శ్రీమద్భాగవతం: భక్తి రసామృత సారము (11 వ భాగం):- సి.హెచ్.ప్రతాప్
 ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః  

శ్రీమద్భాగవతం కేవలం ఒక పురాణం కాదు, అది భక్తి రసామృత సారము. వేద వ్యాస మహర్షి చతుర్వేదాలను విభజించి, అష్టాదశ పురాణాలను, మహాభారతం వంటి అద్భుత కావ్యాన్ని, వేదాంత దర్శనమైన బ్రహ్మసూత్రాలను రచించినప్పటికీ ఆయన హృదయం ఏదో తెలియని వెలితితో, అశాంతితో నిండిపోయింది. సర్వశాస్త్రాలను మధించి లోకానికి జ్ఞాన భిక్ష పెట్టిన ఆ మహర్షికి తన రచనల్లో ధర్మం, జ్ఞానం పుష్కలంగా ఉన్నా, ఆత్మకు పరమానందాన్ని ఇచ్చే మధురమైన పరమ భక్తి రసం లోపించినట్లు అంతర్గతంగా అనిపించింది. ధర్మం మనిషిని క్రమశిక్షణలో ఉంచుతుంది, జ్ఞానం సత్యాన్ని బోధిస్తుంది, కానీ హృదయాన్ని ద్రవింపజేసి పరమాత్మ వైపు నడిపించే ప్రేమ తత్త్వం ఎక్కడో మరుగైందని వ్యాసుడు చింతించారు.
సరిగ్గా అదే సమయంలో పరమ భాగవతోత్తముడైన నారద మహర్షి వ్యాసాశ్రమానికి విచ్చేశారు. తన శిష్యుడైన వ్యాసుని ముఖంలోని విషాదాన్ని గమనించిన నారదుడు, దాని వెనుక ఉన్న కారణాన్ని తన దివ్య దృష్టితో గ్రహించారు. వ్యాసుడు లోక కల్యాణం కోసం అనేక శాస్త్రాలను రచించినా, వాటిలో ఎక్కువగా లౌకిక ధర్మాలు, కర్మకాండలు, అర్థకామాల గురించిన వివరణలే ప్రాధాన్యత పొందాయని, భగవంతుని నిరుపాధికమైన భక్తి గురించి, ఆయన లీలల గురించి ప్రత్యేకంగా వివరించలేదని నారదుడు సున్నితంగా మందలించారు. భగవంతుని గుణ కీర్తన లేని రచనలు ఎంత గొప్పవైనా అవి కాకులకు ఇష్టమైన ఉచ్ఛిష్ట పాత్రల వంటివని, కేవలం భక్తితో నిండిన మాటలే హంసల వంటి జ్ఞానులను ఆకర్షిస్తాయని నారదుడు స్పష్టం చేశారు.
నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరిస్తూ, ఒక దాసీ పుత్రుడిగా పుట్టిన తాను సత్పురుషుల సేవ ద్వారా, వారి ఉచ్ఛిష్టాన్ని స్వీకరించడం ద్వారా మరియు నిరంతర భగవన్నామ స్మరణ ద్వారా ఎలా పరమాత్మ స్థితిని చేరుకోగలిగారో వివరించారు. భక్తి లేని జ్ఞానం కేవలం శుష్క తర్కమే అవుతుందని, అదే భక్తితో తోడైతే అమృతమై మోక్షానికి దారి తీస్తుందని ఆయన బోధించారు. కేవలం శ్రీకృష్ణుని దివ్య లీలలను, మధురమైన గుణాలను కేంద్రీకరించి ఒక మహాగ్రంథాన్ని రచించమని, అది మానవ హృదయాలలోని మాలిన్యాన్ని కడిగే పవిత్ర గంగా ప్రవాహంలా ఉండాలని నారదుడు ఆదేశించారు.
ఈ మహోపదేశం విన్న వ్యాసుడు సరస్వతీ నదీ తీరంలో ధ్యానమగ్నుడై, ఆ సమాధి స్థితిలో పరమాత్మ స్వరూపాన్ని, మాయా శక్తిని, ఆ మాయకు లోనై సంసార చక్రంలో చిక్కుకున్న జీవులను దర్శించారు. భక్తి యోగం ద్వారానే ఈ మాయను దాటవచ్చని గ్రహించిన వ్యాసుడు, ఆ దివ్య అనుభూతిని అక్షరబద్ధం చేస్తూ శ్రీమద్భాగవత పురాణాన్ని రచించారు. నారద మహర్షి ప్రేరణే లేకపోతే ఈ భక్తి రస కావ్యం లోకానికి అందేది కాదు. ధర్మం మనిషిని సక్రమంగా నడిపిస్తే, జ్ఞానం ఉన్నత స్థితికి చేరుస్తుంది, కానీ భక్తి మాత్రమే మనిషిని భగవంతునితో శాశ్వతంగా ఏకం చేస్తుంది. అందుకే భాగవతం అనేది కేవలం ఒక పుస్తకం కాదు, అది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వాజ్మయ స్వరూపం.

కామెంట్‌లు