సాహసమే ఊపిరిగా సాగిపో...: - కవి రత్న -సాహిత్య ధీర -సహస్ర కవి భూషణ్ -పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్, హైదరాబాద్
ఓ మిత్రమా..! 
ఈ చిన్ని జీవితంలో 
చీకటి మబ్బుల మధ్య
వెలసే వెలుగు కిరణంలా 
దుఃఖాల మబ్బుల్ని చీల్చుకుంటూ 
ధైర్యమే ముందుకు నడిపించాలి. 

కష్టాల కల్లోలంలో తేలుతూ...
అలల తాకిడిలో తడుస్తూ...
గుండె గర్భగుహలో 
గూడు కట్టుకున్న ఆశలు
ఆవిరికాక ముందుకు సాగినప్పుడే...
ఆనందతీరాలను చేరతాం. 

జీవితంలో ప్రతి అడుగులోనూ 
అవాంతరాల అగ్నిపర్వతాలే...
ప్రతి మలుపులోనూ 
ఎదురు దెబ్బల తుపానులే.... 
ఐనా కసితో, కృషితో,
కట్టుదిట్టమైన గట్టి సంకల్పంతో
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిననాడే 
జీవితపరమార్ధం అర్థం చేసుకున్ననాడే. 

బుద్ధునిలా జ్ఞానోదయమౌతుంది...

ప్రతి ఓటమి వెనుక 
ఒక గెలుపు దాగి ఉంటుందని
ప్రతి చీకటి రాత్రి వెనుక 
ఒక ఉషోదయం ఎదురు చూస్తుందని...

శోకాల మరుగున
దాగి సుఖమున్నదని
ఏదీ తనంతట తానై
నీదరికి రాదని శోధించి, సాధించాలి
అదే ధీరగుణమని మనిషి మహిమని...

అప్పుడే ప్రారంభం
ముళ్ల బాటను దాటి 
పూల తోట చేరే పయనం 
అప్పుడే ప్రారంభం
వేదనల్ని వెన్నెలగా
మార్చేటి సాహస యాత్ర. 

ఓ మిత్రమా..! 
నీ గుండెలో దాగిఉన్న 
అఖండ శక్తిని గుర్తించు...
సాహసమే ఊపిరిగా...
పరోపకారమే పరమార్థంగా...
సగర్వంగా జీవితాన్ని నడిపించు. 

నీవు బలహీనుడివి కాదు... 
నీవు అత్యంత శక్తిమంతుడివి...
నీ అడుగులు భూమిని కంపింపజేసేలా, 
నీ సంకల్పం ఆకాశాన్ని తాకేలా... 
సాగిపో ముందుకు...మున్ముందుకు... 
అపరాజితుడిగా... 
అజేయుడిగా... 
అమరుడిగా... 



కామెంట్‌లు