“వినరో భాగ్యము విష్ణు కథలు”: (19):- ఎం బిందుమాధవి

 ఆ రోజు ఆదివారం. పిల్లలు బామ్మతో కథలు చెప్పించుకోవటానికి సాయంత్రం నాలుగు గంటలకే వచ్చేశారు. బామ్మ రోజు లాగా ముందు వైపు వసారాలో కనిపించలేదు. ‘ఎక్కడికెళ్ళిందబ్బా’ అనుకుంటూ పెరట్లోకి వెళ్లారు. బామ్మ ఒక పలుగు పట్టుకుని నేల అంతా తవ్వుతూ..గడ్డి, కలుపు ఏరేస్తోంది. పిల్లలని చూసి “రండర్రా పిల్లలు..మీ కోసమే ఎదురు చూస్తున్నాను. వానా కాలం వచ్చింది. నేల మెత్తబడింది. కలుపు కూడా బాగా పెరిగింది. మీరు కూడా సాయం చేస్తే..ఈ కలుపు అంతా పీకేసి కొత్తగా బీర, సొర, కాకర,వంగ విత్తనాలు వేద్దాం. అలాగే కొన్ని ఆకు కూరలు, పువ్వుల మొక్కలు కూడా వేద్దాం. ఇంచక్కా మన పెరట్లోనే తాజా కూరలు పండించుకోవచ్చు. మన పెరట్లో పువ్వులతోనే ఆ స్వామికి పూజ చేసుకోవచ్చు.” అన్నది.
“బామ్మా అయితే ఇవ్వాళ శ్లోకాల కథలు చెప్పవా” అని పిల్లలంతా ముక్త కంఠంతో అడిగారు.
“ఎందుకు చెప్పను? మనం పని చేసుకుంటూ కథ చెప్పుకుంటే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. స్కూల్లో మీ చేత సైన్స్ ప్రాక్టికల్ చేయిస్తారా..ఇది కూడా అలాగే” అంది బామ్మ.
ఇక పిల్లల హుషారు కి పట్టా పగ్గాల్లేవు. ఒకరు గడ్డి పీకేస్తుంటే, ఒకరు పిచ్చి మొక్కలన్నీ ఏరి పారేశారు. ఇంకో ఇద్దరు పిల్లలు, మట్టిలో ఛాళ్లు చేసి విత్తనాలు పెట్టారు.
“రుద్రో బహుశిరా బభ్రు: విశ్వయోని శ్శుచి శ్రవా:” అంటే ఇందాకటి నించి మనం చేస్తున్న తంతు ఉందే ..అదే నర్రా అంది బామ్మ. కలుపు ఏరేసేటప్పుడు, లోతుగా వేర్లు ఉన్న మొక్కని పనిముట్లు ఉపయోగించి మనం బలంగా లాగేస్తాం. అప్పుడు ఆ మొక్క ఏడుస్తుంది. లోకానికి కష్టం కలిగిస్తున్న వారిని సంహరించేటప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు రుద్రుడిగా మారతాడు. అలా సంహరించేటప్పుడు ఆ దేవ దేవుడు వారి పరివారానికి దుఃఖం కలిగిస్తాడు. ఎవరింట్లో అయినా వారి కుటుంబ సభ్యులు చనిపోతే వారు ఏడవటం మీరు చూసారా? అలా అన్నమాట. వారి వల్ల కష్టం కలిగిన వారి దుఃఖం పోగొడతాడు. అంటే ఆయన ఒకే సమయంలో ఒకరికి దుఃఖం పోగొడతాడు, ఇంకొకరికి దుఃఖం కలిగిస్తాడు. అదే ‘రుద్ర’ అంటే! ఇప్పుడు మనం చేసిన కలుపు ఏరెయ్యటం అనే పనే ఆ శ్రీమన్నారాయణుడు ప్రళయకాలంలో చేస్తాడు.”
“మళ్లీ సృష్టి చేసేటప్పుడు బహుముఖాలతో విశ్వాన్ని సృజిస్తాడు. ఇప్పుడు బోలెడు మొక్కలు రక రకాల విత్తనాలు నాటటం ద్వారా చేశామా అలా అన్నమాట. అదే మళ్లీ సృష్టించటం అంటే! అలా ‘ప్రళయం’, ‘విశ్వ సృష్టి’ ఒక చక్రం లాగా జరుగుతూ ఉంటాయి.”
”బబ్రు” అంటే ఎద్దు..అంటే వృషభం. వృషభం ధర్మానికి ప్రతీక. ఆయన అలా విశ్వాన్ని సృష్టించేటప్పుడు.. ధర్మాన్ని తన వాహనంగా చేసుకుంటాడు. ధర్మం తప్పకుండా మళ్లీ మళ్లీ ఈ పని ఆయన చేస్తూ ఉంటాడు. “విశ్వయోని:” అంటే..అనేక రకాలుగా కనిపిస్తున్న జీవులని సృష్టిస్తాడు. మనుషులు, జంతువులు, పశువులు, పక్షులు, చెట్లు..ఇలా రక రకాలు. మళ్లీ వాటిలో ఆడ, మగ..అని విడి విడిగా కనిపించినా అందరూ మనుషులే! అలాగే జంతువులు వేరు వేరుగా కనిపించినా అన్నిటినీ కలిపి జంతువులు అంటాం..అవునా? అలా విడి విడిగా ఉంటూనే కలిసి ఉండే సృష్టిని “విశ్వయోని:” అంటారు. అలా సృష్టించిన విశ్వంలో చైతన్యం తనే అయి, విశ్వాన్ని భరిస్తూ ఉంటాడు అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా!”
“శుచిశ్శ్రవా:” అంటే..మనకి కష్టం వచ్చినప్పుడు తొలగించి, మనకి సంతోషం కలిగించే ఆయనకి ఉన్న విశేష గుణాలకి ఉన్న నామాలు వినటానికి, నోటితో పలకటానికి పవిత్రమైనవి.
“అమృత: శాశ్వత: స్థాను: వరారోహో మహాతపా:” అంటే..ఆయనకి మరణం లేదు, నాశనం లేదు. ఆయన స్థాణువు..అంటే చలనం లేనివాడు, శాశ్వతుడు..ఎప్పటికీ ఉంటాడు. ఆయన చేసిన సృష్టి మాత్రం వస్తూ..ప్రళయకాలంలో పోతూ ఉంటుంది. ఆయన సృష్టికి మూలమైన బీజ రూపంగా శాశ్వతంగా ఉంటాడు అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! అదే!”
“అలాంటి ఆయన గురించి నిరంతరం భక్తితో కొలుస్తూ, ఆయన నామాన్ని జపిస్తూ, ఎవరికీ కష్టం కలిగించకుండా ధర్మంగా బతుకుతూ, తపస్సు చేసే వాళ్ళకి ఆయన తన ఒడిలో చోటు ఇచ్చి, మళ్లీ పుట్టే అవసరం లేకుండా మోక్షం ఇస్తాడు. అదే “వరారోహో మహా తపా:” అంటే! అర్థమైందా” అన్నది బామ్మ.
“బామ్మా ఇవ్వాళ చాలా బాగుంది. తోటపని మాకు బాగా నచ్చింది” అని పిల్లలు బురద అంటించుకున్న చేతులు శుభ్రంగా కడుక్కుని, బామ్మ ఇచ్చిన అరటి పండ్లు అందరూ తల ఒకటి తీసుకుని గంతులేసుకుంటూ ఇళ్ళకి వెళ్లారు.

కామెంట్‌లు