“వినరో భాగ్యము విష్ణు కథలు”: (16): - #ఎం బిందుమాధవి

 అనుత్తమో దురాధర్ష: కృతజ్ఞ: కృతిరాత్మవాన్
సురేశ: శరణం శర్మ విశ్వరేతా: ప్రజాభవ:
అహస్సంవత్సరో వ్యాళ: ప్రత్యయ: సర్వదర్శన:
అజ: సర్వేశ్వర: సిద్ధ: సిద్ధి: సర్వాది రచ్యుత:

“పిల్లలూ..నిన్న మేధావీ విక్రమ క్రమ: అంటే విశేషమైన తన జ్ఞానంతో అన్ని చోట్లా వ్యాపించి ఉండేవాడు అని చెప్పుకున్నాం కదా! అన్ని చోట్లా అంటే సూర్య రశ్మి రూపంలో అన్నమాట. ఇక్కడ మనకీ ఎండ ఉంది. మీ అమ్మమ్మ గారి ఊళ్లోను ఉంది. మీ ఫ్రెండ్ వాళ్ల ఊళ్లోను ఉంది. అవునా, లేదా.. అలా అన్నమాట. పోనీ అలా ఉంది అంటే అలా నిలబడి పోవట్లేదు. సూర్యుడు, భూమి ఎప్పుడు కదులుతూనే ఉన్నాయి, ఉంటాయి అని మీకు తెలుసు కదా. అలా అవి కదులుతూ ఉండటం వల్లనే ఉదయం, సాయంత్రం, రాత్రి అనేవి ఒక దాని వెనక ఒకటి వస్తూనే ఉంటాయి. అదే “విక్రమ క్రమ:” అంటే. ఈ విశ్వం అంతా ఎప్పుడు కదులుతూ,వ్యాపిస్తు ఉంటాడు.”
“అందుకే ఆయన “అనుత్తముడు”. అంటే ఆయనతో సమానుడు కానీ, ఆయన కంటే గొప్పవాడు కానీ మరొకరు లేరు. అంతే కాదు, ఆయన కంటే ఉత్తముడు కూడా లేడు. మనకి ప్రస్తుతం ఉన్న ఈ విశ్వ వ్యవస్థ లో అనేక మంది సూర్యులు ఉన్నారు. కానీ ఆ శ్రీమన్నారాయణుడు నిర్దేశించిన ప్రకారం, మన ఈ జీవన చక్రం కొనసాగటానికి ఈ సూర్యుడే ఆధారం అన్నమాట. ఈ వెలుగు బాగాలేదు..వద్దు, అలాంటి ఎండ వద్దు అనే అవకాశం లేదు..అవునా. అదే అనుత్తముడు అంటే!”
“ఆయనతో పోటీ పడేవారు లేరు, ఆయనని ఎదిరించేవారు లేరు. ఉదాహరణకి..మీరు స్కూల్లో చదువుకున్నారు కదా..అలెగ్జాండర్ విశ్వ విజేత అని. అంటే అప్పటికి ఆయన ప్రపంచంలో చూడని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన ఏ దేశాన్ని దర్శిస్తే అక్కడ యుద్ధం చేసి గెలిచాడు కనుక ఆయనని విశ్వ విజేత అన్నారు. అలాంటి వ్యక్తిని మన దేశంలో ఒక రాజు ఎదిరించి పోరాడాడు. అప్పుడు కూడా అలెగ్జాండర్ గెలిచినా..అది మరొకరి దేశద్రోహ బుద్ధి వల్లనే. కాబట్టి సమానుడు, అధికుడు, ఎదిరించ శక్యము కానీ వాడు అని ఒక్క పరమాత్మకు మాత్రమే చెప్పగలము.”
“కానీ శ్రీమన్నారాయణుడు అలా ఒక దేశానికి, కాలానికి, ప్రదేశానికి పరిమితమైన వాడు కాదు. ఆయనని రాక్షసులు ఎదిరించి పోరాడారు. కానీ గెలవలేకపోయారు. మీకు తెలిసిన కథ మహిషాసురుడు, నరకాసురుడు, కంసుడు, భస్మాసురుడు..ఇలా అనేక మంది రాక్షసులు ఎదిరించి పోరాడినా విజయం సాధించలేకపోయారు. చివరిగా ఆయన చేత శిక్షించ బడ్డారు. అదే “దురాధర్ష:” అంటే!”
“కృతజ్ఞ: అంటే ఎవరి వల్లనైనా సహాయం పొందితే, వారి పట్ల వినయంతోను, స్నేహభావంతోనూ ఉండటం అని సాధారణంగా అనుకుంటాం. అవునా. ఉదాహరణకి మీకు మీ ఫ్రెండ్ ఒక పెన్సిలు, పుస్తకం, ఇచ్చారనుకుందాం. జ్వరం వచ్చి స్కూల్ కి వెళ్ళకపోతే ఆ రోజు చెప్పిన పాఠం మీకు చెప్పిన ఫ్రెండ్ తో కూడా ఎంతో కృతజ్ఞతా భావంతో ఉంటారు. అప్పుడు మీరు థాంక్స్ అంటారు. అదే తెలుగులో, సంస్కృతంలో “కృతజ్ఞ:” అంటే.”
“ఈ విషయాన్ని రామాయణంలో, శ్రీ రామచంద్రుడు అనేక సందర్భాల్లో ఆచరించి చూపించాడు. సీతను వెతకటంలో సహాయం చేసిన జటాయువు, సుగ్రీవుడు, హనుమంతుడు..వీళ్ళందరికీ తన కృతజ్ఞత చూపించాడు. సముద్రాన్ని దాట వలసివచ్చినప్పుడు..వారధి కట్టేటప్పుడు, ఒక చిన్న ఉడుత ఇసుకలో దొర్లి తన శరీరానికి అంటుకున్న ఇసుకని తెచ్చి ఆ పనికి సహాయం చేసిందని, ఆ చిన్న జీవి పట్ల కూడా ఎంతో ప్రేమ, కృతజ్ఞత ప్రదర్శించాడని మనం చదువుకున్నాం కదా! అలా ఆ దేవ దేవుడు తన పట్ల భక్తితో, ప్రేమతో ఉండే వారినీ ఎప్పుడు గమనిస్తూ, తెలుసుకుంటూ ఉంటాడు. వారిని కనిపెట్టుకుని ఉంటూ, వారి భక్తికి ప్రతిఫలాన్ని అందిస్తూ ఉంటాడు. ఆ ప్రతిఫలం అందించటం అంటేనే ఆయన చేసే “కృతి”!
“ఆత్మవాన్” అంటే..ఆయన మనకి ప్రతిఫలం అందించటంలో ఆయనకి స్వార్థం ఏమీ ఉండదు. ఇందాక చెప్పినట్టు..మనకి ఎవరైనా ఒక వస్తువు ఇస్తేనో, ఒక పని చేసి పెడితేనో మనం కృతజ్ఞతగా ఉంటాం. ఆమ్మో, నాన్నో మనకి బహుమతిగా ఇచ్చిన వస్తువుని మన ఫ్రెండ్ కి కృతజ్ఞత చూపించటానికి బహుమతిగా ఇస్తాం. కానీ ఆయనకి మనం చేసిపెట్టగల పని కానీ, ఇవ్వగల వస్తువు కానీ ఏమీ ఉండవు. ఎందుకంటే..ఈ విశ్వంలోని అన్నీ ఆయన సృష్టించినవే కదా! ఆయన ఇచ్చినవి ఆయనకి ఇవ్వటంలో ప్రత్యేకత ఏముంది. అందుకే ఆయన తను సృష్టించిన అన్నిటిలోనూ తానే ‘ఆత్మ’ అనే చైతన్యంతో ఉండి, ఏ స్వార్ధము లేకుండా, ఎవరి అనుమతి..సహాయము లేకుండా మన భక్తికి, మంచితనానికి, ధర్మ ప్రవర్తనకి ప్రతిఫలం ఇచ్చేస్తాడన్నమాట.”
“సురేశ శరణం శర్మ” అంటే..మంచి చేసేవారికి ప్రభువు అవుతాడు. అలాంటి వారికి ఆశ్రయం ఇస్తాడు. శరణం అంటే..మీరు అనుకునే అల్టీమేట్ స్థానం అన్నమాట. అలాంటి దానిలో రెండో వారి సహాయం కానీ, ప్రమేయం కానీ ఉండవు. అంతగా అక్కున చేర్చుకుంటాడు అని అర్థం. ‘శర్మ’ అంటే..అలా తన దగ్గరకి చేర్చుకుని అంతులేని ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వగల ఏకైక శక్తి ఆయనే!”
“విశ్వరేతా:” అంటే మళ్లీ ఇంతకు ముందు చెప్పుకున్నట్టే..ఈ సృష్టి మొత్తానికి మూలమైన బీజ రూపం ఆయనే. “ప్రజాభవ:” అంటే అలా సృష్టికి మూల కారణమై, జీవులని ఉత్పత్తి చేసి కాపాడి, పోషిస్తూ, రక్షిస్తూ ఉంటాడు.”
“అహ: సంవత్సరో వ్యాళ: ప్రత్యయ: సర్వ దర్శన:” అంటే..విశేషమైన తన చైతన్యం అనే వెలుగుతో అన్ని చోట్లా వ్యాపించి మన అజ్ఞానాన్ని (అజ్ఞానం అంటే చీకటి) పోగొట్టటమే కాకుండా కాల స్వరూపమే ఆయన అన్నమాట. వెలుతురు రాగానే చీకటి పోతుంది కదా! కాలం అంటే పగలు, రాత్రి, ఆరు ఋతువులు, పన్నెండు నెలలు..అలా అన్నిటిలోనూ ఉండి కాలాన్ని నడిపేవాడు ఆయన అన్నమాట.”
“కాలాన్ని పాముతో పోలుస్తారు. అంటే పాము జర జరా జారిపోతుంది..పట్టుకోవటం కష్టం. అలా కాలం కూడా వేగంగా కదులుతూ మనకి కష్ట సుఖాలను కలిగిస్తూ జారిపోతూ ఉంటుంది. ఋతువులు మారుతూ ఎండలతో నీటిని శోషించుకుంటూ, అదే నీటిని మళ్లీ వర్షంగా కురిపిస్తూ, ప్రకృతికి పువ్వులు, కాయలు రూపంలో అందాన్ని సమకూరుస్తూ, మనకి ఆహార రూపంలో పోషణని అందిస్తుంది. అలాంటి కాలరూపం ఆ దేవ దేవుడే అన్నమాట. అలా పగలు, రాత్రి అనేవి..ఋతువులనేవి ఒక దేశానికో, ఒక కాలానికో, ఒక రకమైన జీవాలకో మాత్రమే పరిమితమైనవి కావు. అన్ని చోట్లా ఉన్నాయి..ఉంటాయి. అలా ఉండి మనకి పోషణని ఇస్తూ, ఆనందాన్ని కలిగిస్తాయి. అదే “ప్రత్యయ సర్వ దర్శన:” అంటే!
“ అలా మనని ఎప్పుడు తన చైతన్యంతో కనిపెట్టుకుని ఉండే ఆ శ్రీమన్నారాయణుడికి పుట్టుక అనేది లేదు. నశించటం అనేది లేదు. తాను ఉన్న స్థితి నించి జారిపోయి పతనం అవటం అంటూ ఉండదు. సృష్టిలో అన్నిటినీ ముందుగా గ్రహించేవాడు..అంటే మనం ఒక పని చేస్తే అది స్వీకరించేవాడు ఆయనే! ఉదాహరణకి ఎవరైనా ఒక హోమం చేశారనుకోండి..అందులో మనం వేసే నెయ్యి, సమిధలు, ఇతర వస్తువులన్నీ అగ్ని రూపంలో తీసుకునేవాడు ఆయనే. అలా తీసుకుని మనకి ఆ హోమ ఫలాన్ని అందిస్తాడు. హోమ ఫలం అంటే ఆ ధూమం గాలిలో కలిసి మేఘంగా మారి వర్షం కురవచ్చు, నెయ్యి వేసిన ధూమం పరిసరాలలో ఉన్న విష క్రిమికీటకాలని నాశనం చేసి శుభ్రం చెయ్యచ్చు..అలా అన్నమాట.”
“అంటే మనం చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తాడన్నమాట. అలా భగవంతుడు ఇచ్చినట్టు, ప్రతి పనికి ప్రతిఫలాన్ని ఎవ్వరు ఇవ్వలేరు. కాబట్టి ఆయన్ని ఒక స్నేహితుడిగా భావిస్తే..మనకి జరిగేవన్నీ ..ఒక వేళ తాత్కాలికంగా కష్టం కలిగించేవి కూడా మంచివే అనే నమ్మకం కలుగుతుంది. మన ఆలోచనని మంచి దారిలో చెయ్యగలుగుతాము. ఎలా అంటే..అమ్మ మనకి జ్వరం వచ్చినప్పుడు చేదుగా ఉండే మందు ఇచ్చిందనుకుందాం. ఆ మందు లోపలికి వెళ్లి మంచి చేస్తుందా, లేదా? అలా చేదుగా ఉన్నా కూడా, మందు మంచిదే అన్నమాట. ఇంకా చెప్పాలంటే మనం ఊరు వెళ్ళటానికి టికెట్ కొనుక్కోవాలన్నప్పుడు దొరకలేదనుకోండి. ‘అబ్బా’ అని తిట్టుకోకుండా..ఆ ఊళ్లో ఏదో ప్రమాదం జరిగిందిట, మనకి టికెట్ దొరక్క వెళ్లకపోవటం మంచిదే అయింది అనుకుంటారే అలా మీకు తెలియకుండా ఆ టైం లో జరిగే ప్రమాదం నించి రక్షించాడన్నమాట. అలా.. ఎప్పుడు నమ్ముతూ భక్తితో భగవంతుడిని మనం అనుసరిస్తే మన కలిగే ఆలోచనని మంచి దారిలోకి తీసుకువెళతాడు. అర్థం అయిందా?”
“మిగిలినవి రేపు చెప్పుకుందాం. వెళ్లి రండి” అని బామ్మ పిల్లలని పంపించి పెరట్లో ఆరేసిన బట్టలు తెచ్చుకోవటానికి వెళ్ళింది.
కామెంట్‌లు