ఇండియా గేట్: - - యామిజాల జగదీశ్


 దేశ రాజధాని న్యూఢిల్లీ  నడిబొడ్డున ఉన్న కట్టడమే ఇండియా గేట్.  దీని ఎత్తు 42 మీటర్లు. ఇది కూడలి మధ్యలో ఉన్న ఆర్చ్‌వే లాంటి " ఆర్క్-డి-ట్రయంఫ్ ". 
మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ సైన్యం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన డెబ్బై వేల మంది భారతీయ సైనికుల జ్ఞాపకార్థం నిర్మితమైంది. ఆఫ్ఘన్ యుద్ధంలో వాయువ్య సరిహద్దులో మరణించిన 13,516 కంటే ఎక్కువ మంది బ్రిటిష్, భారతీయ సైనికుల పేర్లను ఈ స్మారక చిహ్నాన పొందుపరిచారు.
ఇండియా గేట్ పునాది రాయిని 1921లో కన్నాట్ డ్యూక్ హిస్ రాయల్ హైనెస్ వేశారు. దీనిని ఎడ్విన్ లుటియన్స్ రూపొందించారు. ఈ స్మారక చిహ్నాన్ని 10 సంవత్సరాల తర్వాత అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ జాతికి అంకితం చేశారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మరొక స్మారక చిహ్నం, అమర్ జవాన్ జ్యోతి చాలా కాలం తరువాత జోడించారు. డిసెంబరు - 1971 నాటి ఇండో - పాకిస్తాన్ యుద్ధంలో తమ ప్రాణాలను అర్పించిన సైనికులను దేశానికి గుర్తు చేయడానికి ఇది ఏర్పాటైంది. ఈ శాశ్వత జ్వాల వంపు మొత్తం ఎర్రటి భరత్‌పూర్ రాయితో పునాదిపై ఉంది. దశలవారీగా దీనిని రూపొందించారు. దీనిని జనవరి 26, 1972న ఆవిష్కరించారు. ఇది ఒక నల్ల పాలరాతి సమాధి. దాని బారెల్‌పై రైఫిల్ ఉంచారు. సైనికుడి హెల్మెట్‌తో దీనిని అమర్చారు.
రాత్రి సమయంలో, ఇండియా గేట్  ఫ్లడ్‌లైట్‌లో కన్పిస్తుంది. దీనికి సమీపంలోని ఫౌంటైన్‌లు రంగుల లైట్లతో మనోహరమై ఆకర్షిస్తాయి.
ఇండియా గేట్ రాజ్‌పథ్‌కి ఒక చివర ఉంది. దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సాధారణంగా 'ఇండియా గేట్' అని పిలుస్తారు. గంభీరమైన నిర్మాణం చుట్టూ పచ్చని పచ్చిక బయళ్లతో కూడిన సువిశాల ప్రదేశం ఒక ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్.గా ఉంది. వేసవి సాయంత్రాలలో ప్రకాశవంతంగా వెలిగే ఈ ప్రదేశంలో, పచ్చిక బయళ్లపై జనం సంచరించడం చూడవచ్చు. ఇక్కడ భారతదేశం త్రివిధ సాయుధ దళాల జెండాలు మరొక దేశభక్తి ఆకర్షణ.
------------------------------
గేట్ వే ఆఫ్ ఇండియా
------------------------------
డిసెంబరు 1911లో ఢిల్లీ దర్బార్‌కు ముందు కింగ్ జార్జ్ V,  క్వీన్ మేరీ ముంబై సందర్శన జ్ఞాపకార్థం విజయోత్సవ ఆర్చ్‌గా నిర్మితమైంది "గేట్ వే ఇండియా". దీనికి 1913 మార్చి 31న అప్పటి బొంబాయి (ముంబై) గవర్నర్ శంకుస్థాపన చేశారు .
ఆర్కిటెక్చర్ అనేది ఇండో-సార్సెనిక్ శైలికి (భారతదేశం - ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కలయిక) ఓ గొప్ప ఉదాహరణ. ఇది చాలా గంభీరమైన కట్టడం.  కింగ్ జార్జ్ V, క్వీన్ మేరీ ఈ ప్రదేశం ద్వారా భారతదేశంలోకి ప్రవేశించడం గమనార్హం. ఇది పసుపు బసాల్ట్, రీన్ఫోర్స్డ్ కాంక్రీటుతో నిర్మితమైంది. ఇది ముంబై నౌకాశ్రయానికి ఎదురుగా ఉంది. దీని ప్రధాన వాస్తుశిల్పి జార్జ్ విట్టెట్.
భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన  విలాసవంతమైన తాజ్ మహల్ హోటల్ గేట్‌వే ఆఫ్ ఇండియాకు సమీపంలో ఉంది.
ఈ గేట్ వే ఆఫ్ ఇండియా నిర్మాణానికి  1924లో రూ. 24 లక్షలు ఖర్చయ్యింది. దీని ఎత్తు 26 మీటర్లు. ఎలిఫెంటా గుహలు గేట్‌వే ఆఫ్ ఇండియాకు చాలా దగ్గరగా ఉన్నాయి. పర్యాటకులు మోటారు పడవలపై ప్రయాణించవచ్చు. ఎలిఫెంట్ గుహల ప్రవేశ ద్వారం వద్ద మరాఠా నాయకుడు శివాజీ, స్వామి వివేకానంద విగ్రహాలు ఏర్పాటు చేశారు.
1948 ఫిబ్రవరి 28న జరిగిన వేడుకలో బ్రిటీష్ పాలన అంతం కావడానికి సూచనగా సోమర్సెట్ లైట్ పదాతిదళం మొదటి బెటాలియన్ గేట్‌వే గుండా ముందుకు సాగింది. భారతదేశంపై బ్రిటిష్ వలస పాలన " స్మారక చిహ్నం "గా  దీనిని పరిగణిస్తారు. దీనిని " తాజ్ మహల్ ఆఫ్ ముంబై " అని కూడా పిలుస్తారు.



కామెంట్‌లు