“వినరో భాగ్యము విష్ణు కథలు: (10):- ఎం బిందుమాధవి.

 “హుష్..ఒక సారి ఇలా రండి. పిల్లల ఆట చూద్దురుగాని” అని బామ్మ రహస్యంగా సైగ చేసి తాతయ్యని పిలిచింది.
“అబ్బా.. ఇప్పుడే వాకింగ్ కి వెళ్ళొచ్చా. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి..ఉండు. ఏమిటి అంత ప్రత్యేకత” అంటూ తాతయ్య లేచి వెళ్లారు.
బామ్మ, తాతయ్య కర్టెన్ వెనక నిలబడి పిల్లలు చూడకుకుండా ఆట గమనించటం మొదలుపెట్టారు.
రవి తన మిత్రులందరినీ కింద చాప మీద కూర్చోబెట్టి, తను మాత్రం అచ్చం తాతయ్య లాగే ఒక ఈజీ చెయిర్ లో కూర్చుని ప్రసంగిస్తున్నాడు.
“నిన్న మనకి చెప్పిన కథ మళ్లీ చెప్పమని..రాత్రి పడుకున్నప్పుడు తాతయ్యని అడిగాను. నాకు ఇంకా చాలా సేపు ఆ కథ చెప్పారు. ఇప్పుడు మీకు అది చెబుతాను” అని కాసేపు ఆలోచిస్తున్నట్లు కళ్ళు మూసుకుని చెప్పటం మొదలుపెట్టాడు.
“నరసింహ స్వామి గురించి చెప్పారు కదా. నాకు అప్పుడు భయం వేసింది. కానీ మన లాగే చిన్న పిల్లవాడైన ప్రహ్లాదుడు అస్సలు భయపడలేదు. ఎందుకంటే..విశ్వం అంతా విష్ణు మయం అని అతనికి తెలుసుకదా. అతను అలా అనుకున్నాడు కనుకనే.. వాళ్ళ నాన్న నిప్పులో తోసేసినా, సముద్రంలో పడేసినా, ఏనుగుల చేత తొక్కించాలనుకున్నా, సింహం ఉన్న బోనులో పడేసినా, పాముల చేత కరిపించాలనుకున్నా, విషం తాగించాలనుకున్నా..కొంచెం కూడా భయపడలేదు. అన్ని చోట్లా ఉన్నది ఆ విష్ణువే కాబట్టి హాయిగా ఆ శ్రీమన్నారాయణుడి ఒడిలో కూర్చున్నట్టే భావించాడు. అంటే మనసులో ఏ భావం ఉంటే మనకి చుట్టూ ఉండేవి అలాగే కనిపిస్తాయట. దాన్ని "యద్భావం తద్భవతి" అంటారుట. తాతయ్య చెప్పారు. అందుకే మంచి విషయాలనే భావించాలిట. సరే మళ్లీ ప్రహ్లాదుడి కథలోకొస్తే అలా అనుకున్న భక్తుడి నమ్మకాన్ని నిరూపించటానికి విష్ణు మూర్తి విశ్వంలోని భాగమైన స్తంభం లో నించి బయటికి వచ్చాడు. భక్తుల మాట నిలబెట్టాలి కదా!” అన్నాడు రవి ఆరిందా లాగా.
“ఆ 😞 ఇంకా కేశవ: అంటే మంచి సువాసనలు వెదజల్లే కురులు..అంటే జుట్టు అని అర్థంట. అంతే కాదు..కేశాలు అంటే కిరణాలు అనే అర్థం కూడా ఉందిట. సంస్కృతం కదా..ఒక్కొక్క పదానికి బోలెడు అర్ధాలు ఉంటాయిట. సృష్టిలో కిరణాలను ప్రసరించేది నిప్పు అంటే ‘అగ్ని’, ‘సూర్యుడు’ ఇంకా ‘చంద్రుడు’.
ఇంతలో పావని కలగజేసుకుని..”దీపం కూడా కిరణాలను ప్రసరిస్తుంది కదా” అన్నది.
“దీపం అనేది మనం భౌతికంగా తయారు చేసేది. నూనెతో, కిరసనాయిలు తో, గ్యాసుతో! మళ్లీ అందులో ఉండేది అగ్నే కదా!”
“సరే..మళ్లీ మన కథలోకి వెళదాం. అగ్ని, వాయువు మన శరీరంలోపల అంతటా ఉంటాయి. కానీ గాలికి కిరణాలు ఉండవు అని మనకి తెలుసు కదా!”
“అగ్ని మన మాటకి అధిపతి. సూర్యుడు మన శరీరానికి అధిపతి. చంద్రుడు మన మనసుకి అధిపతి. చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు. అంటే మనసుకి భౌతిక రూపం లేదు. సూర్యుడి కిరణాలు పడితేనే చంద్రుడు ప్రకాశిస్తాడు అని మనం సైన్స్ లో చదువుకున్నాం కదా! ఉదాహరణకి..కిరణాలు వెదజల్లే ఆ మూడు మన శరీరంలో ఎలా ఉంటాయంటే.. తోటలో ఆడుకునేటప్పుడు మనం కళ్లతో (శరీర భాగం..సూర్యుడు) చెట్టు మీద జామకాయ చూస్తాము. ఫ్రెండ్స్ తో చెబుతాం (చెప్పటం అంటే మాట..అగ్ని) తరువాత ఏం చెయ్యాలో మన మనసుకి (చంద్రుడు..అన్నమాట) చెబుతాము లేదా ఆలోచిస్తాం! అప్పుడు మనసు, కాళ్లకి ఆ చెట్టు దగ్గరకి వెళ్లి కాయలు కొయ్యమని చెబుతుంది. మనసుకి స్వయంగా రూపం లేదు. కన్ను చూస్తేనే కదా కాయలు కొయ్యాలనే ఆలోచన వచ్చింది. అలా అగ్ని, సూర్యుడు, చంద్రుడు కలిసి మన అన్ని కార్యకలాపాలను నిర్వహిస్తాయి. అలా శ్రీమన్నారాయణుడు మూడు రకాల కిరణాలతో మన దైనందిన జీవితాన్ని నడుపుతూ ఉంటాడు.”
“అంతే కాదు.. పైన చెప్పినట్టు సృష్టి, స్థితి మాత్రమే కాదు.. సూర్యుడు తన కిరణాలతో అన్నిటినీ శోషింపచేస్తాడు. అంటే లయం అన్నమాట. నదుల్లో నీటిని పీల్చేసుకుంటాడు. కొన్ని చెట్లని ఎండిపోయేలా చేస్తాడు. కొన్ని మొక్కలు తమకి కావలసిన ఆహారం “పత్ర హరితం” తయారు చేసుకునే శక్తిని కూడా ఇస్తాడు. పీల్చుకున్న నీటిని తనలో దాచుకోకుండా మళ్లీ వర్షం రూపంలో ఇచ్చేసి ఎండిపోయిన చెట్లకి చిగురు రూపంలో పునరుజ్జీవనం ఇస్తాడు. ఇలా శ్రీమన్నారాయణుడు ఈ క్రమం (సైకిల్) నిరంతరం నడిపిస్తూ మనని పోషిస్తూ ఉంటాడు. అందుకే ఆయన్ని “పురుషోత్తముడు” అంటారుట.”
“ఒక చెట్టు రావాలంటే విత్తనం వెయ్యాలి. మనిషి, జంతువు, పక్షి లాంటివి పుట్టటానికి ఒక ఆధారం ఉంటుంది. కానీ భగవంతుడు తనకు తానే అన్నిచోట్లా స్వయంభువుగా ఉద్భవించి, అన్ని జీవులని సృష్టించి, పెంచి, పోషించి నశింపచేస్తాడు. అలా పుట్టే జీవులకు అంతు ఉండదు. అంటే దేవుడు అవ్యయుడు అన్నమాట. అలా అంతులేని జీవరాశులను సృష్టించి అన్నిటికీ తానే ఆత్మ రూపమైన చైతన్యంగా ఉంటాడు. ఇంతకు ముందు తాతయ్య చెప్పారు కదా..చైతన్యం లేని ఏదైనా జడం, శవం, నిర్జీవమైనది అని! మొన్న మనం స్కూల్ నించి వస్తుంటే రోడ్డు పక్కన ప్రాణం లేకుండా పడి ఉన్న పావురాన్ని చూశాం కదా! అంటే మనలో దేవుడు ఆత్మ రూపంగా ఉంటేనే మనం కదులుతాం, చూస్తాం, వింటాం, నడుస్తాం, తింటాం, మాట్లాడతాం అన్నమాట. అంటే ఆ దేవ దేవుడే మనకి ప్రభువు అన్నమాట” అని..”ఇప్పుడు అర్థమయిందా” అని ముగించాడు రవి.
“బాగా చెప్పావు రవి” అని తాతయ్య, బామ్మ కర్టెన్ పక్క నించి వచ్చి చప్పట్లు కొట్టారు. “దీన్ని బట్టి నేను చెప్పేది నీకు బాగా అర్థం అవుతున్నదన్నమాట. నాకు సంతోషంగా ఉంది. సాయంత్రం ఇంకా కొన్ని చెప్పుకుందాము. మీకు ఏమీ అర్థమయింది రేపు ఇంకొకరు ఇలాగే చెబుదురుగాని. సరేనా” అని తాతయ్య వాళ్ళందరినీ దగ్గరకి తీసుకుని ముద్దాడారు.


కామెంట్‌లు