సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు)సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -99: అడిగినట్టిస్తే-కడిగినట్టు పోతది
*****
 అవ్వా!గీ సంగతి తెల్సా? మన కరణయ్య మావ మొత్తం లాచారై ఏం జెయ్యాలో తెల్వక నెత్తిన గుడ్డేస్కుని ఎవ్వలికి మొగం సూపించ లేక ఇంట్లె నుంచి బయటికి రాట్లేదట."
అయ్యో గదేంది శెల్లె! కరణయ్య మావంటే సాచ్చాత్తూ దాన కరణయ్యే అంటరు గద! మనూల్లె గాయనంత మెతక మడిసి ఇంకోడు లేడు అంటరు. కట్టమొచ్చిదంటే కన్నీళ్లు పెట్టుకుంటడు.  గీ ఊల్లె మణుషుల్ల గాయనింట్ల శెయ్యి గడగనోళ్ళు ఉన్నరా? గింత మంచి మణిషికి గంత కట్టమా?"
 "అవునవ్వా! మావ సంగతి ఇనంగనే సైన్మా యాటరు సాయిత్రమ్మ యాది కొచ్చింది. గట్ల పతొక్కరికి,అడిగినోళ్ళకి కాదనకుండ దానాలు దర్మాలు జేసి జేసి శివరాకరికి ఆళ్ళు ఈళ్ళు ఇచ్చిన ఆటితో దవాఖానాలో వైద్గం జేయించుకునే పరిత్తితి వొచ్చిందట. "
" గా సాయిత్రమ్మనే గాదు శెల్లె! ఆందర్ రాష్ట మొదటి ముక్యమంతిరిగా పన్జేసిన టంగుటూరి పకాశం పంతులు గారు సుత తాను సంపాయించిందంత  పజల సంచేమం కోసరం కర్సు జేసి శివరాకరికి బీదరికం అనుభగిచ్చిండంట.గియన్ని తల్సుకుంటే మస్తు బాదైతది  శెల్లె!"
 "అవ్వా!గా మావకి కట్టమొచ్చిందని ఎరకైనప్పట్నించి, గాయన్ని అవుసరానికి ఆడుకున్నోడు ఒక్కడు సుత గా మా మావ ఇంటాంకెల్కి రాట్లేరట. గాయన మొత్తం లాశారైన బాద కంటే గీళ్ళు గిట్ల మొగం సాటేసుడికి మస్తు రంది పడ్తున్నడు.
"పడడా మరి!మడుసుల్లో మానత్వం కరువైంది శెల్లే! గందుకే తనకు మాలిన దరుమం చేయగూడదు. గా లలితా బంగారం కొట్టాయన " డబ్బులు ఎవలికీ ఊరికే రావు" అన్నట్టు,కట్టపడి సంపాయించుకున్న డబ్బుని నువ్వేమన్న అనుగని గట్ల ఉచ్చితార్తంగ దానం శేయగూడదు శెల్లె! అడిగినోడికల్ల ఇచ్చేతల్కి పైసా  మిలగకుండ కడిగినట్టయిపాయె".
సర్లే తీ శెల్లె!  మనమెల్లి కరణయ్య మావకి దైర్నం జెబుదాం. యాపారం తెల్వి తేటలున్నయి గద మావకి. గందుల్నే మల్ల పుంజుకునేల మనోళ్ళని సాయం జేయమందాం."పా!శెల్లె పోదాం!" అన్కుంట ఇద్దరూ కలిసి కరణయ్య మావ ఇంటికి బయలు దేరిండ్రు.
 "గదండీ సంగతి! సొంత పరిస్థితిని బట్టి దానం, ధర్మం శెయ్యాలె.గది సుత,అడిగి నోళ్ళకి అడిగినంత కాకుండ, మన అయిషతును సుత యాదిలో పెట్టుకొని గిస్మంటివి  శెయ్యాలె. లేకుంటే అడిగినట్టు ఇత్తే కడిగినట్టు అయితది మరి.
మనం సుత గియన్నీ యాదిల బెట్కోవాలె.

కామెంట్‌లు