కస్తూర్బా- 8వభాగం: -అచ్యుతునిరాజ్యశ్రీ

 బా కి మహా సహనం.వచ్చీరాని ఇంగ్లీష్ లో తంటాలు పడుతూ అతిథిసత్కారం చేసేది.ఓసారి మోతీలాల్ నెహ్రూ కొంత మందితో వస్తే వంటచేసి వడ్డించిన మహాతల్లి! తను మాత్రమే వంట చేయాలి అనే పట్టుదల. ఆమె కునుకు తీసేటప్పుడు అతిథులొస్తే  ఆశ్రమవాసులు ఆమెని లేపకుండా పని కానిద్దామనుకుంటే ఊరుకునేది కాదు.why u open kitchen? Why late? అని నిలదీసేది. నిగ్గదీసేతత్వం ఆమెది.ఈవిషయంలో భర్త కూడా జీహుజూర్ అనాల్సిందే! తెల్లారుఝామున 4కి లేచి ఆరున్నరకల్లా ఉపాహారం సిద్ధం చేసేది.ఆశ్రమంలో బెల్లం మాత్రమే వాడాలి .అది రూల్.చాలా వేగంగా ఆమె చపాతీలు వత్తి బొగ్గులమంటపై కాల్చి పళ్లాల్లోకి గిరాటేసేది. అంత స్పీడ్ ఆమె చేతులు! అంతా తిన్న తరువాత మాత్రమే ఆమె తినటం! ఎవరైనా కాస్త కెలుకుతూ తింటుంటే  u not   well?  Why u not eating? అని దగ్గరకూచుని తినిపించే అమ్మను మరిపించే అమ్మ  బా!  భర్త సతాయిస్తే అలిసిపోతే గొణగేదికాదు కానీ బొటబొట కన్నీరు కారుస్తూ ఏడ్చేది.భర్త కన్నా తాను కొన్ని నెలలు పెద్ద. ఐనా బాపూ గద్దించి బైటకి గెంటినా సహించింది. ఒక సారి ఆమెపెట్టెను దొంగలు ఎత్తుకుపోయారు. మనవలకోసం దాచిన దుస్తులవి.కాసేపు బాధ పడి సర్దుకుంది. 
1927లో భర్త తో శ్రీలంక వెళ్లిన ఆమెను చూసి"మీ తల్లా?" అని చాలామంది అడగటంతో  సభలకు వెళ్లకుండా బసలోనే ఉండిపోయింది.కొడుకు మణిలాల్ కి స్వయంగా వధువుని వెతికి సుశీల అనే పిల్లతో పెళ్లి చేసింది.అలాగే మూడోకొడుకు రామదాసు పెళ్లి నిర్మలతో, దేవదాసు పెళ్లి రాజాజీ కూతురు లక్ష్మితో జరగడంతో అత్తగా సంతృప్తిపొందిన మాతృమూర్తి.
బా ను భోపాల్ నవాబుతల్లి  స్వయంగా ఆహ్వానించటం ఓవిశేషం! వెంట సుశీలానయ్యర్ ఉంది.1929లో భర్త తో కల్సిఆంధ్రప్రాంతాల్లో 319 పల్లెల్లో 45రోజులు పర్యటించింది.డాక్టర్ బ్రహ్మజోశ్యుల సుబ్రమణ్యం గారు నిర్మించిన సీతానగరం ఆశ్రమంలో ఉన్నారామె.
1929లో నైనిటాల్ లో మంచుకురుస్తున్నా మొండిగా  ఆరుబయట బాపూ పడుకున్నాడు.సింహంపిల్ల వచ్చింది అని తెల్సి తానూ బైట పడుకుంది. భర్తే తన సర్వస్వం,తానే ముందు పోవాలనే అభిలాష ఆమెది. నేతలంతా జైల్లో ఉన్నప్పుడు  మహిళలతో కల్సి  బార్డోలీతో సహా అన్ని ప్రాంతాల్లో పర్యటించి కల్లు సారా షాపుల వద్ద పికెటింగ్ మద్య నిషేధం విదేశీవస్తుబహిష్కరణ గూర్చిన ఉపన్యాసాలతో జనాల్లో జోష్ నింపింది.గుజరాతీ, హిందుస్థానీలో వక్త గా పేరుగాంచినధీశాలి.జొన్న రొట్టె,కూర,ఉప్పులేని పప్పు ఆమె ఆహారం.భగవద్గీత కంఠతా వచ్చు.గుజరాతీ పేపర్లు చదివేది.హిందీని అతికష్టం మీద కూడబలుక్కుని చదివేది.వైస్రాయి భార్య లేడీ విలింగ్టన్ బా ని ఆహ్వానించి మాట్లాడినదంటే, కస్తూర్బా ప్రభావం ఎంతగా ఉందో మనకి అవగతమౌతుంది..
1931_33 ఆమె సబర్మతీ జైల్లో రాట్నం వడుకుతూ హిందీ చదవటం,రామాయణ భాగవత పఠనంలో సత్కాలక్షేపం చేసింది.ఆంగ్ల అక్షరాలు పదాలు రాయడం నేర్చింది.🌷
కామెంట్‌లు