“రామ్మా మానసా..నువ్వు కూడా శ్లోకాలు నేర్చుకుంటావా” అని బామ్మ మెడిసిన్ చదువుతున్న మానసని ఆహ్వానించారు.
“అవును బామ్మా..వీళ్ళందరూ నేర్చుకుంటుంటే నాకూ నేర్చుకోవాలనిపించింది. ఆ మాటే అమ్మతో చెబితే మీ దగ్గరకి వెళ్ళమన్నది” అని బామ్మ పక్కన చాప మీద కూర్చుంది.
“పిల్లలూ .. ఈ రోజు నించి మీతో పాటు ఇంకొక అక్క కూడా నేర్చుకుంటుందిట. ఇప్పటి వరకు నేర్చుకున్నవన్నీ మీరు అక్కకి నేర్పండి. ఇప్పుడు మీతో కలిసి ఈ రోజు చెప్పేవాటికి తను కూడా గొంతు కలుపుతుంది” అని బామ్మ ప్రారంభించింది.
“ప్రభూతస్త్రి కకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్
ఈశాన: ప్రాణద: ప్రాణో జ్యేష్ఠ: శ్రేష్ఠ: ప్రజాపతి:
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన:”
“శ్రీమన్నారాయణుడు వాయు రూపంలో, చైతన్య రూపంలో విశ్వం అంతా వ్యాపించి ఉంటాడు అని తాతయ్య చెప్పారు కదా! కానీ వాటికి భౌతిక రూపం లేదు. ఇప్పుడు శ్రీ మహా విష్ణువు ఒక భౌతిక రూపంతో త్రివిక్రముడిగా, వామనుడిగా మూడు స్థానములలోనూ ఆక్రమించుకుని ఉంటాడు. మూడు అంటే.. ఊర్ధ్వ, అధ:, అంతరిక్ష స్థానాలన్నమాట.”
“అలా మూడు స్థానాలని ఆవరించి..వాటిని నియమించి, శాసించి, పోషించేవాడు కాబట్టి ఆయనని ఈశానుడు అంటారు. కాబట్టి మనం కూడా ఆయనని అన్ని అవస్థలలోను..అంటే జాగృత్, స్వప్న, సుషుప్తులలోనూ స్మరిస్తే..ఆయన మనని అనుక్షణం కాపాడతాడు అని అర్థం.”
‘జాగృత్’ అంటే మన అవయవాలతో, మన ఇష్టంతో బుద్ధి పూర్వకంగా చేసే పని. ‘స్వప్న’ అంటే కలలో మన ఇంద్రియాలు పని చేయవు. మనసు, బుద్ధి మాత్రమే చైతన్యవంతమై మేలుకుని ఉంటాయి. ‘సుషుప్తి’ అంటే ఇంద్రియాలు, మనసు కూడా పని చెయ్యవు. ఆత్మ ఒక్కటే..అంటే భగవంతుడి చైతన్యం ఒక్కటే ఉంటుంది.”
“మనం మెలకువగా ఉన్నప్పుడు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తూ, స్మరిస్తూ ఉంటామో దాని బలమైన ముద్ర మనసులో పడుతుంది. అంటే..పవన్ ఎప్పడు బొంగరాల గురించి, వేణు గాలిపటాల గురించి, మానస పుస్తకాల గురించి ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటారే..అలా అన్నమాట. అదే నిద్రలో కలవరిస్తూ ఉంటారు. అలా ఆ ముద్రే సుషుప్తిలో పని చేస్తుంది. కాబట్టి మనం భౌతిక స్పృహలో ఉన్నప్పుడు ధర్మ బద్ధంగా బతుకుతూ దైవ స్మరణ చెయ్యాలి అని పెద్దలు చెబుతారు.”
@@@@
“భగవంతుడు త్రివిక్రమ రూపంలో మూడు స్థానాలను ఆక్రమించి ఉంటాడు అని ఇందాక చెప్పాను కదా! ఆ మూడు స్థానాలు అంటే ఇంకా వివరంగా, మీకు అర్థం అయ్యేట్టు చెబుతా వినండి. మనం సూర్యుడికి ఎదురుగా నేల మీద ఒక చతురస్రం గీసి దాని మధ్యలో నిలబడ్డామనుకోండి. మన ఎదురుగా తూర్పు (1) కుడి చేతి వైపు దక్షిణం (2) వెనక పశ్చిమం (3) ఎడమ చేతి వైపు ఉత్తరం(4) దిక్కులంటాం. ఇంకా చతురస్రంలో నాలుగు కోణాలు కూడా ఉంటాయి కదా! అవి తూర్పుకి-దక్షిణానికి మధ్య ఆగ్నేయం (5) దక్షిణానికి- పశ్చిమానికి మధ్య నైరుతి (6) పశ్చిమానికి-ఉత్తరానికి మధ్య వాయవ్యం (7) ఉత్తరానికి-తూర్పుకి మధ్య ఈశాన్యం(8) అంటారు. అలా నాలుగు దిక్కులు, నాలుగు మూలలు కలిపి అష్ట దిక్కులు అంటాం. అలాగే వాటికి వేరే వేరే దేవతలు అధిపతులుగా ఉంటారు. నేను పైన చెప్పిన వరస క్రమంలో (1) కి ఇంద్రుడు, (2) కి అగ్ని, (3) కి యముడు, (4) కి నిరుతి, (5) కి వరుణుడు, (6)కి వాయువు, (7) కి కుబేరుడు, (8) కి ఈశానుడు. ఇన్ని పేర్లు విడి విడిగా చెప్పుకున్నా కూడా వాళ్ళందరూ విశ్వరూపమైన విష్ణువే.
“ఇంతకు ముందు రోజుల్లో మనం చెప్పుకున్నట్టు.. విద్య, వైద్యం, ఇంజనీరింగ్, నీటి నిర్వహణ, సామాజిక సేవ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ ఇలా అనేక పేర్లతో పిలవబడే ఒకే ఒక ప్రభుత్వం అనే వ్యవస్థ ‘విశ్వం’అన్నమాట.”
“ఇక ఇప్పుడు ముందు చెప్పిన మూడు స్థానాలు, అష్ట దిక్కులని కలిపి 14 లోకాలు అంటారు. మూడు స్థానాలు..అవేంటో తెలుసా.. ‘అధ:’ అంటే భూమికి కింద..అతల, వితల, సుతల, తలా తల , రసాతల, మహాతల, పాతాళం..అని ఏడు లోకాలు. ఈ లోకాల్లో అసురులు, దానవులు, నాగులు నివసిస్తారు అని చెబుతారు. మనకి తెలుసు కదా..పాములు, ఎలుకలు లాంటి ఎన్నో జీవులు భూమి లోపల నివసిస్తాయి. కొన్ని భౌతిక రూపంతో కనిపిస్తాయి, కొన్ని కంటికి కనిపించవు.”
“మీకు బలి చక్రవర్తి కథ తెలుసా” అంది బామ్మ.
“కొంచెం తెలుసు. అంతా తెలియదు అన్నాడు వేణు.
“బలి చక్రవర్తి దానవరాజు. ప్రహ్లాదుడికి మనవడు. ఆయనకి శ్రీ మహా విష్ణువు అంటే చాలా భక్తి. కానీ తను గొప్ప దాత అని, తనకి సాటి, పోటీ ఎవరు లేరని గర్వంతో ఉండి దేవతల అధికారాన్ని అణచెయ్యాలని ప్రయత్నించాడు. తన దానశీలత అనే అహంకారంతో ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. అందుకొరకు పెద్ద యజ్ఞాన్ని తలపెట్టాడు. సాధారణంగా చక్రవర్తులు యజ్ఞం చేసేటప్పుడు పండితులకి, బ్రహ్మచారులకి, ఋషులకి, యోగులకి అడిగినది లేదనకుండా దానాలు చేస్తారు. అది అవకాశంగా తీసుకుని, అతనికున్న ఆ దాన లక్షణాన్నే ఉపయోగించుకుని అతనికి బుద్ధి చెప్పాలని, విష్ణు మూర్తి వామన రూపంలో వచ్చి మూడు అడుగులు దానం ఇమ్మని అడుగుతాడు. ఈ బాల బ్రహ్మ చారి దానం అడిగింది మూడు అడుగులే కదా అని ఇస్తానని బలి చక్రవర్తి వాగ్దానం చేస్తాడు.”
“అప్పుడు వామనుడు నిలబడిన చోట ఒక అడుగు (పాదం) ఉంచి, రెండవ అడుగు ఆకాశం దాటి ఊర్ధ్వ లోకాల వరకు విస్తరించి..మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు. అప్పుడు బలి చక్రవర్తి తన తల చూపించి అక్కడ పెట్టమంటాడు. అలా బలి చక్రవర్తి తల మీద పెట్టి పాతాళానికి తొక్కేస్తాడు. అది ఇందాక చెప్పిన పాతాళ లోకం అంటే”!
“భూమి లోపలే కాదు..మన చుట్టూ కూడా అనేక జీవులు భౌతికంగా కనబడుతూ..మరి కొన్ని కనపడకుండా వాయురూపంగా ఉంటాయి. అందుకే మనం పూజ చేసుకునేటప్పుడు “ఉత్తిష్ఠంతు భూత పిశాచా: యేతే భూమి భారకా:” అని అంటూ ఉంటాము. ఎప్పుడైనా విన్నారా” అంది బామ్మ.
“ఆ:( మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు, రోజు తాతయ్య పూజ చేసుకునేటప్పుడు, విన్నాం బామ్మా..” అన్నది మానస.
“ఇక..ఊర్ధ్వ అంటే భూమికి పైన..భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోకం అని ఏడు. ఈ రెండు స్థానాలు కలిపి 14 లోకాలన్నమాట.”
“అలా ఊర్ధ్వ లోకాల్లో ఉండే జీవులు కూడా మనకి భౌతికంగా కనిపించవు. ఆకాశంలో తిరిగే జీవులని ఖేచరులు అంటారు. మన కంటికి కనపడని జీవులని.. లేవు అని చెప్పలేము కదా! ఇప్పుడిప్పుడు శాస్త్రవేత్తలు రక రకాల పరిశోధనల ద్వారా గ్రహాంతర వాసులని, ఫ్లైయింగ్ సాసర్స్ అని పేరు పెట్టి ఈ ఖేచరుల గురించి కొత్త కొత్త విషయాలు చెబుతున్నారు.”
“భూమికి ఆకర్షణ శక్తి ఉందని మనం స్కూల్లో చదువుకున్నాం. పై పైకి కొంత దూరం..అంటే ఇందాక మనం చెప్పుకున్న ‘ఊర్ధ్వ లోకం’.. వెళ్ళాక అక్కడ భూమికి ఉన్న ఆకర్షణ శక్తి పని చెయ్యదు. కాబట్టే అంతరిక్షయానం చేసేవాళ్ళు గాలిలో తేలుతున్నట్టు మనం టీవీల్లో చూస్తూ ఉంటాము. ఇప్పుడు సుదూరమైన వస్తువులని కూడా ఫోటోలు తీసే సౌకర్యాలు వచ్చాయి కనుక కెమెరాలతో తీసి మనకి టీవీలో చూపిస్తున్నారు.”
“కాబట్టి చెప్పేదేమిటంటే మనం చూడలేని ఎన్నో లోకాలు, జీవులు ఉన్నాయన్నమాట.
అలా మూడు లోకాల్లో..సర్వత్రా వ్యాపించి అన్ని దిక్కులని తన అధీనంలోకి తెచ్చుకున్న త్రివిక్రమ రూపమే “త్రికకుబ్ధామ” అంటే! ఆయన అందరి కంటే పవిత్రమైన వాడు, మంగళకరమైనవాడు. మంగళకరం అంటే మనం ధర్మ బద్ధంగా బతికితే..మనకి దు:ఖం, బాధ, అశాంతి లేకుండా చేసేవాడు అని అర్థం.”
“ఇంకా అన్ని జీవుల్లో చైతన్య రూపం ఆయనే అని చెప్పుకున్నాం కదా. చైతన్యం అంటే ప్రాణం అన్నమాట. అమ్మా మానసా..మీకు మెడిసిన్ లో మానవ శరీరం (అనాటమీ) గురించి చెబుతారు కదా! అందులో ప్రాణం అనే దాన్ని మీరు ఎప్పుడైనా చూశారా” అని అడిగింది బామ్మ.
“లేదు బామ్మా..కాళ్ళు, చేతులు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం..ఇలాంటివే చూశాం. ప్రాణం ఎప్పుడు చూడలేదు” అన్నది మానస.
“అదే చైతన్యం అని మనం చెప్పే దైవ శక్తి. ప్రాణం లేకపోతే అసలు జీవి కదలదు. ఏ అవయవము దాని పని అది చెయ్యలేదు..అవునా? మనలో ఉండే ప్రాణాలని ప్రాణ వాయువులు అంటాం. అవి పది రకాలు”.
“మాములుగా ‘పంచ ప్రాణాలు’ అనుకుంటూ ఉంటాము. కానీ అవి పది రకాలు. (1) ప్రాణ వాయువు అంటే చైతన్యం (2) అపాన..మనం తినే ఆహారంలోని విషవాయువులని బయటికి నెట్టేసే వాయువు (3) వ్యాన..ఏ రకమైన జీవికి ఆ రకమైన జీవే పుట్టటం..మనిషికి మనిషి, ఆవుకి ఆవు, ఎలుకకి ఎలుక (4) ఉదాన..ఇది శరీరంలో పై వైపుకి అంటే గొంతు, తల వైపు ప్రసరించే శక్తి..ఎదగటానికి, మాట్లాడటానికి ఉపయోగపడే శక్తి. అంతే కాదు..మనిషి చనిపోయినప్పుడు మన భౌతిక శరీరంలో నించి బయటికి వెళ్ళిపోయే తేజస్సు అన్నమాట. (5) సమాన..ఈ వాయువు మన శరీరం భాగాలన్నీ సమానంగా ఎదగటానికి ఉపయోగపడుతుంది. ఈ ఐదింటిని ముఖ్య ప్రాణాలు అంటారు”.
“మిగిలినవి ఉప ప్రాణాలు అంటారు. (6) నాగ వాయువు..మనం ఆహారం తినేటప్పుడు ఇక చాలు అని మన శరీరం తెలియజేసే ‘త్రేనుపు’సంకేతం (7) కూర్మ..భక్తి, జ్ఞానాల వల్ల మనిషి శరీరాన్ని ఆవరించి ఉండే బయటి తేజస్సు ..ఈ వాయువు మనం కను రెప్పలు ఆడించటానికి, కంట్లో తేమ ఉండటానికి ఉపయోగపడుతుంది. ఈ బయట తేజస్సును ఇప్పుడు ‘aura’ అంటున్నారు (8) క్రుకర..ఆకలిని తెలియజేసే వాయువు (9) దేవదత్త వాయువు..ఇది జీవి అలసటని తెలియజేసే ఆవులింతకి సంబంధించినది. (10) ధనంజయ..జీవికి పోషణని ఇవ్వటమే కాకుండా, జీవి మరణించాక కుళ్ళిపోకుండా కొంత సేపు ఆపి, తరువాత శరీరంలోని పంచభూతాలను భౌతికమైన పంచభూతాలతో ఏకం చేసే వాయువు.”
“ఈ 10 ప్రాణాలకి అధిపతి, ఈశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడే! అందుకే ఆయనని జ్యేష్ఠ..అంటే మొదటివాడు, శ్రేష్ఠ అంటే విశేషమైన వాడు అంటాము. అంతే కాదు..ప్రజాపతి అంటే ప్రాణ రూపంగా చైతన్యాన్ని ఇస్తూ జీవ సృష్టికి మూలమైన వాడు అని కూడా అంటాం. పిల్లలూ .. ఇప్పుడు బాగా అర్థం అయిందా. రేపు మరి కొన్ని నేర్చుకుందాం. ఇవ్వాళ చాలా నేర్చుకున్నాం కదా..అందుకే వెళ్లి నేర్చుకున్నవి ఒక్క సారి మననం చేసుకుని, తరువాత ఆడుకుని రండి” అంది బామ్మ.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి