పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావుకు మరో అరుదైన గౌరవం లభించింది. లోక కవి అందెశ్రీ కి 108మందితో కవిత్వ నివాళిగా నిర్వహించిన కవి సమ్మేళనంలో తిరుమలరావు పాల్గొని తన కవితను వినిపించారు. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ తెలంగాణా విభాగం, లక్ష్య సాధన ఫౌండేషన్, తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్తంగా 108మందితో అంతర్జాలం ద్వారా నిర్వహించిన
కవి సమ్మేళనంలో సర్వశ్రీ మాన్యశ్రీ అందెశ్రీ అనే కవితను వినిపించి తిరుమలరావు అందెశ్రీ పట్ల గల అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో జట్టు ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డా.డొల్లు పారినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ప్రకృతి వ్యవసాయం పాట కవుల నోట అనే కార్యక్రమ వేదికపై అందెశ్రీ చేతులమీదుగా తిరుమలరావు పురస్కారం అందుకున్న విషయం గుర్తుచేసుకుంటూ అందరితో అతనితో గల సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందెశ్రీ ప్రక్కనే కూర్చుని, అందెశ్రీ తో కరచాలనం చేసుకుంటూ, అందెశ్రీ రచించిన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ అనే పాటను ఆలపించి అందెశ్రీ ప్రశంసలను స్వయానా పొందిన మధురానుభూతిని తిరుమలరావు అశ్రునయనాలతో చాటుకున్నారు. తిరుమలరావు వినిపించిన కవితలో మనిషితనమేమిటో తొలుత మనిషి నేర్చాలని నినదించిన అందెశ్రీ అంటూ రచించారు. చెమట చిందించి పెరిగి పెద్దయై, మట్టిని మోసిన ఆ బాల్యాన్నీ అట్టి తపననూ తన సాహిత్యాన నిలిపారని కూడా కవితలో వివరించారు. తిరుమలరావు కవితను అభినందిస్తూ జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేశిరాజు రాంప్రసాద్,
తెలంగాణా విభాగం అధ్యక్షులు కె.విశ్వనాథరాజు, తెలంగాణ ముఖ్య కార్యదర్శి ఇ.చంద్రహాస్ లు ప్రశంసాపత్రం పంపారు. తిరుమలరావుకు అందెశ్రీ స్మారక ప్రశంసాపత్రం లభించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం, మందసకు చెందిన రచయిత్రి కుసుమ శ్రీ పావని, శ్రీకాకుళానికి చెందిన బూడిద సంతోష్ కుమార్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి