అంశము: -శ్రీ మద్భగవద్గీతా మహాత్మ్యము-
"శ్లోకము
య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి!
భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్యసంశయః!
"ఒక హెచ్చరిక--:"
---------------------------
(తప స్సంపన్నుడు కాని వానికిని, భక్తి రహితునకును, వినవలెనని కుతూహలము లేని వానికిని నీవు ఈ గీతారూప రహస్యో పదేశమును ఎన్నడనూ తెలుపరాదు. అట్లే నాయందు దోష దృష్టి గలవానికి ఎన్నడునూ ఈ ఉపదేశమును తెలుపరాదు.)
నాయందు పరమ భక్తిని కలిగి, ఈ పరమ గోప్యమైన గీతోపదేశమును అనగా గీతా శాస్త్రమును ఆ భక్తుల హృదయములలో పదిలపరచువాడు(అభిదాస్యతి--నిష్కామ భావముతో ప్రేమ పూర్వకముగా ఆ భక్తులకు చదివి వినిపించును. మరియు దీని అర్థము వ్యాఖ్యానముల ద్వారా విచారము చేయును), నన్నే పొందును. ఇందే మాత్ర ము సంశయము లేదు. నాకు ప్రీతిని గూర్చునట్టి కర్మల నాచరించు మనుషులలో అతనిని మించిన భక్తుడెవ్వడునులేడు. అంతేగాక అతనివలెగాని, అతనిని మించి గాని నాకు ప్రియమైన వాడు భూమండలమున మరియొకడెవడును భవిష్యత్తులోను ఉండబోడు.
ధర్మయుక్తమైన మన సంవాద రూపమైన ఈ గీతా శాస్త్రమును పఠించువాడు, జ్ఞాన యజ్ఞం ద్వారా నన్ను పూజింపువాడని నా అభిప్రాయము.
శ్రద్ధాదరములు కలవాడును, దోషదృష్టి (దోషములెన్ను స్వభావము) లేనివాడును ఐన మనుష్యుడు గీతా శాస్త్రమును వినుట వలన పాపవిముక్తుడై, పుణ్య కర్మలను ఆచరించు వారు పొందు ఉత్తమ లోకములను పొందును.
ఓపార్థా!
ఈ గీత శాస్త్రమును నీవు ఏకాగ్రచిత్తంతో వింటివా?
ఓ ధనంజయా!
అజ్ఞానజనితమైన నీ మోహం పూర్తిగా నశించినదా? అని శ్రీకృష్ణ పరమాత్మ అడుగగా
అర్జునుడుఈ విధంగా పలికెను
ఓ అచ్యుతా!
నీ కృపచేనామోహము పూర్తిగా తొలగినది. స్మృతిని పొందితిని. ఇప్పుడు సంశయ రహితుడనైతిని. కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను.
సంజయుడు పలికెను--ఈ విధముగా శ్రీ వాసుదేవునకు మహాత్ముడైన అర్జునునకు మధ్య జరిగిన సంవాదములు వింటిని. అవి అద్భుతమైనవి. తనువును పులకింపజేసినవి.
వేదవ్యాసుని కృప వలన దివ్య దృష్టిని పొందిన వాడనై పరమ గోఖ్యమైన ఈ యోగమును ( గీతను) యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ( స్వయముగా) అర్జునుకు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటిని.
ఓ రాజా ! ధృతరాష్ట్రా!
శ్రీకృష్ణ భగవానునకు అర్జునునకును మధ్య జరిగిన గోప్యమైన సంవాదము పుణ్యప్రదమైనది. అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదేపదే స్మరించుచు నేను నిరంతరము ఆనందమున ఓలలాడుచున్నాను.
ఓ రాజా! అత్యంత విలక్షణం, పరమాద్భుతము అపూర్వము అయిన ఆ శ్రీహరి (తనను స్మరించిన వారి పాపములను హరించువాడు హరి)రూపమును పదేపదే స్మరించుచు నేను పొందుచున్న సంభ్ర మాశ్చర్యములకు అవధియే లేదు.తత్ప్ర భావమున మరల మరలా పలుమార్లు హర్షోల్లాసములతో
పులకిత గాత్రుడనగుచున్నాను.
ఓ రాజా! యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు గాండీవధనుర్ధారియైన అర్జునుడును ఉండే చోట సంపదలు, సర్వవిజయములు, సకలైశ్వర్యములు, సుస్థిరమైన నీతియు ఉండును అని నా నిశ్చితాభిప్రాయము.
శ్లోకము
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః!*తత్ర శ్రీ ర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ!
ధృతరాష్ట్రుడు సంజయునికి వేసిన ప్రశ్న--: "ఓ సంజయా! యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులు, పాండు పుత్రులు ఏమి చేసిరి?"తో ప్రారంభమైన భగవద్గీత సంజయుని నిశ్చితాభిప్రాయముతో పూర్తి అయినది.
భగవద్గీత సందేశం
కర్తవ్యనిర్వహణలో ఫలా పేక్ష లేకుండా నిష్కామ కర్మ చేయడం, భగవంతుని శరణాగతి పొందడం, ఆత్మ తత్త్వాన్ని, జీవన గమ్యాన్ని అర్థం చేసుకోవడం, మనిషి తన మనస్సును నియంత్రించుకోవడం, తనని తాను రక్షించుకోవాలి. జీవితం యొక్క నిజమైన ప్రయోజనం ఆనందాన్ని పొందడమే. దానికి భగవంతుని తత్త్వం, జీవన గమ్యం తెలుసుకోవాలి. మనిషి తన బుద్ధిని ఉపయోగించి మనస్సును తన ఆధీనంలో ఉంచుకోవాలి. బుద్ధి మిత్రుడైనప్పుడు, మనస్సు శత్రువు కాకుండా రక్షిస్తుంది. కావున తనవిధులను ప్రశాంత మనస్కుడై నిర్వహించడమే ముఖ్యమని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు.
భగవద్గీత వేదాల సారాన్ని, హిందూ ధర్మ మూలము లను, తెలియజేసే మహాద్గ్రంథం. గీతా సందేశం వేద సందేశం-"ఆనందంగా ఉండడం పరోపకారం జీవన ప్రయోజనం. మనిషిగా మన ధర్మం పాటించాలి.
శ్లోకము
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః!
పార్ధో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతా మృతం మహత్
శ్రీకృష్ణుడనే గోపాలుడు ఉపనిషత్తులనే గోవుల నుండి అర్జునుడనే దూడను నిమిత్తంగా చేసి గీతామృతాన్ని పితికాడు.
మనమందరము ఈ గీతామృతాన్ని పానం చేసి తరించుదాము.
శ్రీ మద్భగవద్గీత
అధ్యాయము18లోని
67నుండి78వ శ్లోకముల భావము వ్రాయబడినది.
--------------------------------
శ్రీమద్భగవద్గీత నక్షత్రమాలికా(,,27) వ్యాసములు
సర్వం శ్రీకృష్ణా ర్పణమస్తు
--------------------------------
శ్రీమద్భగవద్గీత వ్యాసములు 27: - పి.విఎల్.సుబ్బారావు-విజయనగరం-9441058797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి