వినరో భాగ్యము విష్ణు కథలు:(13):- ఎం బిందుమాధవి

 “అమ్మా ఆకలేస్తోంది. త్వరగా ఏమైనా పెట్టు. బామ్మ కథ చెప్పటం మొదలు పెట్టేస్తుంది”అన్నాడు వాసు.
“నీలో జఠరాగ్ని రూపంలో ఉన్న ఆ శ్రీమన్నారాయణుడు నువ్వు తిన్న ఆహారాన్ని త్వరగా అరిగించేసి ఆకలి వేసేట్టు చేస్తున్నాడు చూశావా” అన్నది బామ్మ.
“అవును బామ్మా..నిన్న నువ్వు చెప్పినప్పటి నించీ నేను కూడా గమనిస్తున్నాను. చెల్లాయికి ఎప్పటికీ ఆకలి వెయ్యదు. అమ్మ దాన్ని బతిమాలి అన్నం పెట్టాలి. నాకేమో తిన్నాక అరగంట అవగానే ఆకలి వేస్తుంది. సరే ఇవ్వాళ కథ మొదలుపెట్టు” అన్నాడు హుషారుగా వాసు.
@@@@
“విశ్వకర్మా మనస్త్వష్టా స్థవిష్ఠ: స్థవిరో ధ్రువ:
అగ్రాహ్య: శాశ్వత: కృష్ణో లోహితాక్ష: ప్రతర్దన:
ప్రభుతస్త్రి కకుబ్ధామ పవిత్రం మంగళం పరం”
అని తరువాయి శ్లోకం పిల్లల చేత చెప్పించి..”ఆ శ్రీ మన్నారాయణుడు ఈ విశ్వం అంతా నిర్మించాడు..సృష్టించాడు..తాను సృష్టించిన అన్నిట్లోనూ తానే చైతన్య రూపంగా ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా. అలా రాతితో కానీ, చెక్కతో కానీ ఒక శిల్పాన్ని, ఒక బొమ్మని, అలాగే మట్టితో ఒక కుండని, రక రకాల ఆకారాలతో బొమ్మలని తయారు చేసే భగవంతుడి లక్షణాన్ని ‘విశ్వకర్మ’ అనే పేరుతో పిలుస్తాము. ‘కర్మ’ అంటే నిర్మించే వాడు, చేసేవాడు అని అర్థం.”
“ఇంకా వివరంగా చెప్పాలంటే చేతులు, కాళ్ళు ఇలా ఐదు వేళ్ళతో ఉండాలి. అవి శరీరానికి ముందు వైపు ఉండాలి. చెవులు, ముక్కు, కళ్ళు ముఖంలో ఈ షేప్ లో ఉండాలి అని రూప నిర్ణయం చెయ్యటం అన్నమాట. అలా కాకుండా వేరేగా ఉంటే..మనం వెంటనే ‘ఏమిటి ఈయన ఇలా ఉన్నాడు’ అనుకుంటామా లేదా? అది ఆ శ్రీమన్నారాయణుడు ‘త్వష్ట’ నామానికి అర్థం” అంది బామ్మ.
“ఇలా మన గురించి మనం తెలుసుకుంటుంటే భలే ఉంది బామ్మా. నిజమే కదా మనిషి అంటే ఈ రూపం, జంతువు అంటే ఈ షేప్, పక్షి అంటే ఈ సైజు..ఇలా లోతుగా నువ్వు చెబుతుంటే..మేము కూడా ఆలోచిస్తున్నాము. సృష్టిలో ఒక జీవిని చూడగానే దాని రూపంతో అదేమిటో తెలుసుకో గలుగుతున్నామంటే ఇన్ని భిన్న రూపాలు సృష్టించిన ఆ దేవుడు నిజంగా అద్భుతం” అన్నాడు ఆనందం పట్టలేని స్వరంతో పవన్.
“అలా ఇన్ని రూపాలు, ఇన్ని సైజులు సృష్టించే ఆ దేవ దేవుడు విశాలమైన వాడు, స్థిరమైన వాడు, శాశ్వతమైన వాడు..అంటే ఇవ్వాళ ఉండి రేపు వెళ్ళిపోయే వాడు కాదు. కుండ పగిలినట్టో, బొమ్మ విరిగినట్టో, చెట్టు కూలిపోయినట్టో నశించేవాడు కాదు అని అర్థం. అంతే కాదు..నది కానీ, చెట్టు కానీ, మనిషి కానీ పరిణామం చెందుతూ ఉంటాయి. నదిలో నిన్న ఉన్న నీరు వేరు, చెట్టుకి నిన్న ఉన్న కొమ్మలు, రెమ్మలు, పువ్వులు వేరు..ఇవ్వాళ వేరుగా ఉంటాయి..రేపు ఇంకా మారిపోతాయి. కానీ వాటికి ఆ మార్పుని తీసుకొచ్చే చైతన్యం మాత్రం స్థిరంగా అలాగే ఉంటుంది. అది మారదు. ఇంకొక విషయం తెలుసా..తమలో ఆ మార్పు తెస్తున్న చైతన్యం గురించి వాటికి తెలియదు. నిప్పుకి తనలో వేడి అనే గుణం ఎలా వచ్చింది, చెట్టుకి రోజు ఎదిగే గుణం ఎవరు ఇచ్చారు, భూమికి తనలో ఉన్న గంధం అనే రసం ఎవరు ఇచ్చారు..తన ఉనికి ఇలా ఉండటానికి కారణం ఎవరు అనేది వాటికి తెలియదు. అదే “స్థవిష్ఠ: స్థవిరో ధ్రువ:” అంటే!”
“ఆయన ఉనికిని మనం చేత్తో పట్టుకోలేము, కంటితో చూసి గ్రహించలేము. ఆయన మాత్రం తన ‘కర్షక’ శక్తితో మనని పట్టుకుని మనకి రూపం, కదలికలు ఉండే ఒక ఉనికిని కల్పిస్తాడు. ఎలా అంటే..మురళీ మీకు సైన్స్ పాఠాల్లో ‘అయస్కాంతం’ గురించి చెప్పారా? మీకు ప్రాక్టికల్స్ లో ఇసుకని, ఇనప రజనుని కలిపేసి దానికి దగ్గర అయస్కాంతాన్ని పెట్టి ఇనప రజను అంతా అయస్కాంతానికి అతుక్కునేట్లు చేసి చూపించారా? అలా అన్నమాట. అప్పటి వరకు ఆ ఇసకలో ఇనుము ఉన్నట్లు మనకి తెలియదు..అవునా? అలా అన్నమాట.”
‘కృష్ణ’ అంటే కర్షకుడు అనే అర్థం కూడా ఉంది. మనం రైతులని కర్షకుడు అంటాం..అవునా? రైతు పొలం దున్ని..కలుపు, రాళ్లు ఏరేసి, విత్తనం వేసి పంట పండించి ఆ ఫలితాన్ని ఆహార ధాన్యాల రూపంలో మనకి ఇస్తాడు. దేవుడు కూడా అంతే!”
“అలా అన్నీ మనకి ఇస్తూనే..తప్పు చేసిన వారిని అవసరాన్ని బట్టి, పరిస్థితులని బట్టి దండిస్తాడుకుడా. అలా విధించే దండన క్రూరంగా, మూలం వరకు నశించే విధంగా ఉంటుంది. ఇంకొక సారి అలాంటి తప్పు మరేవ్వరూ చెయ్యకుండా ఉండేట్లు అన్నమాట. అలా దండించేటప్పుడు ఆయన కళ్లు ఎర్రగా ఉంటాయి. రావణాసురుడిని రాముడు, కంసుడిని కృష్ణుడు, సంహరించేటప్పుడు స్వామి కళ్లు కోపంతో ఎరుపెక్కి ఉంటాయి. దేవుడి అలాంటి కోపాన్ని ధర్మాగ్రహం అంటారు. “పరిత్రాణాయ సాధునామ్, వినాశాయచ దుష్కృతాం” అని తనే అన్నాడు కదా! అంటే మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే..మనని శాంతి భద్రతలతో కాపాడే ప్రభుత్వమే..ఎవరైనా ఎవరినైనా హత్య చెయ్యటమో, తీవ్ర వాదుల రూపంలో బాంబులు పేల్చటమో చేసి అరాచకం సృష్టిస్తే ‘ఉరిశిక్ష’ వేసి దండిస్తుంది కదా..అలా అన్నమాట.”
“ఎరుపు రంగు కోపానికే కాదు, ప్రేమకి కూడా చిహ్నమే. ఎలా అంటే “వాలంటైన్స్ డే” అని మీరు పేపర్ లో టీవీలో చూస్తూ ఉంటారు కదా..ఆ రోజు ఏం చేస్తారు..తనకి ప్రేమ ఉన్న వారికి ఎర్ర గులాబీలు ఇస్తారా లేదా? అలా ఎరుపు రంగు ప్రేమకి, కోపానికి కూడా గుర్తు. అలా ఆ శ్రీమానారాయణుడు “లోహితాక్షుడు” అంటే ఎర్రటి జీరలు కల కళ్లతో ఉంటాడు. మనని ప్రేమిస్తాడు, తప్పు చేస్తే దండిస్తాడు అని అర్థం.”
“ఇవ్వాళ్టికి చాలా? మళ్లీ రేపు ఇంకొన్ని శ్లోకాలు నేర్చుకుందాం” అని బామ్మ పిల్లలని పంపించి తన పనిలో పడింది.

కామెంట్‌లు