“వినరో భాగ్యము విష్ణు కథలు” (11):- ఎం బిందుమాధవి

 “నిన్న నేర్చుకున్న శ్లోకం ఒక సారి చెప్పమ్మా”అన్నారు తాతయ్య.
పావని లేచి.. “స్వయంభూ శంభురాదిత్య: పుష్కరాక్షో మహాస్వన:
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమ:” అని చెప్పింది.
“మన లాగా ఆ శ్రీమన్నారాయణుడు ఒక కారణం వల్లనో, కర్మ వల్లనో కాక తాను సృష్టించిన జీవులకు కష్టం కలిగినప్పుడు వారిని రక్షించటానికి స్వయంగా జన్మ తీసుకుని అవతరిస్తాడు. మనం మన పూర్వ జన్మలలో చేసిన కర్మ ఫలాలు అనుభవించటానికి, ప్రాకృతికంగా పంచభూతాల స్పర్శతో జన్మిస్తాము. పంచభూతాలను తానే స్వయంగా సృష్టించి వాటిని తన అధీనంలో పెట్టుకునేవాడు కనుక ప్రకృతికి అతీతంగా ఆ దేవ దేవుడు తనకి తానే స్వయంభువుగా అవతరిస్తాడు.”
“దీనినే “అజాయమానో బహుధా విజాయతే” అంటారు. జీవులని పుట్టించి, పోషించి సంతోషం కలిగిస్తాడు. అలాగే తను సృష్టించిన కొన్ని జీవుల వల్ల ఇతర జీవులకు కష్టం కలుగుతున్నప్పుడు, ఆ కష్టం ఆయనే స్వయంగా తీర్చవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తను అవతారం స్వీకరించి ఈ భూమి మీదకి ఒక రూపం తీసుకుని వస్తాడు.
“అనన్యాశ్చింత యంతోమాం యె జనా:పర్యుపాసతే
తెషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం”
అని తానే స్వయంగా చెప్పాడు. అంటే మనకి కష్టం వస్తే ఆయన చూస్తూ ఊరుకోడు అన్నమాట. కానీ మనం కూడా న్యాయంగా, ధర్మంగా బతుకుతూ ఇతరుల పట్ల సామరస్యంగా, జాలి, దయతో ఉంటేనే ఆయన మన కష్టం తీర్చటానికి వస్తాడు. తప్పు చేసిన వారిని దండిస్తాడు. హిరణ్యాక్షుడిని, హిరణ్య కశిపుడిని, రావణాసురుడిని అలాగే వచ్చి సంహరించాడు అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా!”
“ఇదంతా..కష్టం కలిగినప్పుడు మనని రక్షించటానికి స్వయంభువుగా వస్తాడు అనుకుందాం. మరి మనని పోషించటం అంటే..సూర్యుడి రూపంలో తన కిరణాలను ప్రసరించి పంటలు పడేట్లు చేస్తాడు. మనుషుల్లో దైనందిన కార్యకలాపాలకు అవసరమైన శక్తిని ఆరోగ్య రూపంలో ఇస్తాడు. అందుకే కదా..మొన్న బామ్మ లేవలేక ఊరికే పడుకుంటుంటే మనం డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లామా? అప్పుడు ఆయన ఏం చెప్పాడు? బామ్మకి ‘డి’ విటమిన్ తగ్గటం వల్ల జీవక్రియ మందగించింది. సూర్య రశ్మి శరీరానికి తగిలే విధంగా రోజు ఉదయం ఎండలో కూర్చోమన్నారా లేదా? అలా మనని పోషిస్తాడు.”
“ఇంకా.. నదులు ఒక చోట ఉంటాయి. పంట పొలాలు ఇంకొక చోట ఉంటాయి. మరి వాటికి నీరు ఎక్కడ నించి వస్తుంది? అందుకే నదుల్లో నీటిని తన వాడి అయిన కిరణాలతో పీల్చుకుని వర్షం కురవటం రూపంలో తిరిగి అంతటా నీరు సరఫరా చేస్తాడన్నమాట. అప్పుడు పంటలు పండి మనకి ఆహారం దొరుకుతుంది.”
“అసలు పంటలు పండే భూమి ఆయనే! ఆ భూమిలో పంటలకి అవసరమైన ఖనిజాలు, లవణాలు రూపంలో ఉన్నదీ ఆయనే అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! ఒక చెట్టు ఎదిగి పువ్వులు పూసి, అది కాయగా మారి పండులాగా తయారవ్వడానికి అవసరమైన కాల రూపమూ ఆయనే.”
“సూర్యుడు, చంద్రుడు కూడా శ్రీమన్నారాయణ రూపమే అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. అలా సూర్యమండలంలో ఉండి మనని పోషించే శ్రీమన్నారాయణుడిని “పుష్కరాక్షుడు” అంటారు.”
“‘మహాస్వన:’ అంటే..మనం ఎన్నో రకాల శబ్దాలని వింటూ ఉంటాం. ఆ శబ్దాలు మనం సృష్టించలేదు కదా! మరి సృష్టి ప్రారంభంలో ఆ శబ్దం ఎక్కడి నించి వచ్చిందో తెలుసా? అంతరిక్షంలో, ఆకాశంలో, సూర్య మండలంలో శబ్దం ఉంటుంది. మన చుట్టు పక్కల ఉండే శబ్దాలే మనకి వినపడతాయి. సూర్యమండలంలోని శబ్దం మన ఈ చెవులకి మామూలుగా వినపడదు. కానీ మన పూర్వ ఋషులు తమ తపశ్శక్తి ద్వారా విని అది “ఓంకారం” అని చెప్పారు. అంటే ఓంకారం సూర్యుడి నించి వినిపించిన మొదటి శబ్దం. ఆ విషయాన్ని ఇటీవల విదేశీయులు తమ ఆధునిక పరికరాల ద్వారా రికార్డ్ చేసి, మన ఋషులు చెప్పినట్లు అది ఓంకారం అని నిరూపించారు.”
“అలా మనకి అనుభవంలోనికి వచ్చి మన పోషణకి, సుఖానికి, సంతోషానికి అవసరమైన అన్నిటినీ నిరంతరం మనకి అందిస్తూ తను మాత్రం ఎప్పటికీ అంతం అనేది లేకుండా..అన్ని చోట్లా, అన్నిరూపాల్లో నిలిచి ఉండేవాడు ఉత్తముడైన ఆ శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు తెలిసిందా? అందుకే ఆయన్ని మనం రోజు స్మరించుకోవడం ద్వారా కృతజ్ఞతలు తెలియజేయాలి. రేపు ఇంకొన్ని శ్లోకాలు నేర్చుకుందాం” అని తాతయ్య పిల్లలని పంపించేసి తాను భగవద్గీత పఠనంలో పడ్డాడు.

కామెంట్‌లు