తాటిబెల్లం:- - యామిజాల జగదీశ్
 చ‌క్కెర‌కు బ‌దులుగా బెల్లం తింటే ఎన్నో లాభాలు క‌లుగుతాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో తాటి బెల్లం అనే మాట మ‌న‌కు బాగా విన‌బ‌డుతున్నాది. కానీ నిజానికి ఇది ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చిందేమీ కాదు. పూర్వకాలం నుంచి తాటిబెల్లాన్ని వాడుతున్నారు. సుమారుగా నూరు సంవ‌త్స‌రాల క్రితం వ‌స్తుగుణ దీపిక అనే పుస్త‌కంలో తాటిబెల్లం గురించి ఆయుర్వేద వైద్యులు అనేక ముఖ్య‌మైన విష‌యాల‌ను రాశారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం తాటి బెల్లం వాడ‌కం ప‌ట్ల అంద‌రూ ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే దీన్ని వాడ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసుకుందాం.
తాటి బెల్లం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ దొరకదు. అయితే అలాంటి తరుణంలో తిరుపతిలో కొన్నేళ్ళ క్రితం తాటిబెల్లం వారోత్సవాలు జరిపారు. అంటే అవేవో వేడుకలు అనుకునేరు. అదేం కాదు గాని అరుదుగా లభించే తాటి బెల్లాన్ని తమిళనాడు రాష్ట్రం తిరుచ్చెందూరు నుంచి వచ్చిన వ్యాపారులు విక్రయించారు. వీటి రుచి, ఆరోగ్యం దృష్ట్యా ఈ తాటిబెల్లం బర్ఫీలను ఎగబడి మరీ కొన్నారు. ధర విషయాని కొస్తే రకాన్ని బట్టి, నాణ్యతను బట్టి పలుకుతుంది. 
సాధారణ బెల్లం కంటే తాటి బెల్లం ధర రెట్టింపు ఉంటుంది. కారణం దాని ఔషధ గుణాలపై ప్రజలకు ఉన్న నమ్మకమే. ఈ బెల్లంలో చిన్నపాటి జబ్బుల నుంచి అనీమియాను దూరం చేసే సుగుణాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు వివిధ రకాల అనారోగ్యాలకు ఈ తాటిబెల్లం తినడం ద్వారా చెక్ చెప్పవచ్చని పలువురి విశ్వాసం. తాటి బెల్లంలో తేమ 8.61 శాతం, సుక్రోజు 76.86, రెడ్యూసింగ్   చక్కెర 1.66, కొవ్వు 0.19, మాంసకృత్తులు 1.04, కాల్షియం 0.86, ఫాస్ఫరస్ 0.05, ఖనిజ లవణాలు 3.15 శాతం, ఇనుము ఉంటాయి. పోషక విలువలు సమృద్ధిగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తాటి బెల్లం చాలా ఉపయోగకరమే. తాటిబెల్లంలో విటమిన్లు, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేసి మలబద్ధకం పోగొడుతుంది. జీర్ణాశయ ఎంజైమ్‌ల పనితీరు మెరుగు పరుస్తుంది. ఐరన్‌ ఎక్కువగా ఉండడం వల్ల అనీమియాను దూరం చేస్తుంది. యాంటాక్సిడెంట్ల కారణంగా శరీరంలో దెబ్బతిన్న కణాలను సరిదిద్దడంలో సహకరిస్తుంది.
కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్‌ కూడా ఉంటుంది. శ్వాసకోస నాళం, చిన్నపేగుల్లో చేరుకున్న విషపదార్థాలనూ తొలగిస్తుంది. 
తాటిబెల్లంలో ఉండే ఔష‌ధ గుణాలు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడ‌తాయి. ఇందులో ఉండే ఐరన్ రక్త‌హీన‌త‌ను త‌గ్గిస్తుంది. తాటిబెల్లం రోజూ తిన‌డం వ‌ల్ల శ్వాసకోస నాళం, చిన్నపేగుల్లో చేరుకున్న విషపదార్థాలూ బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. అలాగే దగ్గు, జలుబు, శ్వాసనాళ సమస్యలు, మ్యూకస్‌ తొలగించడంలోనూ తాటిబెల్లం స‌హాయ పడుతుంది. తాటిబెల్లం తిన‌డం వ‌ల్ల మైగ్రేన్ త‌గ్గుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలో బాగా వేడి ఉన్న‌వారు తాటిబెల్లం తిన‌డం మంచిది. చిన్న పిల్ల‌లకు తాటిబెల్లం తినిపిస్తే వారు నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. వారికి కావ‌ల్సిన శ‌క్తి బాగా అందుతుంది.

కామెంట్‌లు