లడం సంప్రదాయంగా ఉండేది. బాక్సింగ్ డే నాడు కొంతమంది నక్కల వేటకు వెళ్లడం ఒక సంప్రదాయంగా ఉండేది. అయితే, ఇది ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ లో చట్టవిరుద్ధం కాబట్టి ఇది గతానికి సంబంధించిన విషయమే.
1871 నుండి యునైటెడ్ కింగ్‌డమ్‌లో బాక్సింగ్ డే బ్యాంకు సెలవుదినంగా పాటిస్తున్నారు. ఈ రోజున విద్యాసంస్థలకూ సెలవే.

కామెంట్‌లు