శ్రీపురం రాజ్యాన్ని ధనంజయ పరిపాలించేవాడు. పరిపాలన ప్రజారంజకంగా చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు ధనంజయ. నిరంతరం విజయయాత్రలు చేస్తూ అనేక రాజ్యాలను ఓడించి, రాజ్య విస్తరణ చేస్తూ ఉండేవాడు.అలా తన రాజ్యాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. కాలం గడుస్తున్నది. ధనంజయ తన వృద్ధాప్యం కారణంగా చిన్న కొడుకైన విజయను శ్రీపురానికి తాత్కాలిక మహారాజును చేశాడు. తన పెద్ద కుమారుడు విదేశీ యాత్రలలో ఉన్నాడు. మరో సంవత్సరం దాకా తాను రానన్నాడు. అందుకే విజయను తాత్కాలిక రాజుగా చేసి, తను విశ్రాంతి తీసుకుంటున్నాడు.
విజయుడు రాజైన తర్వాత తాను కూడా సామ్రాజ్య విస్తరణ పేరుతో తరచూ వెళ్ళి వస్తూ ఉండేవాడు. కానీ రాజ్య విస్తరణ కోసం కాదు. తన రాజ్యంలో చెట్ల విస్తరణ మరియు సంరక్షణ కోసం. తన రాజ్యంలో అడుగడుగునా కొత్త మొక్కలను నాటింపజేసేవవాడు. వాటి నిరంతర సంరక్షణ బాధ్యతను ఆ ప్రాంత ప్రజలపై మోపేవాడు. ఎక్కడ ఖాళీ ప్రాంతం కనిపించినా అక్కడ చెట్లను నాటించడం, సంరక్షణ చేయించడం చేసేవాడు. విజయుని కృషి ఫలితంగా రాజ్యమంతా పచ్చదనం విస్తరించింది. ఫలితంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి. కరవుకాటకాలు పూర్తిగా దూరం అయినాయి. ప్రజలు ధన ధాన్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లారు. ధనంజయుడు చాలా ఆశ్చర్యపోయాడు. తనకూ తన కొడుకు ఆలోచనకూ ఎంత తేడా ఉంది. "విజయా! ఈ రాజ్యానికి రాజువు అయ్యే అర్హత పూర్తిగా నీకే ఉంది. కాబట్టి నీ అన్నయ్య సంజయుడు తిరిగి వచ్చినా నిన్ను రాజు పదవి నుంచి తొలగించను. సంజయునికి వేరే ముఖ్యమైన బాధ్యత అప్పజెబుతా." అని ప్రకటించాడు ధనంజయుడు.
విజయ యాత్రలు:- సరికొండ శ్రీనివాసరాజు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి