శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 50
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
29.అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ (షోడశాక్షరీ)
30.కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరా (షోడశాక్షరీ)
ముప్పైయొవ నామ మంత్రము - 
  ఓం కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరాయై నమః
కామేశుడు - శ్రీచక్రం మధ్యలో బిందు మండలం లో నివాసము వున్నవాడు. ఆ కామేశునిచే తన మెడలో కట్టబడిన మాంగళ్యము చేత శోభాయమానంగా వున్న కామేశ్వరి, పరమేశ్వరి.
అంబ - సతీదేవి - పార్వతీ శంభుల వివాహం జరిగింది. హిమవత్పర్వతాల సొగసులలో ఆనంద నాట్యం జరుగుతోంది. కాలం గడుస్తోంది. ఒక శుభ ముహూర్తంలో, భూమి మీద దక్షప్రజాపతి, మహా యజ్ఞాన్ని తలపెట్టి, చేయడం ప్రారంభించాడు. ఆ సంరంభం, ఆనోటా ఆనోటా అమ్మ పార్వతి చెవులకు సోకింది. పుట్టింటి మీదికి మనసు లాగింది. కానీ, తనకు పిలుపు లేదు. అయినా, పరమేశ్వరి, తాను పుట్టి పెరిగిన ఇంటి ఉత్సవానికి పిలుపు అవసరం లేదు అని సర్దిచెప్పుకుని, హిమవంతుని ఇల్లు చేరింది, జగన్మాత.
ఏనుగు అంబారీలు ఎదురు రాలేదు. స్వాగత సత్కారాలు లేవు. పైగా, తన మగని అలుపెరుగని భాషతో దూషించారు. అంబనూ చులకన చేశారు. ఈ తిరస్కారాన్ని తట్టుకోలేక, అంబ యోగాగ్నిలో తన తనువు చాలించింది. ఈ పరిణామంతో, వీరభదృనితో యజ్నధ్వంస చేయించిన పరమేశ్వరుడు, సతీదేవి దేహాన్ని భుజాన వేసుకుని వైరాగ్యం తో తిరుగుతున్నాడు. అప్పుడు పరమేశ్వరుని ధ్యాస మార్చాలని, తన సుదర్శనం తో, సతీదేవి దేహాన్ని ముక్కలు చేస్తాడు. 18 భాగాలైన అమ్మ శరీరం, భూమండలం పైన 18 చోట్ల పడి, అష్టాదశ శక్తి పీఠాలు గా ఏర్పడ్డాయి.
అలా శరీరం వదలిన అంబ - మరల హిమవంతుని కి కూతురు గా, పార్వతి గా పుట్టింది. ముందుజన్మ స్మ్రతి కలిగిన పార్వతి, శివుడే తనభర్త అని నిశ్చయించుకొని, దీర్ఘ తపస్సు చేస్తూ, ఆకులు కూడా తినకుండా "అపర్ణ అయ్యింది.
వేసవి వేడికి, చలికాలంలో చలికి వేటికీ చలించకుండా, తన గురించి తపస్సు చేస్తున్న పార్వతి ని మెచ్చి, బ్రహ్మచారిగా పార్వతి ముందుకు వచ్చి, "ఏమీ లేని, ఏమీ ఇవ్వలేని ఆ శివుణ్ణి పెళ్లి చేసుకుని ఏమి సుఖపడతావు. నన్ను వివాహమాడు నీకు అమరలోక సుఖాలు అనుగ్రహిస్తాను" అని శివుని నింద చేస్తూ మాట్లాడుతాడు. పార్వతి, "నీ మాటలు తప్పు. పెద్దవారి గురించి అలా మాట్లాడకూడదు. ఎప్పటికైనా పరమేశ్వరుడినే నేను భర్త గా స్వీకరిస్తాను " అని చెపుతుంది. విన్న శంభుడు నిజరూపం చూపిస్తాడు.
దేవతలు, ఋషులు, మునులు, యక్షులు, సకలలోకముల వారి సమక్షంలో అత్యంత రమణీయంగా, అట్టహాసంగా, జరుగుతున్న పార్వతీ పరమేశ్వరుల కల్యాణం, లోకాలను ఏలే ప్రభువు తన అందమైన చేతులతో, శంఖము లాంటి అమ్మ కంఠం లో కట్టిన మాంగల్యం తో పూర్తి అవుతుంది. జగజ్జననీ, జగత్ప్రభువులు ఒక్కటి అయ్యారని మురిసిపోయింది జగమంతా.
తాను కామించిన కామేశ్వరుడు, తన మెడలో కట్టిన తాళిబొట్టు చూసుకుని మురిసి ముగ్ధ అవుతున్న అమ్మను చూసిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరా" అని కీర్తించారు.
అంతటి పరమసౌఖ్యాన్ని పొందుతున్న అమ్మని పూజించేటప్పుడు 
ఓం కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు