“పిల్లలూ..మొన్న మనం వేసిన విత్తనాలు మొలకెత్తాయి, చూశారా” అంది బామ్మ మొలకలని చూపించి.
“అవును బామ్మా..కానీ అన్ని ఒకేలా ఉన్నాయి. మొలకలప్పుడు మనకి తెలియదు కదా, అది ఏం మొక్కో” అన్నాడు మురళి.
“అవును. కానీ దేవుడు ‘పునర్వసు’ అన్నమాట. అంటే రూపం, దేహం మారినా తాను మారకుండా అన్నిటిలోనూ ఒకే విధంగా ఉండే వాడు అన్నమాట. అది సొర గింజ అయినా, బీర గింజ అయినా అందులో ఆ దేవ దేవుడు చైతన్య రూపంలో ఉంటేనే అది మొలక వచ్చి పెరుగుతుంది. మొన్న మనం పది రకాల ప్రాణాల గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా..ఏ విత్తనం నాటితే ఆ మొక్కే వస్తుంది, ఆ కాయే కాస్తుంది..అలాగే ఏ జంతువు అయితే అలాంటి జంతువుకే జన్మనిస్తుంది..మనిషికి మనిషే పుడతాడు అని.”
“మనం ఏ పైరు ఎన్ని సార్లు వేసినా మళ్లీ మళ్లీ అవి కాసి, పూసి మనకి ఆహార సంపదని ఇస్తూనే ఉంటుంది. అలాగే భూమి కూడా..ఒక సారి మొలకని ఇచ్చాను కదా అని, మళ్లీ విత్తనం వేసినప్పుడు మొలకని ఇవ్వకుండా ఉండదు. నీరుని, ఖనిజాలని, లవణాలను ఒకసారి ఇచ్చాను అని ఊరుకోదు. ఒక సంవత్సరం మామిడి చెట్టు కాయలు కాశాను కదా అని మరు సంవత్సరం కాయడం మానదు. ఆ పద్ధతి అన్ని మొక్కలకి, జంతువులకి, పక్షులకి, మనుషులకి వర్తిస్తుంది. అదే “పునర్వసు:” అంటే!
“నిన్న తాతయ్య చెప్పినట్టు దేవేంద్రుడికి శ్రీమహావిష్ణువు తమ్ముడి వరసే అయినా సందర్భం వచ్చినప్పుడు తనకంటే పెద్దవాడైన ఇంద్రుడిని ఎలా శిక్షించాడో తెలిసింది కదా! అలా “అతీంద్రుడు” అయ్యాడు. “అమోఘ” అంటే మోహము లేనివాడు అని ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఆ పదానికి వ్యర్థము కానిది అని కూడా అర్థం. అంటే బలి చక్రవర్తిని శిక్షించేసందర్భంలో..పుట్టినప్పుడు పసివాడిగా ఉండి, పెరిగి పెద్దవాడు అవటం అనే కాలయాపన లేకుండా..పుట్టగానే వటువు వయసులో వామనుడిగా వచ్చి తను వచ్చిన కార్యాన్ని సంపూర్ణంగా నిర్వహించాడు. ఆ సమయంలో బలి చక్రవర్తి ఇచ్చే దానం స్వీకరించడంలో లోకమంతా వ్యాపించడంలో చాలా పొడగరి అన్నమాట.”
“అంతే కాదు..అంత పొడుగైనవాడు మన బుల్లి హృదయంలో చైతన్య రూపంగా ఇమిడిపోగలడు. ఒకే సమయంలో ఆయన వామనుడుగాను ఉండగలడు..విశ్వ వ్యాపకుడిగా చాలా పొడగరిగా ఉండగలడు. పొడగరిగా ఉన్నంత మాత్రాన, ఆయన బలహీనుడు కాదు. అత్యంత బలవంతుడిగా ఉంటూ విశ్వాన్ని తన బలంతో నియమిస్తూ ఉంటాడు. అందుకే ఆయన్ని “ఊర్జిత:” అంటారు. అలా బలంగా పరిరక్షణ చేస్తున్నా ఆయన పవిత్రమైనవాడు.
“ఇంద్రుడిని అతిక్రమించినా, బలిచక్రవర్తిని శిక్షించినా..ఆయన తన కార్యాన్ని ఏ వెలితి లేకుండా సంపూర్ణంగా నిర్వహిస్తూ, పట్టి నడుపుతాడు కనుకనే ఆయన్ని “ధృతాత్మా” అంటాం. “ధృతి” అంటే ఏ విధంగానూ సడలకుండా బలంగా పట్టి నడుపుతాడు. దీనికి ఉదాహరణగా..మీ ఇంట్లో టిఫిన్ క్యారేజీ చూసారా? మూడు నాలుగు గిన్నెలని రెండు పక్కలా పొడుగాటి సాధనం పట్టుకుని పడిపోకుండా నిలబెడుతుంది. దానికి క్లిప్ లాంటి ఒక లాక్ కూడా ఉంటుంది. అలాగే మన శరీరంలో అన్ని జాయింట్లకు, అవి పట్టి ఉంచి క్రమపద్ధతిలో కదలటానికి “లిగమెంట్” అనే ఒక సాధనం ఉంటుంది. ఆటలాడే వారికి అవి అప్పుడప్పుడు తెగినట్టు అయి, కాలు కదలలేని పరిస్థితి వస్తుంది. అలాగే కృష్ణుడి సినిమాల్లో చూసారు కదా..రెండు, మూడు కుండలని, మూడు తాళ్లతో బలంగా కట్టిన ‘ఉట్టి’ అనే సాధనం లో పడిపోకుండా ఉంచుతారు. అలా ఈ సృష్టిలో పంచ భూతాలకి, సకల జీవ రాశికి నియమాలని ఒక క్రమ పద్ధతిలో ఏర్పరిచి, నిగ్రహించి, అవి అతిక్రమించిన వారిని శిక్షిస్తూ “యమ” రూపంగా ప్రకాశిస్తాడు. “యమ” అంటే నిగ్రహించేవాడు..మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఫ్రిజ్ లకి ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు కాలిపోకుండా మనం రెగ్యులేటర్ అని పెడతాం కదా..అదన్నమాట” అన్నది బామ్మ.
“ఇప్పుడు బాగా తెలిసింది బామ్మా” అన్నది వీణ.
“ఆ దేవ దేవుడు తనకి అన్నీ తెలిసి, మనకి వేదాలతో మాత్రమే తెలుసుకోగలిగిన వాడు కాబట్టి “వేద్యో” అంటారు. తనకి అన్నీ తెలుసు కాబట్టి “వైద్యుడు”.
“ఈ రోజుకి చాలా? నేర్చుకున్నంత వరకు మళ్లీ మళ్లీ శ్లోకాలు అర్థవంతంగా గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇంకా చాలా నేర్చుకోవాలి. కొత్తవి నేర్చుకుని, పాతవి మర్చిపోతే మన ప్రయత్నం అంటా వృధా అవుతుంది” అని చెప్పి బామ్మ తన పనిలోకి వెళ్ళిపోయింది.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి