పిల్లలూ! నోబెల్ బహుమతి అంటే మీకందరికీ తెలుసు కదా! మరి ఆసియా ఖండపు నోబెల్ బహుమతి అంటే తెలుసా? తెలీదు కదా! దీనికి మరో పేరున్నది. అది రామన్ మెగసేసే పురస్కారం. ఈ పేరు చెప్పగానే తెలిసింది కదా! ఈ రామన్ మెగసేసే పురస్కారంను ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? ఎవరికి ప్రదానం చేస్తారు అనే విషయాలు తెలుసుకుందామా!
న్యూయార్కుకు చెందిన రాక్ ఫెల్లర్ సహోదరులు ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. వీరికి ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సమయ సహకారాలు అందిస్తున్నది. రామన్ మెగసెసే అంటే ఎవరి పేరో తెలుసా! ఫిలిప్పీన్స్ దేశపు మాజీ అధ్యక్షుడి పేరు రామన్ మెగసెసే. తాము ఫలితం ఆశించకుండాం ఉదారంగా ఇతరులకు సేవ చేసే వారికి రామన్ మొగసేసే ఫౌండేషన్ అవార్డును ఇస్తుంది. దీనిని 1957 వ సం||లో ఏర్పాటు చేశారు. కేవలం ఆసియా ఖండంలో నివసించే వ్యక్తులకు మాత్రమే ఈ అవార్డు పరిమితం. ప్రభుత్వ సేవలు, పబ్లిక్ సర్వీస్, జర్నలిజం, శాంతి, అంతర్జాతీయ అవగాహన, అత్యవసర నాయకత్వం. క్రియేటివ్ కమ్యూనికేషన్ ఆర్ట్స్, కమ్యూనిటీ లీడర్ షిప్ వంటి అంశాలలో అత్యుత్తమ సేవలు, ప్రతిభ కనబరచిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.
రామన్ మెగసెసే అవార్డు ఫౌండేషన్ ఎటువంటి లాభాలను ఆశించకుండా చక్కని అవార్డులను ఇస్తుంది. ఇందులోని బోర్డు ఆఫ్ ట్రస్టీలకు ఫిలిప్పీనోల పేర్లు పెట్టుబడ్డాయి. ఆసియా ఖండం మరియు అనేక ద్వీపాల నుండి ప్రముఖమైనటు వంటి ఆసియా వాసులను ఈ ఫౌండేషన్ లో చేర్చుకున్నారు. జాతి మత, లింగ వివక్ష లేకుండా అత్యున్నత సేవలు చేసిన వారికి ఆవార్డును బహుకరిస్తారు. తమ రంగంలో ప్రజల గుర్తింపును, ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండే వ్యక్తులను గుర్తించి గౌరవిస్తుంది.
1958 వ సం..లో తొలిసారిగా తైవాన్ దేశానికి చెందిన "చియాంగ్ మోన్లిస్" కు పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. తైవాన్ దేశస్థుల గ్రామీణులలో గణనీయమైన మెరుగుదలను తీసుకు రావడంలో “చియాంగ్ మోన్లిస్” వెశేషంగా కృషి చేశారు. 1959 వ సం..లో భారత దేశానికి చెందిన “సర్ చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్” కు లభించింది. ఫిలిప్పీన్స్ కు చెందిన “జోస్ వాస్క్వెజ్ అగ్యిలర్” కు ప్రభుత్వ సేవలలో ఆదర్శవంతమైన పని తీరుకు లభించింది. ఇండోనేషియాగా, తైవాన్, పాకిస్తాన్, థాయిలాండ్, హాంగ్ కాంగ్, దక్షిణ కొరియా, వియత్నాం జపాన్, శ్రీలంక, చైనా దేశాల నుంచి ప్రతి సంవత్సరం ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో అనేక మందిని ఈ రామన్ మెగసెసే పురస్కారం లబించింది.
భారత దేశం నుంచి తొలిసారిగా 1959 లో “సర్ చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్” కు లభించిందని చెప్పుకున్నాం. ఈ పురస్కారం ప్రభుత్వ సేవలు అందించినందుకు గాను లభించింది మొదట్లో ఆరు విభాగాలలో పురస్కారాలు అందించినా కాలక్రమంలో ఐదు విభాగాలు రద్దు చేయబడ్డాయి. 2009 వ సం.. నుండి అత్యత్తమ నాయకత్వంకు ఇచ్చే పురస్కారం తప్ప మిగిలిన రంగాలన్నీ నిలిపి వేయబడ్డాయి. ప్రభుత్వ సేవలో 1958 వ సం.. నుంచి మొదలు పెట్టి 2008 వ సం.. వరకు మాత్రమే రామన్ మెగసెసే పురస్కారాలు అందించారు.
ప్రజాసేవకు సంబంధించిన విభాగంలో ఆధునిక భారతదేశం కోసం నిరంతరం కృషి సల్పిన 'జయ ప్రకాష్ నారాయణ్'కు లభించింది. 1965 వ సం..లో వీరికి ఈ బహుమతి లభించింది. అలాగే 1974 వ సం..లో మధుర గాయని ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి గారికి లభించింది. భారతదేశం లోని ఉద్యమాలకు, భక్తి సంగీతానికి మద్దతు నిచ్చిన సంగీత సామ్రాజ్ఞి మదురై షణ్ముఖ వడివు సుబ్బలక్ష్మికి రామన్ మెగసెసే ఇచ్చారు. మహాత్మా గాందీలతో పాటుగా గ్రామీణులను సామాజికంగా ఆర్థికంగా మెరుగు పరచే క్రమంలో పని చేసిన 'దుణి భాయ్ దేశాయ్' కు కూడా 1962 వ సం..లో కూడా రామన్ మెగసెసే భారత్ ను వరించింది. వికలాంగుల పునరావాసం మరియు కుష్ఠు వ్యాధి పీడితుల కోసం శ్రమించిన ‘బాబాఆమ్టే’ కు ఈ బహుమతినిచ్చి గౌరవించారు. భారతదేశంలోని పేదరిక నిర్మూలనకు చేసిన కృషికి గాను 1989 వ సం..పు రామన్ మెగసెసే పురస్కారం లక్ష్మీచంద్ జైన్ కు లభించింది. 1993వ సం..లో మరో భారతీయుడు భానూ జహంగీర్ కోయాజీకి పురస్కారం లభించింది. మహారాష్ట్ర లోని గ్రామీణ మహిళల ఆరోగ్యానికి ఆధునిక ఆసుపత్రి వనరులు సమీకరించినందుకు గాను ఈ అవార్డు నిచ్చారు. 1997వ సం..లో మహేష్ చందర్ మెహతాకు, 2005సంలో విశ్వనాథన్ శాంతాకు, పురస్కారాన్నిచ్చారు. క్యాన్సర్ అధ్యయనం, చికిత్సా పద్ధతులపై అసమాన ప్రతిభ చూపినందుకు విశ్వనాథన్ శాంతాకు ఇచ్చారు.
సమాజ నాయకత్వం విభాగంలో 1958వ సం..లో భారతదేశంలోని ఆర్థిక అసమానతలను తొలిగించడం కోసం అహర్నిశలు శ్రమించిన 'వినోబాభాదే' కు లభించింది. కళలు నాటకరంగం వంటి హస్తకళల్లో "కమలాదేవి ఛటోపాధ్యాయ" కు 1966 వ సంవత్సరానికి, రామన్ మెగసెసే ఇచ్చి గౌరవించారు. భారత వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్.ఎస్. స్వామినాథన్ కు 1971 లో రైతుల విద్యావేత్తగా ఈ పురస్కారం అందించారు. ఈలా రమేష్ భట్, రజీనీ కాంత్ ఆరోల్, మాబెల్లే ఆరోల్, ప్రమోద్ కరణ్ సేధీ, చండీ ప్రసాద్ భట్, అరుణా రామ్, రాజేంద్రసింగ్, శాంతా సిన్హా, ప్రకాష్ ఆమ్టే, మందాకిని ఆమ్టే లకు (2008) రామన్ మెగసెసే పురస్కారాలు లభించాయి.
జర్నలిజం, సాహిత్యం, కళల విభాగంలో గత యాభై సం..ల కాలంలో అనేక మందికి పురస్కారాలు లభించాయి. 1961 లో అమితాభ చౌదరి ఈ పురస్కారాన్ని పొందారు. భారతీయ సంగీతం కోసమై కృషి చేసినందుకు 'మన్నాడే' కు, సినిమా కళను ప్రభావ మతంగా చిత్రీకరించి నందుకు ‘సత్యజిత్ రే' కు బూబ్లీ జార్జి వర్గీస్ కు, శంభు మిత్రా, గారి కిషోర్ ఘోష్, అరుణ్ శౌరి, కార్టూన్ల రాజు ఆర్ కె. లక్ష్మల్, సితార్ విద్వాంసుడు రవిశంకర్, రచయిత్రి మహశ్వేతాదేవి, జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ లకు ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డులు అభించాయి.
శాంతి, అంతర్జాతీయ అవగాహన విభాగంలో భారతదేశం నుంచి తొలిసారిగా 1962 సం..లో మదర్ థెరిస్సాకు ఈ అవార్డు దక్కింది. ఆసియా దేశాలలో అక్షరాస్యత కోసం శ్రమించిన వెల్తీ హన్సింగర్ ఫిషర్ అనే మహిళకు 1964 పురస్కారం లభించింది. 1976 లో భారతానికి చెందిన ‘లార్సెస్’ కు, జాకెన్ ఆర్పుతమ్ కు 2000లో భారత్ పాకిస్తాన్ ల మధ్య శాంతి కోసం కృషి చేసిన లక్ష్మి నారాయణ్ రామదాస్ కు లకు లభించాయి. ఈ విభాగంలోని ఎక్కువగా జపానీయులకు, రామన్ మెగసెసే పురస్కారాలు లభించాయి. తర్వాత ఇండోనేషియా, థాయ్ లాండ్, ఫిలిప్పీన్స్ దేశాల ప్రజలకు పురస్కరాలు లభించాయి. ఈ విభాగంలో భారతీయులకు అతి తక్కువ మందికి పురస్కారాలు లభించాయి.
సామాజిక మార్పు, సమస్యలపై అత్యంత విస్తృత కృషి చేసిన వారిని అత్యవసర నాయకత్వ విభాగంలో చేర్చారు. ఈ విభాగం ఒక్కటే ఇప్పటికీ కొనసాగించబడుతున్నది. ఈ విభాగం లోని పురస్కారాలు 2001 లో మొదలు పెట్టి ఇప్పటి వరకూ ఇస్తూనే ఉన్నారు. 2002లో భారతదేశం నుంచి ‘సందీప్ పాండే' కు రామన్ మెగసెసే పురస్కారం లభించింది. 2001 లో మొదలు పెట్టాక ఇండోనేషియా మహిళ “డిటా ఇండాసారి” కి ఇచ్చాక మరుసటి సంవత్సరమే భారత దేశానికి లభించింది. 2006 సం..లో భారతదేశం సమాచార హక్కును ప్రజల్లోకి తీసుకు వెళ్ళి అవినీతి పై పోరాటం సాగించిన' అరవింద్ కేజ్రీవాల్ కు దక్కింది. 2011 లో 'నీలిమా మిశ్రా 'కు, 2015 లో సంజీవ్ చతుర్వేదికి, 2016 లో తోడూర్ మాడబూని కృష్ణకు, ఈ పురస్కారాలు లభించాయి. దీప్ జోషి, హరీష్ హాండే, ఫ్రాన్సిస్ కులండే, అన్షుగుప్తా, బెజవాడ విల్సన్', భారత్ వత్వాని, సొనమ్ వాంగ్ చుక్, రవీష్ కుమార్ రవి కుమార్, వంటి వారికీ పురస్కారాలు లభించాయి. విభాగమేదైనా ఆఫ్ఘనిస్తాన్ కు అతి తక్కువ పురస్కారాలు వచ్చాయి.
సాహిత్యం కళల విభాగంలో రామన్ మెగసెసే పురస్కారం లభించిన మహళల్లో మహాశ్వేతాదేవి ఒక్కరే ఉన్నారు. భారతదేశం కళలకు పుట్టినిల్లు అంటారు. కానీ కళల్లో అతి తక్కువ మందికి అవార్డులు వచ్చాయి. భవిష్యత్తులో భారతదేశం నుంచి కళల్లో కూడా అధిక అవార్డులు, అందులోనూ మహిళలు సాధించాలని కోరుకుందాం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి