“వినరో భాగ్యము విష్ణు కథలు”: (18): - ఎం బిందుమాధవి.

 “బామ్మా ఈ సారి పరీక్షల్లో నేను క్లాస్ ఫాస్ట్ వచ్చాను” అని పవన్ ఉత్సాహంగా పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు.
“ బాగుంది నాన్నా. పవన్ కి మంచి మార్కులు వచ్చినందుకు వాడితో పాటు, మీకందరికీ ఇదిగో పటిక బెల్లం..తీసుకోండి. నేను చెప్పినట్టు క్రమశిక్షణతో కృషి చేస్తే ఫలితం మనం అనుకున్నట్టే ఉంటుంది. నువ్వు కష్టపడి చదివావు. చదివింది గుర్తుపెట్టుకుని పరీక్షల్లో రాశావు. అనుకున్న ఫలితం సాధించావు. అలా రావటానికి కారణం నువ్వు రాసిందానికి మీ టీచర్ మార్కులు ఇవ్వబట్టే కదా! మనం ఇవ్వాళ నేర్చుకునే శ్లోకం దీనికి సంబంధించినదే!”
“అమోఘ: పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతి:”
“ఆ శ్రీమన్నారాయణుడు తనని నమ్మి భక్తితో కొలిచి, ఆయన నామ స్మరణ చేసే వారి ప్రయత్నం వృధా కానీయడు. మీ టీచర్ లాగా! వారిని పోషిస్తూ కాపాడుతూ ఉంటాడు. ఈ మాట విష్ణు సహస్ర నామ శ్లోకాలలో పదే పదే వస్తూ ఉంటుంది. ఎందుకంటే..మనకి కోరికలు, ఆకర్షణలు ఎక్కువ. ఏదైనా పని చేద్దామనో, చదువుకుందామనో ప్రయత్నం మొదలు పెట్టగానే..ఏ ఫ్రెండ్స్తో వచ్చి ఎగ్జిబిషన్ కి వెళదామనో, సినిమాకి వెళదామనో రమ్మని పిలిచి మన పని పాడు చేస్తారు. అలా నిలకడ లేకుండా ఎటు పడితే అటు వెళ్ళిపోవటాన్ని ఆకర్షణ, మొహం అంటారు. “అమోఘ” అంటే ఆకర్షణ, మోహం అనే వాటికి లొంగటం మంచిది కాదు అని మన వైపు నించి అర్థం చెప్పొచ్చు. దేవుడి వైపు నించి చెప్పాలంటే..ఏ పని చేసినా తనని స్మరిస్తూ, భక్తిగా ఉండే వారి ప్రయత్నాలు వృధా కానివ్వని వాడు అని అర్థం.”
“అలా వృధా కానివ్వకుండా మన మీద తన దయ, కరుణ వర్షిస్తూ ఉంటాడు. భగవంతుడు తన దయ ఎలా చూపిస్తాడో ఇంతకు ముందు చెప్పాను కదా! మీకు గుర్తు ఉందా? నువ్వు చెప్పరా విష్ణు” అంది బామ్మ.
“స్వామి సూర్యుడి రూపంలో తన తీక్షణమైన కిరణాల (క్రోధ: అన్న పదం దగ్గర చెప్పావు బామ్మా) ద్వారా నదుల్లో నీటిని గ్రహించి, తనలో మేఘాల రూపంగా ఉంచుకుని ఎక్కడ అవసరమో అక్కడ వాన కురిపించి పంటలు పండించి జీవులకు అవసరమైన ఆహారాన్ని అందిస్తాడు. తాగటానికి నీళ్లు ఇస్తాడు. కరెక్టేనా బామ్మా” అన్నాడు విష్ణు.
“ఆ:( భేష్..బాగానే గుర్తు పెట్టుకున్నావు. సరే..ఒక జీవి, ఏ విషయాన్ని అయినా ముందుగా ఎలా తెలుసుకుంటాడు? తన చూపు ద్వారా..అవునా? అంటే కన్ను అనేది చాలా ముఖ్యమైన ఇంద్రియం. కన్ను ఒక వస్తువుని చూసి మిగిలిన అవయవాలకి చెబితేనే..కాళ్లతో అక్కడికి వెళ్లి, చేత్తో ముట్టుకుని చూస్తాం. అవునా? అలా స్వామి విషయంలో “పుండరీకాక్షుడు” అనే మాటకి అర్థం..ముందుగా “పుండరీకం” అంటే ‘పద్మం’ అన్నమాట. ‘అక్షం’ అంటే కన్ను. పద్మం వికసిస్తుంది..అంటే విచ్చుకుంటుంది. అవునా..విచ్చుకోవటం అంటే బాగా తెరుచుకుంటుంది. సూర్య మండలం లో ఉండే శ్రీమన్నారాయణ మూర్తి స్వరూపమైన ఆ దేవ దేవుడి కన్ను పద్మం లాగా పూర్తిగా విచ్చుకుని నీటిని గ్రహించి, వర్షం ద్వారా తన అనుగ్రహాన్ని కురిపిస్తాడన్నమాట.”
“ వృషకర్మా వృషా కృతి:” అంటే..ఆ స్వామి తాను స్వయంగా ధర్మ స్వరూపుడు. ధర్మంలో స్థిరంగా ఉంటాడు. ధర్మంగా బతికే వారందరినీ..ఏ విధమైన భేద భావం, పక్షపాతం లేకుండా సమానంగా, ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు అని చెప్పుకున్నాం కదా! వారు చేసే మంచి పనులకి (కర్మలకి) తగిన ఫలితాలని ఎప్పుడు ఇస్తూ కాపాడటానికే రావణుడు, కంసుడు, నరకాసురుడు, లాంటి రాక్షసులు లోకానికి బాధ, దుఃఖం, కష్టం కలిగిస్తున్నప్పుడు రాముడు, కృష్ణుడు లాగా అవతారం స్వీకరించి ఈ భూమి మీదికి వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశాడు. మీరు టీవీలో ఆ సినిమాలు చూసారు కదా!” అంది బామ్మ.
“అవును బామ్మా..ఆ సినిమాలు భలే బావుంటాయి. మాకు రేపు పరీక్ష ఉంది బామ్మా. మళ్లీ రేపు ఇంకొన్ని శ్లోకాలు చెప్పుకుందాం” అని పిల్లలందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్లిపోయారు.

కామెంట్‌లు