రైల్వే సిగ్నల్‌ మ్యాన్ గా కొండముచ్చు: - - యామిజాల జగదీశ్


 అది పెంపుడు జంతువు కాదు. అది ఒక రైల్వే సిగ్నల్‌ మ్యాన్. 1880లలో, ఒక కొండముచ్చు (బబూన్...దీనిని తెలుగులో గోలాంగూలం, సింగిలీకం అని కూడా అంటారు) దక్షిణాఫ్రికా రైల్వే స్టేషన్‌ లో కీలకపాత్ర పోషించింది. తొమ్మిది సంవత్సరాలపాటు ఒక్క తప్పు కూడా చేయక విధులు నిర్వర్తించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ కొండముచ్చు పేరు జాక్.
1877లో, జేమ్స్ “జంపర్” వైడ్ ఒక భయంకరమైన రైల్వే ప్రమాదంలో రెండు కాళ్లను కోల్పోయాడు. వీల్‌ చైర్‌లో తిరిగే శారీరక పనిని చేయ లేకపోయాడు కానీ అతను ఉద్యోగాన్ని వదులుకోవడానికి నిరాకరించాడు. బదులుగా, అతను ఓ ఊహించలేని పని చేశాడు. అతను తన బాధ్యత వహించడానికి జాక్ అనే ఈ కొండముచ్చుకి శిక్షణ ఇచ్చాడు.
జేమ్స్ స్థానిక మార్కెట్‌లో  "జాక్‌" ను కొన్నాడు. అతను దాని తెలివితేటలను గుర్తించాడు. కానీ అది ట్రిక్స్ లేదా సర్కస్ స్టంట్స్ గురించి కాదు. ఇది జీవన్మరణ పని.
జాక్ ఈ పనులన్నింటినీ నేర్చుకుంది.
రైలు సిగ్నల్స్‌ను నియంత్రించే మీటలను లాగటం.
వివిధ రైలు ఈలలకు ప్రతిస్పందింటం.
జేమ్స్ వీల్‌చైర్‌ను ఇల్లు, సిగ్నల్ బాక్స్ మధ్య తోసుకుంటూ రావటం.
చేతి పరికరాలు, సామాగ్రిని తీసుకురావటం, తలుపులు లాక్ చేయటం, అన్‌లాక్ చేయటం. అలాగే అత్యంత క్లిష్టమైన పని సిగ్నల్‌లను స్వయంగా నడపటం. 
కానీ రైల్వే అధికారులు కొండముచ్చుని విధులకు తీసుకోవడానికి ఆలోచించారు.‌ భయపడ్డారు.‌ వారు తిన్నగా జాక్‌ పనితనాన్ని చూశారు. దానిపై క్రమంగా నమ్మకం కలిగింది.
అది ప్రతి లివర్‌ను సరిగ్గా కొట్టేది. రైలు ఈలలకు తక్షణమే స్పందించేది.  ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ఉండేది. దేనికీ వెనుకాడేది కాదు. అయితే అధికారులు దానిని మోసగించడానికి, గందరగోళానికి గురిచేయడానికి ప్రయత్నించారు. కానీ కొండముచ్చు ఏ మాత్రం బెదరక చెదరక స్థిమితంగా విధులు నిర్వహిస్తూ తనకు పెట్టిన ప్రతి పరీక్షలో ఉత్తీర్ణత చెందింది. అనంతరం దానిని 1881లో, రైల్వే శాఖ ఎవరూ ఊహించనిది చేసింది. దానిని అధికారికంగా నియమించారు.
ఏకంగా తొమ్మిది సంవత్సరాలపాటు, జాక్ సిగ్నల్స్‌ను నడిపింది. ప్రతిరోజూ సంక్లిష్టమైన నమూనాలు. బహుళ రైళ్ల రాకపోకలు... ఎక్కడా ఏ తప్పూ దొర్లకుండా తాను చేయవలసిన పనులు చేసింది. దాని పనితనాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు, దాని గురించీ విన్న వారూ, ప్రయాణీకులు ఆశ్చర్యపోయేవారు. అది తన దినచర్యలను అర్థం చేసుకుని నేర్చుకునేది. అది ఓ అనుభవజ్ఞుడైన మనిషిలా పని చేసింది. ఏమాత్రం తడబడకుండా విధులు నిర్వర్తించింది. నిజమైన అవగాహనను అది తన చేతలలో చూపీంచింది. దానికి సిగ్నల్ సంకేతాలు, ఈలలు ప్రతిదీ తెలుసు.
జాక్ 1890 ప్రాంతంలో అనారోగ్యంతో చనిపోయింది. రైల్వే శాఖ తీవ్ర సంతాపం తెలిపింది. వార్తాపత్రికలు దాని గురించి ప్రముఖంగా ప్రచురించాయి. దానినొక సర్కస్ జంతువుగా గుర్తుంచుకోలేదు.  అంకితభావంతో, సమర్థుడైన రైల్వే కార్మికుడిగా గుర్తుంచుకుంది రైల్వే శాఖ.
జాక్ అరుదైనదాన్ని తన పనులతో నిరూపించింది.  జంతువులను గౌరవించండి... శిక్షణ ఇస్తే అవి కూడా, సంక్లిష్టమైన పనులను చేయగలవని అది చెప్పక చెప్పింది. ఈ కొండముచ్చు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు.
జాక్ కథ అందమైనది కాకపోవచ్చు కానీ తెలివైనది. అసాధారణమైనది. జంతువులకు శిక్షణ ఇస్తే మనకంటే చక్కగా పని చేస్తాయని గ్రహించాల న్నారు.1880లలో, ఒక కొండముచ్చు దక్షిణాఫ్రికాలో అత్యంత విశ్వసనీయ రైల్వే ఉద్యోగులలో ఒకరిగా మారిన తీరు విశేషం.


కామెంట్‌లు