వినరో భాగ్యము విష్ణు కథలు: (8):- ఎం బిందుమాధవి
ఆ రోజు ఆదివారం.
“పిల్లలూ..ఈ రోజు మన విష్ణు సహస్రనామం క్లాస్ అయ్యాక బీచ్ కి వెళదాము అని చెప్పా కదా! త్వరగా తెమలండి మరీ. వచ్చేయాలి..క్లాసు మొదలుపెడుతున్నాను” అని తాతయ్య అనగానే.. ఎప్పుడెప్పుడు బీచ్ కి వెళ్లి ఆడుకుందామా అనే ఉత్సాహంతో పిల్లలంతా వచ్చి బుద్ధిగా కూర్చున్నారు.

“విశ్వం విష్ణుర్విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ప్రభు:
భూత కృత్భూత భృద్భావో భూతాత్మా భూత భావన:
పుతాత్మా పరమాత్మాచ ముక్తానాం పరమాగతి:
అవ్యయ: పురుష: సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ”

తాతయ్య చెప్పిన శ్లోకాలు బుద్ధిగా వల్లె వేసి..లేచి చెప్పులేసుకుని బయటికెళ్లి తాతయ్య కోసం ఎదురు చూస్తున్నారు.
“తాతయ్యా త్వరగా రా..నీళ్ళల్లో ఆడుకోవాలి. ఇసుకతో పిచ్చుక గుళ్ళు కట్టుకోవాలి. గవ్వలు ఏరుకోవాలి” అని అందరూ తమ ప్లాన్ చెప్పి తాతయ్యని తొందర పెట్టారు. వాళ్ల సంతోషానికి పట్ట పగ్గాలు లేకుండా ఉంది.
@@@@
“ఒరేయ్ అలలు ఎలా ఎగిసి ఎగిసి పడుతున్నాయో చూడు. మీదికి వచ్చేస్తాయి. వెనక్కి వచ్చేయి” అని పవన్ అరిచాడు.
“ఏమీ రావు..చూడు..మన కాళ్ళు ముట్టుకుని మళ్లీ ఎలా వచ్చాయో అలాగే వెనక్కి వెళ్ళిపోతాయి. రండి ఇక్కడ రంగు రంగుల గవ్వలు ఉన్నాయి. ఏరుకుందాం. సముద్రంలో ముత్యాలు, పగడాలు, అనేక రకాల రాళ్లు కూడా ఉంటాయిట.” అని మిత్రులని ఉత్సాహ పరిచాడు వేణు.
“భలే కొత్త కొత్త రకాల చేపలు..అంటే జెల్లీ ఫిష్, టైగర్ ఫిష్, సొర చేపలు..పీతలు, డాల్ఫిన్స్, తిమింగలాలు కూడా ఉంటాయిట. మనం మొన్న సినిమాలో చూశాంకదా. కానీ అవన్నీ ఇప్పుడు మనకి కనిపించవు. సముద్రం లోపలికి వెళితే కనిపిస్తాయి” అన్నాడు ప్రకాష్.
“పిల్లలు ఇందాక మనం నేర్చుకున్న ‘విశ్వం’ అంటే ఇదే. సముద్రము, అందులో ఉండే అన్ని జలచరాలు, ఆల్గే లాంటి సముద్రపు మొక్కలు, అందులో దొరికే ముత్యాలు, పగడాలు ..అంటే మనకి కనిపించేవి, కనిపించనివి కూడా అన్నమాట..ఇంకా గవ్వలు, నత్త గుల్లలు అన్నీ శ్రీ మహా విష్ణువుస్వరూపమే! ఈ ఆకాశం, నేల, ఈ ఇసుక, చెట్లు అన్నీ ఆయన స్వరూపమే. అక్కడ సముద్రంలో దూరంగా కనిపించే పడవ, ఓడ, దానికి కట్టిన తెరచాప, పైన కనిపిస్తున్న చంద్రుడు, సూర్యుడు..వాటి నించి వస్తున్న కాంతి, చల్లదనం అన్నీ ఆయన స్వరూపాలే! అర్థమయిందా” అన్నారు తాతయ్య.
“అలా విశ్వమే తాను అయి అంత ఆవరించి ఉన్న ఆ దేవ దేవుడికి ఉండటం, లేకపోవటం, అయిపోవటం అనేవి ఉండవు. ఆయన అవ్యయుడు. ఎలా అంటే..మనుషులు, జంతువులు, పక్షులు,జలచరాలు, చెట్లు, ..చనిపోతూ ఉంటాయి. మళ్లీ కొత్తవి పుడుతూ ఉంటాయి. అవి లేకపోవటం అంటూ ఉండదు. పర్వతాలు కూడా ఆయన స్వరూపాలు..అవీ అంతే..అసలు పర్వతాలు లేకపోవటం, నేల అంతా సమతలంగా ఉండటం ఎప్పుడు జరగదు.”
“భూమిలో కొన్ని చోట్ల అడుగున బొగ్గు గనులు ఉంటాయి, కొన్ని చోట్ల ఖనిజాలు ఉంటాయి, కొన్ని చోట్ల నీటి బుగ్గలు ఉంటాయి. భగవంతుడి సర్వ వ్యాపకత్వం అంటే ఇదే! ఇవన్నీ ఏ పండితుడు, శాస్త్రజ్ఞుడు తయారు చేసి పెట్టినవి కావు. ఆ శ్రీ మహావిష్ణువే అన్నిటికీ కర్త! ఆయనే అన్నిటినీ కాపాడి రక్షిస్తూ ఉంటాడు. మనకి అవసరమైనప్పుడు అందుబాటులోకి తెచ్చి ఇస్తూ ఉంటాడు.”
“మనం అనుభవించే కొన్నిటికి రూపం ఉంటుంది, కొన్నిటికి ఉండదు. ఉదాహరణకి నీటికి ఒక ఇదమిత్థమైన రూపం ఉండదు. గ్లాసులో పోస్తే ఆ రూపం, బకెట్..మగ్గులో పోస్తే ఆ రూపం లో కనిపిస్తుంది. అలాగే ఆకాశానికి కూడా రూపం ఉండదు..మీకు కనిపించే నీలం, నలుపు అనేవి భూమికి ఆకాశానికి మధ్యలో ఉండే అనేక ధూళి, వాయువు, తేమ కణాల వల్ల ఆ రంగులతో ఆకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడి నించి చూడండి..దూరంగా ఆకాశం సముద్రాన్ని తాకినట్టు కనిపిస్తోంది. కానీ నిజానికి తాకదు. అలా కనపడేది వేరు, అక్కడ ఉండేది వేరు” అలా ఆ పరమాత్మ మనకి తెలిసేట్లు కొన్ని, తెలుసుకోలేనట్లు కొన్ని చేస్తూ ఈ విశ్వాన్ని నిర్వహిస్తూ ఉంటాడు..అర్థమయిందా” అన్నారు తాతయ్య.
“అలాంటి అతీత, అలౌకిక శక్తిని ముందు గుర్తించాలి. గౌరవించి, నమస్కరించాలి ..తెలిసిందా..రండి ఇంకా ఇంటికి వెళదాం” అని పిల్లలని బయలు దేరదీశారు.
కామెంట్‌లు