వినరో భాగ్యము విష్ణు కథలు: (9): - ఎం బిందుమాధవి

“యోగో యోగ విదాం నేతా ప్రధాన పురుషేశ్వర:
నారసింహ వపు: శ్రీమాన్ కేశవ: పురుషోత్తమ:
సర్వశ్సర్వ శివస్థాణు: భూతాదిర్ణిదిరవ్యయ:
సంభవో భావనో భర్తా ప్రభవ: ప్రభురీశ్వర:”

“పిల్లలూ ఏం చేస్తున్నారు? రండి..ఇవ్వాళ విష్ణు సహస్ర నామంలో ఏం కథ చెప్పుకుందాం” అని అడిగారు తాతయ్య.
“ఇవ్వాళ మీతో నేను కూడా వస్తున్నాను”..అంది బామ్మ.
“భలే..బామ్మ కూడా పొద్దున్న అన్నం తినేటప్పుడు మంచి మంచి కథలు చెప్పింది” అన్నాడు హవీష్.
“యోగ అంటే..కలపటం. కలపటం అంటే ఇద్దరు వ్యక్తులనో, రెండు వస్తువులనో రెండు మూడు రంగులనో, అనేక పువ్వులనో కలిపి మాల కట్టటం..ఇలా అన్నమాట. అలాగే మనం విష్ణు సహస్ర నామం చదువుకుంటున్నాం కనుక ఈ ‘యోగ’ పదాన్ని ఇంకొక విధంగా కూడా చెప్పుకోవచ్చు. మనలో కంటి చూపు, చర్మానికి స్పర్శ, ముక్కుతో గాలి పీల్చి వదలటం, చెవులతో వినటం అనే అన్ని ఇంద్రియాల పనులని ఒకే పని మీదికి మళ్లించి..ఉదాహరణకి ధ్యానం అనుకుందాం..అలా చేయటాన్ని ‘యోగ’ అని చెప్పొచ్చు. అంటే ఇంద్రియాలు చేసే పనులన్నిటినీ ఒకే తాటి మీదికి తీసుకొచ్చి..బయట శబ్దాలు వినకుండా, బయటి విషయాలు చూడకుండా, గాలి పీల్చడాన్ని నియంత్రించి, లోపల మనసుతో దైవ ధ్యానం లేక నామ జపం చేయడం అన్నమాట. అలాంటప్పుడు మన శరీరం మీద ఏదైనా పాకింది అనుకుందాం..మనకి ఆ స్పర్శ కూడా తెలియదు. దాన్ని తపస్సు అని కానీ, ధ్యానం అని కానీ అంటాం”.
“తాతయ్యా నువ్వు చెప్పేది కొంచెం తెలుస్తోంది కానీ..బామ్మ అయితే ఇంకా బాగా చెబుతుంది. నువ్వు చెప్పు బామ్మా” అన్నాడు వికాస్.
“సరే వినండి..మీరు టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు..అమ్మ వంటింట్లో నించి పిలిచి ‘షాప్ కి వెళ్లి పాల ప్యాకెట్ తీసుకురా’ అని చెబితే మీరు తదేక ధ్యాసలో సచిన్ సెంచరీ కి దగ్గరలో ఉన్నాడు..ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో చూస్తూ ఉంటారే కానీ అప్పుడు పిలిచినా అమ్మ కేక మీకు వినపడదు. అవునా? ఆ ఉత్కంఠ అంటే ఏంటి..ఏకాగ్రత, అన్ని ఇంద్రియాలు ఏకమై ఒకే దాని మీద కేంద్రీకరించడం” అన్నది బామ్మ.
“అలాగే రెండు మూడు రంగులు కలిపితే వచ్చే కొత్త రంగులో..ముందు విడి విడిగా ఉన్న రంగులు తమ ఉనికిని కోల్పోయి ఒకే రంగు అవుతాయి. అవునా? అలాగే నదుల్లో నీళ్ళు సముద్రంలో కలిసే వరకు విడి విడి రంగులతో, లక్షణాలతో ఉంటాయి. ఒక సారి సముద్రంలో కలిసిపోయాక..ఆ నీరు కృష్ణ, గోదావరి అనే వేరు వేరు నదుల నీరుగా కనిపించదు. మొత్తం ఒకే సముద్రం అయి పోతుంది. అదే విశ్వం అంతా వ్యాపించి ఉన్న విష్ణువు ఏక రూపమై, అన్నీ తనలో కలిపేసుకున్న విరాడ్రూపం అన్నమాట. అప్పుడు ఆయనే ప్రధాన పురుషుడు అన్నమాట.”
“నిన్న తాతయ్య చెప్పిన శ్లోకంలో “క్షేత్రం” అంటే మన శరీరం. అసలు శరీరం ఎందుకు వస్తుంది, మనం ఎందుకు పుడతాం..అంటే మనం పూర్వ జన్మలలో చేసిన పాప పుణ్యాలు అనుభవించటానికి ఈ జన్మలో ఒక శరీర రూపం తీసుకుని పుడతాం”.
“అందరం ఒకే ఇంట్లో ఎందుకు పుట్టం? వేరే ఇళ్లలో, వేరే రూపాలతో, వేరే తెలివితేటలతో పుడతాం. ఒకళ్ళు పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటారు. కొందరు చిన్న ఇళ్లలో, కొందరైతే పని వాళ్ల పిల్లలుగా పుడతారు. ఇదంతా ఏంటి బామ్మా” అన్నది పావని.
“ఇందాక నేను చెప్పిన ‘యోగ’ అనే దాన్ని ఈ ‘క్షేత్ర’ తో కలిపి చూసుకుంటే బాగా అర్థం అవుతుంది. మనం చేసిన పూర్వ కర్మల పాప పుణ్యాలని బట్టి మనం ఎవరికి, ఎక్కడ పుట్టాలో నిర్ణయించబడుతుంది. ఆ ‘ఎక్కడ’ అనేది ‘క్షేత్ర’ నిర్ణయం అన్నమాట. ఒకళ్ళు బాగా ధనవంతుల ఇళ్లలో, కొందరు పెద్దగా డబ్బు లేని పని వాళ్ల ఇళ్లలో పుడతారు. ఎవరు ఎక్కడ పుడతారో పుట్టక ముందు వారికి తెలియదు కదా! తెలిస్తే అందరూ ధనవంతుల ఇళ్లలో, తెలివి కల వారిగానే పుడతారు.. అవునా? అలా మన కర్మలు అనుభవించటానికి ఒక శరీరంలో పుట్టించి, ఆ కర్మలు అనుభవించటానికి ఆ పుట్టిన చోటి పరివారమూ ఏర్పడతాయి. అంటే మనకి ఎవరు అమ్మా-నాన్న, అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు అవ్వాలో కూడా మన పూర్వ కర్మలే నిర్ణయిస్తాయి.అలా క్షేత్రం అనే శరీరంతో మన కర్మలు అనే బీజాలను యోగం చేసేవాడు ఆ శ్రీమహా విష్ణువు అన్నమాట. అందుకే ఆయన ప్రధానమైన వాడు.”
“అలా మనం చేసిన కర్మలని మనకి అనుభవంలోకి తెచ్చే ఆది దేవుడు ఆయన. ఉదాహరణకి..ప్రహ్లాదుడి తండ్రి.. హిరణ్య కశిపుడు..బ్రహ్మ దేవుడి కోసం తపస్సు చేసి తనకి మనిషి వల్ల కానీ ..జంతువు వల్ల కానీ, ఏ విధమైన ఆయుధాలతో కానీ, పగలు కానీ ..రాత్రి కానీ, ఇంట్లో కానీ ..బయట కానీ మరణం రాకూడదు అని వరం కోరతాడు. అతను చేసిన కర్మ వల్ల, అతని కోరిక వల్ల ఆ శ్రీమన్నారాయణుడు, అవేవీ కానీ రూపమైన ‘నరసింహ’ రూపంలో వచ్చి భవనం లోపల-బయట కాని గడప మీద హిరణ్య కశిపుడు శరీరాన్ని తన తొడ మీద పెట్టుకుని చేతి గోళ్లతో చీల్చి చంపాడు. ఇప్పుడు అర్థమయిందా..దేవుడు ఆ రూపంలో ఎందుకు ఉన్నాడో” అన్నది.
“ఇంకా వినండి..ఒక విత్తనం తనలో కనిపించకుండా మొత్తం వృక్షాన్ని ఎలా ఇముడ్చుకుంటుందో, అలా సృష్టి ఆరంభం కాక ముందు పరమశివుడు మౌన ముద్రలో తనలో మొత్తం జగాన్ని ఉంచుకుని కాపాడుతూ ఉంటాడు. లోపల ఉన్న జగం అంతా ఏ విధమైన అలజడి లేకుండా ప్రశాంతంగా ఆయన రక్షణలో ఉంటుంది.”
“శివుడి కంఠంలో విషం ఉంటుందని మీకందరికీ తెలుసు కదా. అలా విషం, ఆయన కంఠంలో ఉన్నంత సేపు ఆయన్ని ఏమీ బాధించకుండా, ఏ విధమైన అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆయన సృష్టి ఆరంభం చెయ్యాలి అనుకున్నాక, లోపల ఉన్న జగం..అంటే అన్ని రకాల జీవరాశులు అన్నమాట..తమ తమ కర్మలని బట్టి రక రకాల శరీరాలని తీసుకుని..వాటిని ఉపాధులు అని కూడా అంటారు.. పుడతాయన్నమాట. అలా సృష్టి అంతా అయినా కూడా..మిగలకపోవడం, అయిపోవటం అనేది లేకుండా..మూల రూపమైన ఆయన అలాగే ఉంటాడు.”
“ఆయన విశ్వం అంతా ఆవరించుకుని అందరు తానే అయి, అన్నీ తానే అయి సృష్టి చేసి, నిర్వహించి, మళ్లీ ఉపసంహారం చేస్తూ..నిత్యం ఈ పనులు చేస్తూ ఉంటాడు.”
అని చెప్పి బామ్మ “సరే వెళ్లి ఆడుకోండి..మళ్లీ చీకటి పడితే హోమ్ వర్క్ చేసుకోవాలి” అని అక్కడి నించి లేచి లోపలికి వెళ్లింది.
కామెంట్‌లు