మా సంక్రాంతి పండుగ:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977 కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.
మన తెలుగువారి లోగిళ్లకు
ఘన వెలుగు దారి వాకిళ్ళకు
సంక్రాంతి శ్రీలక్ష్మి ఇక వచ్చింది
సరికొత్త క్రాంతిని అది ఇచ్చింది !

అచ్చట్ల ముచ్చట్ల పండుగ
మూడు దినముల పండుగ
వచ్చే మా సంక్రాంతి పండుగ
తెచ్చే నవ క్రాంతిని నిండుగ. !

ప్రథమ దినము భోగి అంటరు
పిండి వంటలను చేసుకుంటరు
ద్వితీయ దినం సంక్రాంతి వచ్చు
అద్వితీయమైన క్రాంతినదినిచ్చు !

హరిలోరంగ హరి హరి అని
హరిదాసులు అతివలను కని
వారింటి ముందుకు వస్తుంటరు
ఆశీర్వచనాలను అందిస్తుంటరు!

వేకువనే మన వనితలు లేస్తరు
సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తారు
ఇంటి ముందర ముగ్గులు వేస్తరు
ఆడుతూ పాడుతూ ఆనందిస్తరు !

ఈరోజు భోగిమంట వేసుకుంటరు
వారి మోజు వారు తీర్చుకుంటరు
కులాసాగాను ఇక అందరుంటరు
వారి విలాసాల  తెలుసుకుంటరు !

గంగిరెద్దుల వారు కూడా వస్తరు
గానా బజానా వారు ఇక చేస్తరు
కొండదేవర ఆన అని వారంటరు
దానం ధర్మం చేస్తే మంచిదంటరు !

హరివిల్లు రంగులను పూసుకుని
విరిజల్లు పొంగులను తీసుకొని 
\సంక్రాంతి వచ్చింది మన ఊళ్ళకు
సంబరాల నిచ్చింది మనవాళ్లకు !

ఊరు వాడ ఇక ఏకం అవుదాం
సంక్రాంతి లక్ష్మికి సౌధం కడుదాం
ఘనముగ  పూజలనిక జరిపిద్దాం
జన జాతరచేసిక మరి మురిపిద్దాం


కామెంట్‌లు