వన పర్వము చతుర్థాశ్వాసము- *104వ రోజు
పాపుణ్యాలు ఫలితాలు
ఈ విధంగా మానవులు చేసే పుణ్యం పాపం మరణానంతరం కూడా నశించవు. వారి పాపపుణ్యములు నశించక వాసనలుగా వారి వెంట వెళతాయి. కొందరు వారు చేసిన పాపపుణ్యములకు ఈ జన్మలోనే ఫలితం అనుభవిస్తారు. కొందరు స్వర్గం లోనూ, నరకం లోనూ అనుభవిస్తారు. కొందరికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖం ఉండదు. కొందరు ఎక్కువ ధనం సంపాదిస్తారు. కాని మోహం లోభం కలిగి స్వసుఖాలకు మాత్రమే ధనం ఉపయోగిస్తారు. ఇంద్రియ సుఖాలకు మాత్రమే వెచ్చిస్తారు. పుణ్యకార్యాలు చెయ్యరు. ధర్మజా! నీవు ఎక్కువ పుణ్యకార్యాలు చేసావు. వేదాధ్యయనం, తీర్ధయాత్రలు చెయ్యడం లాంటి పుణ్యకార్యాలనేకం చేసావు. ధర్మవర్తివి కనుక ఈ లోకంలో కష్టాలు అనుభవించినా పరలోక సుఖం లభిస్తుంది. ఎల్లవేళలా ధర్మకార్యాలు చేస్తూ, ధర్మాచరణచేస్తూ, ధర్మబద్ధంగా అర్జిస్తూ, ధర్మబద్ధంగా వివాహం చేసుకుని సంతానం పొందిన వారు ఇహలోక, పరలోక సుఖాలను అనుభవిస్తారు. ఎల్లప్పుడూ అసత్య వచనం పలుకుతూ ఇంద్రియ లోలులై చరిస్తూ, శుచి శుభ్రం లేకుండా, నాస్తికులై అపరాధాలు చేసే వారు ఇహలోకంలోనూ పరలోకంలోనూ దుఃఖం అనుభవిస్తారు. ధర్మజా ! మీరు దేవతాంశలతో జన్మించారు. మీరు ధర్మం తప్పకుండా చరించి శత్రువులను జయిస్తారు. భూభారాన్ని తగ్గిస్తారు. ఎన్నో యజ్ఞ యాగాదులు చేసి దేవత్వాన్ని పొందుతారు " అని మార్కండేయమహర్షి చెప్పాడు.
బ్రాహ్మణ ప్రభావం
ధర్మరాజు మార్కండేయుని బ్రాహ్మణ ప్రభావం గురించి చెప్పమని కోరాడు. మహర్షి " ధర్మనందనా! పూర్వం హైహవ వంశోద్భౌడైన దుంధుమారుడు అనే రాజు వేట నిమిత్తం అడవిలో తిరుగుతూ ఒకచోట జింక చర్మాన్ని ఉత్తరీయంగా కట్టుకున్న బ్రాహ్మణుని చూసి అది మృగమనుకుని బాణంతో కొట్టాడు. తరువాత తాను చంపినది బ్రాహ్మణుడిని అని తెలుసుకుని దుఃఖించాడు. వంశ పెద్దలను వెంటపెట్టుకుని తార్క్షుడు అనే ముని దగ్గరకు వెళ్ళి పరిహారం చెప్పమని అడిగాడు. ఆ మహాముని చిరునవ్వుతో తన కుమారుని పిలిచి " ఇతడేనా మీ రాజు చంపిన బ్రాహ్మణుడు " అని అడిగాడు. హైహవులు ఆశ్చర్యపడి " మహాత్మా! ఈ ముని కుమారుడు మా మహారాజు చేతిలో చనిపోయాడు కదా మరలా ఎలా బ్రతికాడు? " అని అడిగారు. అందుకు ఆ ముని " మేము కొన్ని నియమాలు పాటిస్తాము. అన్నీ పనులూ సకాలంలో చేస్తాము. నియమిత ఆహారం తీసుకుంటాము. శాంతితో జీవిస్తాము. సత్యాన్ని మాత్రమే పలుకుతాము. బ్రహ్మచర్యం పాటిస్తాము. అతిధులను సత్కరిస్తాము . అందువలన మాకు మృత్యు భయం లేదు, రోగాలు రావు. కనుక మీరు నిశ్చింతగా వెళ్ళండి " అన్నాడు. వారు మునికి నమస్కరించి వెళ్ళారు. బ్రాహ్మణ ప్రభావం అంతటి మహోన్నతమైంది " అన్నాడు.
బ్రాహ్మణ క్షత్రియ స్వరూపములు
ఆ తరువాత మార్కండేయుడు " ధర్మజా! నీకు బ్రాహణ క్షత్రియ స్వరూపాలను గురించి చెప్తాను విను అని చెప్ప సాగాడు. పూర్వం అత్రి మహర్షి తపస్సు చేసు కోవడానికి అడవికి పోతూ భార్యను పిలిచి " నేను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను. నీవు నీ పుత్రుల వద్ద ఉంటావా? నాతో వస్తావా? " అని అడిగాడు. అందుకు ఆమె " నాధా! పుత్రుల పోషణకు తగిన ఏర్పాటు చేయకుండా మీరు వెళ్ళడం ధర్మం కాదు. కనుక మీరు వైన్యమహారాజును అడిగి కొంత ధనం తీసుకు రండి " అన్నది. అది విని అత్రి వైన్యమహారాజు దగ్గరికి వెళ్ళి దగ్గరకు వెళ్ళాడు. ఆసమయంలో వైన్యమహారాజు అశ్వమేధయాగం చేసి బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తున్నాడు. అత్రి ఆయన దగ్గరకు వెళ్ళి " రాజా ! నీవు బ్రహ్మదేవునితో సమానుడవు. ఇంద్రునితో సమానుడవు. నీవు సమస్త జనులకు ఈశ్వరుడవు. నీకు అన్ని ధర్మములు తెలియును. నీతో సమానమైన రాజు ఈ భూమి మీద లేడు. అందరూ ఋషులు నిన్ను పొగుడుతారు " అన్నాడు. అక్కడే ఉన్న గౌతమ మహర్షి ఇది విని ఆగ్రహించి " కేవలం ధనం కోసం మానవమాతృడైన రాజును ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు అని పొగడటం తగునా? " అని అన్నాడు. అత్రి " ఏది యుక్తము ఏది యుక్తము కాదు అని తెలియకుండా మాట్లాడ వద్దు. నీతివంతుడై, పరాక్రమ వంతుడై, నిర్మలుడై సమస్త లోకాన్ని పాలించే రాజు ధర్మానికి మూలం అటువంటి రాజును ప్రశంసించడం నాకు తగదా? " అని బదులు చెప్పాడు. గౌతముడు " కేశములు తెల్లబడినంత మాత్రాన నీవు జ్ఞానివి కాదు. సభలో జ్ఞానవృద్ధులకు మాత్రమే విలువ కదా " అన్నాడు. అత్రి గౌతముల వాదన విన్న కశ్యపుడు అనే మహాముని విని " అయ్యా ! ఈ వివాదం మనం తీర్చలేము. సనత్కుమారుడు అనే మహామునిని అడుగుదాము " అన్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి