శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 49
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
28.మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా (షోడశాక్షరీ)
29.అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ (షోడశాక్షరీ)
ఇరవైతొమ్మిదవ నామ మంత్రము - 
  ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః
అనాకలిత సాదృశ్య = వర్ణింప శక్యము కానిది / పోల్చడానికి ఉపమానం లేనిది
చుబుకశ్రీ = అందమైన / వెలుగులు కురిపిస్తున్న గడ్డము
జగన్మాత అయిన పరమేశ్వరిని చేరిన పరమేశ్వరుడు, తల్లి ముఖాన్ని పూర్ణ చంద్రునితో, కనుబొమలను మన్మధుని విల్లు గాను, కన్నులను మీనములతోను, నుదురు భాగాన్ని పద్మరాగ శిలల కన్న నునుపుగా వుంది అని, ఆమె పెదవులు పగడాలు, పండిన దొండపండు తోను, ముక్కును అప్పుడే విచ్చుకున్న సంపెంగ పూవుతోను పోల్చి చూచి అవి ఏవీ కూడా అమ్మ కాంతి ముందు దిగదిడుపే అని నిశ్చయానికి వచ్చారు.
పరంధాముడైన పరమాత్మ దగ్గరగా రావండవల్ల, ఒకింత స్త్రీ సహజసిద్ధమైన సిగ్గుతో ముఖం ఓరగా పక్కకు తిప్పుకుంది, పరమేశ్వరి. ఆ క్షణమాత్రం కూడా అమ్మ ముఖ పద్మాన్ని చూడకుండా వుండలేని పరమేశుడు, ఆమె గడ్డాన్ని (చుబుకాన్ని) తన కుడిచేతితో పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటున్నప్పుడు, అమ్మవారి అందమైన చుబుకం కనిపించింది. "అంబ ముఖం లోని ప్రతీభాగాన్నీ కూడా ఏదోఒక వస్తువుతో పోల్చుకుని చూసాను. ఇప్పుడు, ఈమె గడ్డాన్ని దేనితో పోల్చాలి అని ఎంతో ఆలోచన చేసారు", పరమేష్టి. కానీ, అమ్మ చుబుకాన్ని పోల్చడానికి ఏ వస్తువు కనబడలేదు అయ్యవారికి. పరమేష్టికే సాధ్యముకానిది, వశిన్యాది వాగ్దేవతలకు ఎలా స్ఫురిస్తుంది. అందుకే, ఈ సుందర దృశ్యాన్ని చూసిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ" అని కొనియాడి, జగన్మాతను సంతోషపరిచారు.
అమ్మా మహారాజ్నీ! నీ గడ్డాన్ని వర్ణించడానికి సరి అయిన ఉపమానము ఈ చరాచర జగత్తులో లేదు. తల్లీ! నీ చుబుకము దానికి అదే సాటి. నీవు ఒకప్పుడు "గిరిరాజపుత్రి"గా హిమవంతుని / దక్షప్రజాపతి ని కుమార్తెగా అనుగ్రహించావు. నీ చిన్నతనంలో, నిన్ను ఎత్తుకుని "ఒక ముద్దు ఇవ్వు తల్లీ" అని అడిగితే ఒడినుండీ క్రిందకు దూకి, హిమవంతునికి దొరక్కుండా పరుగెట్టావు, నీ లీలాకేళిలో భాగంగా. చివరికి, నీవు అవకాశం ఇచ్చినప్పుడు, నిన్ను పట్టుకుని, నీ అందమైన గడ్డము పట్టుకుని లాలనగా బ్రతిమాలించుకుని అనుగ్రహం కురిపించావు. అంతటి అందమైన గడ్డమును పొగడడానికి, ఈ చరాచర జగత్తు మొత్తంలో ఎవరికీ ఉపమానాలు దొరకలేదు.
నీ తండ్రి హిమవంతుడు పట్టుకున్న గడ్డము, నీ పతి, పశుపతి, పట్టుకున్న గడ్డము , మాకు ఎలా కనిపిస్తోంది అంటే, జగత్తు మొత్తాన్ని సమ్మోహ పరిచే నీ ముఖము అనే అద్దానికి అమర్చపడిన పగడాలు, వజ్రాలు పొదగబడిన, పిడికిలిలా కనిపిస్తోంది.
 ఇంతటి  అమ్మని పూజించేటప్పుడు 
ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు