శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 55
వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
34.నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయా (షోడశాక్షరీ)
35.లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమా (షోడశాక్షరీ)
ముప్పైఐదవ నామ మంత్రము - 
  ఓం లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమాయై నమః
సమున్నేయ = ఉన్నతమైన; మధ్యమా = నడుము భాగము కలిగినది
నాభి నుండి మొదలైన రోమాల తీగకు ఆలంబనగా వున్న నడుము కలిగిన పరమేశ్వరికి నమస్కారము
చిక్కుడు, ద్రాక్ష వంటి పాదులు నాటినపుడు, విత్తనం చిగిర్చి తీగ రావడం మొదలవగానే, ఆ తీగ పందరి పైకి పాకడానికి ఆధారంగా ఒక కర్రను కానీ, బలమైన చెట్టు కొమ్మను కానీ వుంచుతాము. ఈ కర్రను చుట్టుకుంటూ ఆ తీగ, పందిరి చేరుకుని, ఫలించి పండ్లు ఇస్తుంది. అలాగే, జగన్మాత బొడ్డు నుండి మొదలైన రోమాల తీగ, పైకి పాకడానికి అమ్మ యొక్క సన్నని నడుము ఆధారముగా వున్నందువలన, పైకి పాకిన రోమాల తీగకు అమ్మ పాలిండ్లు ఫలములుగా మనకు దర్శనమిస్తాయి.
సాధారణంగా దేవతా స్త్రీ అయినా, మానవ కాంత అయినా, వుండీ లేనట్లుగా వున్న సన్నని కటిభాగము (నడుము) కలిగి వుంటే అందమైనది గా చెప్పబడతారు. ఇటువంటి స్త్రీని "సింహమధ్య" అంటారు. సన్నని కటిభాగము కలిగిన స్త్రీలు, తేలికగా సంతానాన్ని ప్రసవించ కలుగుతారు.
జగాలన్నిటికీ ఆకలిని తీర్చే అమ్మ, చిరుగంటలు పొదగబడి, మణిమాణిక్యాలతో కూడిన, చిన్నగా వినసొంపుగా శబ్దం చేస్తున్న మొలనూలు ధరించి, మందించిన ఏనుగుల కుంభస్తలముల వంటి పాలిండ్ల బరువుతో కొద్దిగా ముందుకు వంగి వుండి, ఉందా లేదా అన్నట్టుగా వున్న నడుము విరిగిపోతుందేమో, అన్నట్టు వయ్యారంగా అనుగ్రహిస్తోంది పరమేశ్వరి.
ఏటి గట్టున ఏటిలోకి వంగి ఇప్పుడో ఇంకాసేపటికో, ఏటిలో పడిపోతుంది ఏమో, అనిపించేంతగా వంగివున్న జగన్మాతను చూసిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను, "లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమా" అని వెనోళ్ళ కొలిచారు.
ఎంత పొగిడినా తవి తీరని అందమైన సన్నని కటిభాగము కలిగిన లలితా పరాభట్టారికను  పూజించేటప్పుడు 
ఓం లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు