సామెతల ఊట -సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్, రావు ఖమ్మం

 సామెత -98: -అగ్గి దిని బొగ్గు బోయినట్టు
****
"అవ్వా! గీయనేం మనిషవ్వా! మాట మాటకు తప్పు బోడి నెత్తికి ముప్పు అన్నట్టు చేసిండు. పెద్ద మడిషి ముస్లాయన రాక రాక శాన్నాళ్ళకి ఇల్లు జొచ్చుకొని వొచ్చిండని బరాయించినం గాని లేకుంటెనా పరిత్తితి ఇంకోరకంగ ఉండేదవ్వా!"
"ఎప్పుడెప్పుడు శెవిలెయ్యాలా అని ఉరికురికి వొచ్చిన నాగరత్తాన్ని జూసి "ఏంది శెల్లె? పొద్దు పొద్దుగాల, గింత జెల్దొచ్చినవ్? అప్పుడే పందీరిందా? ఆచ్చెర్రంగా అడిగింది అవ్వ.
 "గీ ముచ్చెటి శెప్పనీకె సట్ట సట్ట పందీర్సుకుని వచ్చినవ్వా!"
 "అశెనానె శెల్లె!  గింతెల్లెం నువ్వొచ్చేతల్కి  మన్సు ఐరాన అయ్యింది? సరే తీ! గింతకీ ఎవరాయిన? ఏం పని మీదొచ్చిండు?గాయ్నేం జేసిండు.జెర జెప్పు! నా పని సుత అయ్యే పోయింది." పప్పుల పోపు బెట్టుడు అవ్వంగనే  తడి శేతులు శీరకు తుడ్సుకుంట బల్లెపీట మీద కూసోని ఎదురంగ కుర్శిల కూసుండ బెట్టింది.
ఏం లేదవ్వా! మా ఆయన్నకి దూరపు బంధువొకాయ వొచ్చిండవ్వా! మడిషి జూత్తె బాగానే ఉండు.
 ఇంగ జూష్నవా మరియాద కొరకు  పుసుక్కున ఎట్లున్నరు బాబాయి అడిగినవ్వా? 
గంతే పూనకం వొచ్చినట్టు ఎన్నెన్ని మాటలండో? ఏం ఎట్లుండాలె? బాగుండలే ?  నువ్వేమన్న ఆరుత్తవా తీరుత్తవా? గిట్ల ఎమేమో అన్కుంట ఎగిరెగిరి పడ్డడు.నాకైతె దిమ్మ దిరిగి దిమాక్ కరాబయ్యిందన్కో. జెర్ర సేపు దనుక తేరుకోలేదు.మిడిగుడ్లేసుకుని గట్లనే సూడబట్టిన. మాటెంబటి మాట ఇంగ ఏమనాల్నో మెదడుకెక్కలేదు.
అంటే గాయ్న సంగతి "అగ్గి తిని బొగ్గు బోయినట్టు " ఉందన్న మాట. బలే బాద్దరోడె పో! గిస్మంటోళ్ళకి వొయసు పెరుగుద్దిగని బుద్ధి పెరగదు శెల్లె! పెద్దిర్కం నిలుపుకోరు.  ఎవ్వలితోటి మంచనిపించుకోరు. గిస్మంటి కొస తీవ్రం మనిషిని ఎవలు బరిత్తరు? గింతకి ఆనెక్క ఏమైంది శెల్లె?"
 "ఏముందవ్వా! మూడు దినాలుండు. మాకు సుక్కలు జూపిచ్చిండు.ఇంట్లె మా పొల్లగాండ్లు సుత గీనేం మడిషి అన్కోడమే... అమ్మో ! నాకనిపిచ్చింది. గీయన్ని ఆళ్ళ ఇంటోళ్ళు, పెళ్ళాం ఎట్ట బరిత్తుండ్రో ఏమో? అన్పిచ్చింది. గాయ్న బొయినంక వానెల్సినట్టుందన్కో. గందుకే గిట్లబడొచ్చిన. గీత యిసయం నీ శెవిల ఏద్దామని" అంటున్న నాగరత్తాన్ని జూస్కుంట..."
 మడుసుల్లో  గిలాంటి ఇంత మడుసులంటరు శెల్లె! దీనికి ఉదార్న గిస్మంటోళ్ళే !బలే వుంది గాయన కత" అన్కుంట  ఇంకా ఇంకా గాయ్న ముచ్చెట్లు కతలు కతలుగ జెప్పుకుంట కూసుండ్రు.
గదండీ సంగతి! "అగ్గి తిని బొగ్గు బోవుడంటే " ఈ పాటికి ఎప్పుడో అర్థమయ్యే ఉంటది. మంటొతికె మాట్లాడి బొగ్గవుడు దప్ప మరేం ఉండదు‌.
కామెంట్‌లు