శ్రీకాకుళం జిల్లా, జి.సిగడాం మండలం, పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావును తెలుగు వెలుగు సామాజిక సాహిత్య సేవా సంస్థ ఘనంగా సత్కరించింది. ప్రఖ్యాత రచయిత, సంఘ సేవకులు, తెలుగు వెలుగు అధ్యక్షులు టి.వి.రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. గుంటూరు సత్యసాయి స్పిరిటివల్ సెంటర్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై తిరుమలరావు ఈ ప్రశంసా బహుమతి అందుకున్నారు. విశ్వంలో గల అన్ని సామాజిక అంశాలను అధ్యయనం చేసి టి.వి.రెడ్డి రచించిన 87కవితల సంపుటి అమరమ్ ను తిరుమలరావుకు బహూకరించారు. 72సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో, సంస్థ అంతర్జాతీయ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో రెండవ రోజు తిరుమలరావు తన ప్రతిభను ప్రదర్శించారు. శ్రీ జాషువా కరుణశ్రీ కవిసమ్మేళన వేదికపై తిరుమలరావు స్వీయ గీతాన్ని ఆలపించి సభాసదుల ప్రశంసలు పొందారు. వెయ్యి మంది కవి సమ్మేళన కార్యక్రమానికి అనంతపురం నుండి విచ్చేసిన తెలుగు వెలుగు అధ్యక్షులు టి.వి.రెడ్డి, తిరుమలరావు గీతాలాపనను ప్రత్యేకంగా ప్రశంసించారు. గగనమంత అనుభూతి గజల్స్ స్వర రీతి అనే శీర్షికతో గజల్ కళ గురించి తిరుమలరావు పాటను ఆలపించి సభను రంజింపజేసారు.
ఈ సందర్భంగా టి.వి.రెడ్డి మాట్లాడుతూ గజల్ అనే సాహిత్య ప్రక్రియ పుట్టు పూర్వోత్తరాలను
తిరుమలరావు కమ్మగా రచించి ఎంతో మధురంగా వినిపించారని అన్నారు. తిరుమలరావు మాట్లాడుతూ ప్రముఖ సామాజికవేత్త సాహితీవేత్త దర్శకులు కళాకారులు తూరుపు కొండల్లో మెరిసే మేరంగి పుస్తక రచయిత రౌతు వాసుదేవరావు స్వరకల్పన వహించగా ఈ గీతాన్ని తాను రచించానని అన్నారు. సినారె దాశరథి లతో పాటు మాస్ట్రో డా.గజల్ శ్రీనివాస్ ఈ గజల్ కళకు అందించిన సేవలకు ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతి గాంచుట మన తెలుగువారికి ఎంతో గర్వకారణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు కవులు, కార్యక్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. స్వీయ కవితను పాట రూపంలో వినిపించిన అనంతరం తిరుమలరావును నిర్వాహకులు శాలువా, మెడల్, ప్రశంసాపత్రాలతో ఘనంగా సన్మానించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి