ఉత్తరకోసమంగై:- - యామిజాల జగదీశ్


 ఉత్తరకోసమంగై ..... తమిళనాడులోని అత్యంత అద్భుతమైన శివాలయాలలో ఒకటి. ఇక్కడ ఉన్న మరకత నటరాజ విగ్రహం చాలా ప్రసిద్ధి చెందింది. నటరాజస్వామిని సందర్శిస్తే మోక్షం లభిస్తుందని ఆస్తికుల విశ్వాసం. 
ఏడాది పొడవునా చందనంతో దర్శనమిస్తారు స్వామివారు. నటరాజస్వామిని ఆకుపచ్చలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే అదీనూ ఆరుద్ర దర్శనం రోజున చూడవచ్చు.
ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం, తమిళనాడులోని అత్యంత పురాతనమైన, అతి ముఖ్యమైన ఆలయాలలో ఒకటి ఉత్తరకోసమంగై ఆలయం. చిదంబరం తర్వాత ఉత్తరకోసమంగై ఆలయంలోనే అత్యంత ముఖ్యమైన నటరాజ ఆలయాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ఆలయం గురించి చాలా మందికి తెలియని కొన్ని అద్భుతమైన విషయాలను చూద్దాం...
రామనాథపురం జిల్లాలో ఉత్తరకోస మంగై అనే పవిత్ర ఆలయం ఉంది. 
పురాణాలు, ప్రాచీనత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఈ అద్భుతమైన ప్రదేశం మరింత తెలూసుకోవాలనే ఆసక్తిని పెంచుతుంది.
ఉత్తరకోస మంగైలోని మూలవిరాట్టు స్వయంభువ లింగం సుమారు మూడు వేల సంవత్సరాల పురాతనమైనదని పరిశోధకులు అంచనా. 
సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఆలయానికి ఓ రాజు చాలా భూమిని,  గొర్రెలను దానం చేసి, పునరుద్ధరణకు పూనుకున్నాడని శాసనాల వల్ల తెలిసిన విషయం.
ఉత్తరకోస మంగై శివుని స్వస్థలం అని పురాణకథనం. తిరువిలయాడల్ అనే తమిళ పురాణం పరమేశ్వరుడి లీలల గురించి విపులంగా ప్రస్తావించింది. 
పాండ్య రాజులు స్వయంగా ఉత్తరకోస మంగై ఆలయానికి ప్రధాన పునర్నిర్మాణాలు చేశారు. పాండ్య రాజులు అధికారంలో ఉన్నప్పుడు, ఉత్తరకోశ మంగై కొంతకాలం వారి రాజధానిగా కూడా ఉండేది.
ఈ ఆలయాన్ని శివపురం, దక్షిణ కైలాయం, చతుర్వేది మంగళం, ఇలాందికైపల్లి, బ్రహ్మపురం, వ్యాఘ్రపురం, మంగళపురి, ఆది చిదంబరం వంటి అనేక పేర్లతో పిలిచేవారు. దీనికి సంబంధించిన శాసనాలు, వ్రాతప్రతులు ఉన్నాయి.
ఇక్కడి స్వామిని మంగళనాథ స్వామిగా ఆరాధిస్తారు. ఈ స్వామినే మంగళేశ్వరర్‌ అని, కడి కుట్ట నాయకర్ అని, ప్రళయకేశ్వరర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి అమ్మవారిని మంగళేశ్వరి, మంగళాంబిగై, సుందరనాయకి అని పిలుస్తారు. అమ్మవారిని స్తుతిస్తూ, ప్రముఖ తమిళ కవి వి.టి. సుబ్రమణ్యం పిళ్లై రాసిన కృతి 1901లో తొలిసారిగా వెలువడింది. ఈ పుస్తకం 1956లో పునర్ముద్రితమైంది. 
రావణుడిని చంపిన పాపం, అపరాధం నుండి విముక్తి పొందడానికి రామేశ్వరంలో పూజలు చేశాడని పురాణగాథ. ఇక్కడ, రావణుడి భార్య మండోదరి పేరు ఉత్తరకోసమంగైలోని శాసనాలలో కనిపిస్తుంది. కాబట్టి, ఈ ఆలయం రామాయణ కాలం నాటి శాసనంగా పరిగణిస్తారు.
వేదవ్యాసుడు, కాకా భుజందార్, వనసురన్, మాయ, మాణిక్యవాచగర్, అరుణిగిరినాథర్ ఈ ఆలయంలో పూజలు చేసి భగవంతుని ఆశీస్సులు పొందారంటారు.
చిదంబరం లాగే, ఇక్కడ నటరాజ స్వామి ప్రత్యేకమైన స్వామి. ఇక్కడి పంచలోహ నటరాజ స్వామి చాలా ప్రత్యేకం. పురుషులు కుడి వైపున, మహిళలు ఎడమ వైపున నృత్యం చేసినట్లు శాసనాల వల్ల తెలుస్తోంది. నటరాజ విగ్రహం కూడా పురాతనమైనదని పరిశోధకుల అభిప్రాయం! కుమారస్వామి  వాహనంగా ఏనుగును తిలకించవచ్చు. 
పురాతన గ్రంథమైన "ఆది చిదంబరం మహాత్మ్యం" ప్రకారం ఇంద్రుడు తన ఐరావతాన్ని కుమారస్వామికి ఈ క్షేత్రంలోనే ఇచ్చాడని చరిత్రకారులు చెబుతున్నారు!
సంగం సాహిత్యంలో ఉత్తరకోశ మంగై గురించి ప్రస్తావన ఉంది. 
ఉత్తరకోశ మంగై మాణిక్యవాచకుడికి  ప్రత్యేక దర్శనం ఇచ్చిన ప్రదేశంగా కూడా ప్రత్యేకతను కలిగి ఉంది.
అమ్మవారు ప్రతిరోజూ ఈ ప్రదేశంలో స్వామిని పూజిస్తుందని నమ్ముతారు! పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇక్కడే వేదాలను బోధించాడని కథనం. అనంతరం అమ్మవారితో కలిసి మధురైకి వెళ్ళాడని మధురై పురాణం పేర్కొంది.
కొంత కాలం పాటు, ఈ ప్రదేశం ఆదిశైవుల ఆధీనంలో ఉండేది! తరువాత దానిని రామనాథపురం రాజుకు అప్పగించారు. అప్పటి నుండి రామనాథపురం రాచరిక రాజ్య పాలనలో ఉందనే వాస్తవం దీనికి నిదర్శనం!
లోపలి ప్రాంగణంలోకి ప్రవేశించేటప్పుడు శిల్పుల నైపుణ్యానికి నిదర్శనంగా అనేక శిల్పాలను చూడవచ్చు. పైగా రెండు శిల్పాలలో నోటిలో ఉన్న రాతి బంతిని మన చేతులతో అంటూ ఇటూ తిప్పి వచ్చును!
సాధారణంగా, పూజలో మొగలిరేకును చేర్చరు. కానీ ఇక్కడ, ప్రదోష రోజున దానితో పూజిస్తారు. ఈ ఆలయంలో స్వామివారికి, దేవేరికి మొగలిపువ్వు మాల సమర్పిస్తే, దోషాలు తొలగిపోతాయని ఆస్తికులు విశ్వాసం!
ఇక్కడ ఒక పురాతన వారాహి ఆలయం ఉంది. ప్రతి శుక్రవారం, మంగళవారం, ఆదివారం రాహుకాలంలో ఇక్కడ వారాహిని పూజిస్తే, పరిష్కారం కాని సమస్యలు, వివాహ అడ్డంకులు మొదలైనవి తొలగిపోతాయని స్థానికులంటారు. ఆ కాలంలోనూ వారాహి ఆరాధన ఇక్కడే ఉండేదని దీనివల్ల అర్థమవుతుంది!
1300లో ఢిల్లీని రాజధానిగా చేసుకుని పాలించిన అల్లావుద్దీన్ ఖిల్జీ, ఉత్తరకోశ మంగైలోని మరకథ నటరాజ విగ్రహాన్ని దోచుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దాదాపు 60 వేల మంది శివ భక్తులు ఇక్కడ జ్ఞానం పొందారని చెబుతారు.
ఇక్కడ, శ్రీమంగళనాథ మందిరం, మంగళేశ్వరి మందిరం, మరకత నటరాజ మందిరం, సహస్రలింగ మందిరం వంటివి ఈ ఆలయం ప్రత్యేకం. "ధ్వజ వృక్షం" ఉండటం గమనార్హం. 
కారైకల్ అమ్మయార్ కూడా ఇక్కడికి వచ్చి స్వామిని పూజించారు.
ఉత్తరకోసమంగై ఆలయ నిర్మాణం ద్రావిడ వాస్తుశిల్పం ఆధారంగా ఏర్పాటైందంటారు.
తిరువాదిరై, మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
సమర్పించిన గంధాన్ని నటరాజస్వామి మరకత రాయిపై ఉంచి వేడి నీటిలో కరిగించి తాగితే, నయం కాని వ్యాధులు కూడా నయమవుతాయని నమ్ముతారు!
ఈ ఆలయంలో 11 గణేశ విగ్రహాలను ప్రతిష్టించారు. మహాలక్ష్మి సన్నిధి కూడా ఉంది. 


కామెంట్‌లు