ప్రవర్తన:-ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట -9966946084
 కొన్నెవంక గ్రామంలో చంద్రయ్య, మల్లమ్మ అనే దంపతులు నివసించేవారు. వారికి గిరి, వేణు అనే ఇద్దరు బిడ్డలున్నారు. చంద్రయ్య, మల్లమ్మలు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గిరి, వేణులు బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని పట్నంలో చదివించసాగారు. ఎంత కష్టమైనా తల్లిదండ్రులు బిడ్డలకు ఎలాంటి లోటు రాకుండా చూడసాగారు. 
              మొదట్లో బాగానే చదువుకున్న గిరి, వేణుల ప్రవర్తనలో రానురాను మార్పు రాసాగింది. చదువు విషయం పక్కన పెట్టి, చెడు సావాసాలకు అలవాటు కాసాగారు. ఎక్కువగా తల్లిదండ్రులను డబ్బులు పంపమని అడుగుతూ, మాటకు మాట సమాధానం చెప్పసాగారు. విషయం అర్థం చేసుకున్న తల్లిదండ్రులు చంద్రయ్య, మల్లమ్మలు బాగా బాధపడి, చక్కగా ఆలోచించారు.
                ఒకసారి సెలవులలో గిరి, వేణు లు ఇంటికి వచ్చారు. బిడ్డలు ఆరుబయట తిరుగుతుండగా మల్లమ్మ బట్టలు ఉతకడం మొదలుపెట్టి, గిరి అంగిని తెల్లటి నీళ్లలో ముంచి తీసి దండేంపై ఆరేసింది. వేణు అంగిని పిండుతూ పక్కనే ఉన్న మోరీ నీళ్ళలో ముంచగా నల్లగా అయింది. తర్వాత ఎంత తెల్లటి నీళ్లలో ముంచి తీసినా నలుపుగానే ఉండసాగింది. చివరికి మల్లమ్మ బాగా కష్టపడి వేణు అంగిని పిండి దండెం మీద ఆరేసినా నలుపుగానే అంగి ఉన్నది. 
         మల్లమ్మ రెండు విధాలుగా బట్టలు పిండిన విధానం చూసిన గిరి, వేణులు తమ తప్పు తెలుసుకున్నారు. పట్నం వెళ్లాక చెడు సావాసాలు మాని, మంచి ప్రవర్తనతో చక్కగా చదువుకొని, ఉద్యోగాలు పొంది చంద్రయ్య, మల్లమ్మ లకు పేరు తెచ్చారు.
 


కామెంట్‌లు