వినరో భాగ్యము విష్ణు కథలు: (15):- ఎం బిందుమాధవి.

 “తాతయ్యా ఇందాక స్కూల్ నించి వస్తూ..పార్క్ దగ్గర ఒక కుక్క శవం చూశాను. దోమలు, ఈగలు ముసురుతున్నాయి. చాలా భయమేసింది” అని పరుగెత్తుకొచ్చినందువల్ల వచ్చిన ఆయాసంతో రొప్పుతూ చెప్పాడు మహేశ్.
“రా..ఇలా రా” అని దగ్గరకి తీసుకుని ఒడిలో కూర్చో బెట్టుకుని “భయమెందుకు? చనిపోయింది అని నువ్వే చెబుతున్నావు కదా.. అది లేవలేదు. దానిలో జీవ చైతన్యం లేదు కాబట్టి, తమని ఏమీ చెయ్యదు అని ఈగలు, దోమలు ముసురుతాయి. ఆ శవం మీద తమ ఆహారాన్ని వెతుక్కుంటాయి” అన్నారు తాతయ్య.
“అయితే తాతయ్యా ఆ కుక్కలో ఉండే ‘ధనంజయ వాయువు’ ఆ కుక్కని కుళ్లిపోకుండా చెయ్యదా” అని అడిగాడు.
“అబ్బో నిన్నటి శ్లోకాలలో అర్ధాలు నీకు బాగానే గుర్తునాయన్నమాట” అంది అప్పుడే అక్కడికి వచ్చిన బామ్మ.
“అవును బామ్మా..నిన్న నువ్వు చెప్పిన శ్లోకాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఎన్ని విషయాలు తెలిశాయో! మనం పీల్చే గాలి ఎక్కడికి వెళుతుందో, లోపలికి వెళ్లి ఏం చేస్తుందో ఏమీ మాకు తెలియదు. కానీ నువ్వు నిన్న ప్రాణ వాయువులు, ఆవలింతలు, త్రేనుపు..వీటన్నిటి గురించి చెబుతుంటే ఎన్నో విషయాలు తెలిసాయి” అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన వేణు.
“సరే ఇవ్వాళ తరువాయి శ్లోకాలు చెప్పుకుందాము. ముందు నిన్న చెప్పిన శ్లోకంలో చివరి పాదం ఇంకొక సారి చెప్పుకుందాం” అని తాతయ్య మొదలుపెట్టి
“హిరణ్య గర్భో భూ గర్భో మాధవో మధుసూదన:
ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమ: క్రమ:
“సాధారణంగా హిరణ్య గర్భుడు అని బ్రహ్మ దేవుడిని అంటారు. బ్రహ్మ దేవుడు ప్రజాపతులు, ఋషులు, మనువుల ద్వారా సృష్టి కార్యం నిర్వహిస్తాడు. కానీ శ్రీమన్నారాయణుడిని కూడా హిరణ్య గర్భుడు అని చెప్పొచ్చు. సృష్టికి అవసరమైన బీజాలను అండ రూపంలో తనలో దాచుకుని..సృష్టి కర్త అయిన బ్రహ్మ గారిని తన నాభి కమలంలో నించి సృష్టించాడు కనుక శ్రీమన్నారాయణుడు హిరణ్య గర్భుడే! అంతే కాదు తాను సృష్టించిన విశ్వానికి హితమైన వాడు, రమ్యమైన వాడు. హితమైనవన్నీ రమ్యమైనవి కానక్కరలేదు. ఎలా అంటే మనకి ఔషధం హితకరం. కానీ అది చేదుగా ఉంటుంది. రమ్యం గా ఉంటూనే, మనకి తన తేజస్సుతో మంచి చేసేవాడు ఆ శ్రీమన్నారాయణుడు అన్నమాట.
“శ్రీమన్నారాయణుడు భూమిని తన గర్భంలో ధరిస్తాడు. ఆయన విశ్వ వ్యాపకుడు కదా..ఆ భూమి గర్భంలో తను ఉంటాడు. భూమిలో ఖనిజాలు, లవణాలు, ఇతర విలువైన పదార్థాలు, అగ్ని, నీరు..ఇలా అన్నిటి రూపంలో శ్రీమన్నారాయణుడు ఉంటాడని.. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా”
“‘మా’ అనే సంస్కృత పదానికి లక్ష్మి అని అర్థం. ‘మా’కి పతి కాబట్టి మాధవుడు అయ్యాడు. అంతేకాదు..కంటికి కనపడని చైతన్య రూపమైన ఆయన మౌనము, ధ్యానము, యోగముల చేత మాత్రమే తెలియబడేవాడు కాబట్టి మాధవుడు అంటారు.”
“శ్రీమన్నారాయణుడు మకరందం లాగా మధురమైనవాడు. పువ్వులలో ఉండే మధువు లక్షణం ఆయనే. పువ్వులలో ఉండే ఆ మధువు గురించి వాటి మీద వాలే కీటకాలకే తెలుస్తుంది. అవే ఆ మధువుని తాగగలవు. అలా..ఏ మనో వికారాలు అలజడులు లేకుండా ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేసే వారికి మాత్రమే ఆయన దొరుకుతాడన్నమాట. సృష్టి అనే పువ్వులో ఉండే మాధుర్య మకరందం ఆయన!”
“‘మధు సూదన’ అంటే..శ్రవణం వల్ల మనకి కలిగే మాలిన్యాలని పోగొట్టి మనని ఉద్ధరించేవాడు. పురాణాల ప్రకారం శ్రీమన్నారాయణుడి చెవి మాలిన్యంలో మధు, కైటభులనే ఇద్దరు రాక్షసులు ఉన్నారు. వారిని సంహరించిన వాడు అని శబ్దార్థం. చెవి మాలిన్యం అంటే వినకూడని విషయాలు వినటం వల్ల మన మనసులో కలిగే మాలిన్యాన్ని పోగొట్టేవాడు అని చెప్పచ్చు.
“మధు, కైటభులే అహంకార, మమకారాలనే మన మనో మాలిన్యాలు. ‘మధు’ అనే అహంకారం కలగగానే, నా వాళ్లు, నా స్వార్థం అనే మమకారాలు, ఇతరుల పట్ల భేద భావం, తృణీకార భావం పెరుగుతాయి. ఆ భావాలనే మధుర పదార్థం చుట్టూ చేరే కీటకాలతోపోల్చారు. ఆ భావాలని జయించగలిగే వారే ఆ దేవ దేవుడిని చేరగలరు అని పెద్దలు చెబుతారు.”
“మన ఇంద్రియాలు సృష్టించే మనో వికారాలు, కోరికలు మధువు లాగా మత్తుని కలిగించి..పదే పదే అది కావాలనే కోరికని ప్రేరేపిస్తాయి. ఇప్పుడు యువకులు, విద్యార్థులు కూడా దురలవాట్లకు, మత్తు పదార్థాలకు ఎలా బానిసలవుతున్నారో చూస్తున్నాం కదా! అంతేనా..ఇప్పుడు మీరందరూ టీవీల్లో సెల్ ఫోన్లలో చూస్తున్న, వింటున్న అశ్లీలపు పాటలు, మాటలు మీకు అనేక వికారాలని కలిగించి ఆ వైపు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయి. అవునా! అవే మధు, కైటభులు అనే రాక్షసులు. అవి మీలో తప్పు ఒప్పుల విచక్షణని పోగొట్టేస్తున్నాయి.” ఆ కోరికలని, ఆకర్షణలను జయించటమే ‘మధుసూదన’ అంటే!”
“శ్రీమన్నారాయణుడు ఈశ్వర నామంతో సర్వాన్ని శాసించేవాడు. ఆయనని మించిన విక్రముడు, శౌర్యవంతుడు మరొకడు ఉండడు. శ్రీమన్నారాయణుడు మూల రూపంలో ఆయన శంఖం, చక్రం, గద, ధనుస్సు పట్టుకుని ఉంటాడు. అలా ధనుస్సు పట్టుకున్నప్పుడు ఆయన విక్రముడు..అంటే ఆయనకంటే మించినవారు లేరు అని అర్థం. ఆయన తన మేధస్సుతోను, విక్రమం తోను, శౌర్యం తోనూ విశ్వాన్ని ఆక్రమించి శాసించేవాడు కనుకనే మనకి రక్షణ కలిగించి కాపాడుతాడు అని వేదం చెప్పింది” అని తాతయ్య ఆ పూట కి ముగించి వాలు కుర్చీలో నడుం వాల్చారు.
“పిల్లలూ..తాతయ్య అలిసిపోయారు. రేపు నేను ఇంకా కొన్ని శ్లోకాలు చెబుతాను. కానీ మీరు ప్రతి రోజు..ముందు రోజుల్లో నేర్చుకున్న శ్లోకాలు వల్లె వెయ్యాలి. మీ స్కూల్లో మిగిలిన పిల్లలకి ఈ కథలు చెప్పాలి. అప్పుడు మీకు బాగా గుర్తుండి పోతాయి. సరేనా! ఇంకా వెళ్లి ఆడుకోండి” అని బామ్మ పిల్లలని పంపించేసింది.

కామెంట్‌లు