“బామ్మా ఎక్కడున్నావ్” అంటూ పిల్లలు లోపలికి వచ్చేసరికి బామ్మ నడుముకి అయోడెక్స్ రాసుకుంటూ కనిపించింది.
”రండి రండి..ఆ చాప ఇలా వేసుకుని కూర్చోండి” అన్నది.
“ఏమైంది బామ్మా” అన్నారు పిల్లలు కంగారుగా.
“ఆ:( ఏమీ లేదు. మధ్యాహ్నం పడుకుని లేచేటప్పుడు కొంచెంగా నడుం పట్టేసింది. మీతో మాట్లాడుతూ ఉంటే..ఇట్టే నయమవుతుందిలే” అంది బామ్మ తేలికగా తీసేస్తూ!
“వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధు:”
“నిన్న మనం ఈ శ్లోకంలో మొదటి పదం “వేద్యో” తెలుసుకున్నాం. “వైద్య:” ఇప్పుడు నాకు వచ్చిన నడుం నొప్పికి ఆయనే వైద్యుడు. ఆయనకి అన్ని విద్యలు తెలుసు. మనం ఆరోగ్యం బాగా లేకపోతే ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరకి వెళతాం. అవునా? ఆయన మనం వెళ్ళగానే ముందుగా మనతో మాట్లాడుతూ మన రోగ లక్షణాలని, ఇప్పటి నించి అలా ఉన్నామో తెలుసుకుంటాడు. తరువాత స్టెతస్కోప్ తో మనని పరీక్షిస్తాడు. నాడి పట్టుకు చూసి మన గుండె కొట్టుకునే వేగం గురించి తెలుసుకుంటాడు. అవునా మానసా? నువ్వు మెడిసిన్ చదువుతున్నావ్ కదా! ఇలా ప్రాథమికమైన పరీక్షలు అన్నీ చేసి..మనకి వచ్చింది చిన్న సమస్యా, లేక పెద్దదా అని ఒక నిర్ధారణకు వచ్చి అవసరమైతే కొన్ని పరీక్షలు చేయించుకు రమ్మని కాయితం రాసి ఇస్తాడు. అవునా? అంటే ఒక రోగికి వైద్యం చెయ్యటం ప్రారంభించాలంటే..డాక్టరు ప్రాథమికంగా.. అన్ని కోణాల్లో ప్రశ్నించీ, కొన్ని పరీక్షలు చేయించీ తెలుసుకుని, ఆ లక్షణాలనిబట్టి ఏ రకమైన వైద్యం చేస్తే వారికి వచ్చిన అనారోగ్యం తగ్గుతుందో తెలుసుకుంటాడు. అలాగే ఆ శ్రీమన్నారాయణుడుకి అన్ని విద్యలు తెలుసు. అలా ఆయనకి తెలియకపోతే మనలో ఒకరు డాక్టరు, ఒకరు పంటలు పండించే రైతు, మరొకరు ఇంజనీరు, ఇంకొకరు కళాకారుడు, శిల్పి..చిత్రకారుడు, మరొకరు విద్యావేత్త ఎలా అవుతున్నారు. అలా వారిలో ఉన్న ఒక్కొక్క ప్రత్యేక ప్రతిభ రూపంలో ఉన్నది ఆయనే అని మనం “విశ్వం” అనే పదం నేర్చుకున్నప్పుడు తెలుసుకున్నాం కదా! అదే “వైద్య:” అంటే!”
“అలా అన్నీ తెలిసినా తన స్వ స్వరూపంతోనే ఉంటాడు. అంటే..రైతు అయినా, డాక్టర్ అయినా, కళాకారుడు అయినా మనిషి రూపమేనా కాదా? ఆ వృత్తి చేసేటప్పుడు మాత్రమే ఆ పేరుతో పిలుస్తాం. మిగిలినప్పుడు మాత్రం మనిషే కదా..అలా శ్రీమన్నారాణుడు తన స్వరూపమైన చైతన్యంగానే భాశిస్తాడు. అంతే కాదు..భౌతికమైన విషయాలనించి దూరంగా ఉండి ధ్యానంలో గడిపే యోగుల హృదయాల్లో ఆయన ఎప్పుడు కొలువై ఉంటాడన్నమాట.”
“అలా ఆయననే ధ్యానించే వారికి మంచి జరగాలంటే..వారికి హాని చేసే వారిని ఎప్పటికప్పుడు శిక్షించాలి కదా! అలా వారిని శిక్షిస్తూ..ధర్మాన్ని కాపాడే ప్రక్రియలో ఆయన “వీర:” వీరుడిగా ఉంటాడు. “మాధవో మధు:” ఇంతకు ముందు శ్లోకాలలో మనం చెప్పుకున్నాం గుర్తుందా? మాధవుడు అంటే ఏకాగ్రత, యోగం, ధ్యానం చేత మాత్రమే తెలుసుకోగలిగినవాడు..అని.”
“మంచి వారు ఎవరైనా సరే వారిని కాపాడటం, వారికి ఇబ్బంది కలిగించే దుష్టులను శిక్షించడం, నియమ బద్దంగా ధర్మాన్ని కాపాడటం అనే పని చెయ్యటంలో ఆయనకి పక్షపాతం లాంటి ఏ మనో వికారాలు ఉండవు. మంచివారికి తేనె (మధువు) లాగా మధురమైనవాడు , తియ్యనైనవాడు.
“అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబల:” ‘అతీంద్రియో’ ఆయన మన ఇంద్రియాలకి దొరకడు. అంటే ఆయనని కంటితో చూడలేము, మనసుతో ఊహించలేము, స్పర్శతో తెలుసుకోలేము, శబ్ద రూపంగా చెవులతో ఆయన స్వరూపాన్ని తెలుసుకోలేము అన్నమాట. మన చుట్టూ ఉన్న ప్రకృతిని మాయ అంటారు. ఎలా అంటే..నిన్న గింజగా ఉన్నది, ఇవ్వాళ మొక్కగా మారుతుంది. నిన్న వికసించి పువ్వులాగా అందంగా కనిపించింది ఇవ్వాళ వాడిపోయి ఎండిపోయి ఉంటుంది. మూడు రోజుల క్రితం పచ్చి కాయగా ఉన్నది ఈ రోజు పండుగా మారుతుంది. పది రోజుల క్రితం పొట్టిగా ఉన్నవాడు, పొడుగు అవుతాడు. నెల క్రితం నల్లగా ఉన్న జుట్టులో, ఈ రోజు కొన్ని తెల్ల వెంట్రుకలు కనిపిస్తాయి. ఇదంతా ఒక మ్యాజిక్ లాగా కనిపిస్తుంది కదా! అలా మాయా రూపమైన ప్రకృతికి కూడా మాయ కలిగించేవాడు ఆ శ్రీమన్నారాయణుడు.”
“అలా సృష్టిని నియమబద్ధంగా నడపటంలో, ధర్మాన్ని కాపాడటంలో ఆయన కంటే ఉత్సాహవంతుడు, బలవంతుడు, వీరుడు మరొకరు లేరు. నాలుగు రోజుల క్రితం నేలని ముందుగా తడిపి, తరువాత తవ్వి, కలుపు మొక్కలు ఏరేసి, గింజలు నాటినప్పుడు మీరంతా నేనంటే నేను అని ఎలా హుషారుగా పని చేశారు..అదే “మహోత్సాహో” అన్నమాట. అలా ఎప్పుడు చేస్తూ ఉండటంలో ఆయనకి అలసట, నిరుత్సాహం ఉండవు. మనం కొంత పని చేశాక నిరుత్సాహ పడిపోతాం. అవునా? ఆ శ్రీమన్నారాయణుడికి అలా ఎప్పుడు ఉండదు కనుకనే..మళ్లీ మళ్లీ వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి..మనుషులు, జంతువులు, పశువులు..పక్షులు మళ్లీ మళ్లీ పుడుతూ ఉంటాయి. మనుషుల్లో జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది..కొత్త కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. తెలిసిందా?” అన్నది బామ్మ.
“ఆ దేవ దేవుడి గురించి మీతో మాట్లాడుతూ ఉంటే నా నడుము నొప్పి తగ్గిపోయిందర్రా. అలా ఇతర విషయాలన్నీ వదిలేసి..ఆయన గురించి ఆలోచిస్తూ, మాట్లాడుతూ ఉంటే మనకి ఉన్న అసౌకర్యాలన్నీ ఇట్టే మాయమైపోతాయి. మీరు కూడా ఇతర విషయాలన్నీ వదిలేసి మీ చదువుల మీద ఏకాగ్రత చూపిస్తూ, కష్టంలో ఉన్నవారికి సహాయం చేస్తూ ఉంటే ఆ దేవ దేవుడు మీ బుద్ధిని ఇంకా చురుకుగా ఉంచుతాడు. సరే వెళ్ళండి. పెరట్లో మొక్కలకి కొన్ని నీళ్లు పోసి, వసారాలో పనమ్మాయి తోమి ఉంచిన పాత్రలని లోపల పెట్టి వెళ్ళండి” అన్నది బామ్మ.
“అలాగే బామ్మా. నీకు రాత్రి వంటకి కూరలు తరిగి పెట్టమంటే తరుగుతాను. నడుము నొప్పిగా ఉంది కదా..నీకు కొంచెం సహాయం చేస్తాను” అన్నది పావని.
“నా తల్లే ..అలాగే” అని రెండు బీరకాయలు తరగమని పావని చేతికి ఇచ్చింది బామ్మ.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి