సుప్రభాత కవిత : - బృంద
ఎర్రని రంగు తూరుపు గడపకు పూసి
మబ్బులు అడ్డము రాకుండా తోసి
నేలను వెలుతురు ముగ్గులేస్తూ
ఇలకు పండుగ తెచ్చే వేకువ సంక్రాంతి

తలంట్లకు  లేచిన పిల్లల తీరున 
గోలలు చేసె గువ్వల గుంపులకు
చలికి మంటలు వేసి వెచ్చగా చేసె
పెద్దల్లా  తోచే కొమ్మల గూళ్లు

కోతకు వచ్చిన పంటలు 
ఇంటికి  తెచ్చిన పండుగను
ఇష్టంగా చూస్తూ ఊగే
కంకులు కట్టిన తోరణాలు

గుడిలో మోగే గంటల సవ్వడి 
వినిపిస్తూ చుట్టూ తిరిగే గాలి 
చేతులు చకచక ఆడిస్తూ 
ఇంతలేసి  ముగ్గులేసే అమ్మాయిలు

ముత్యాల ముగ్గుల మధ్య 
ఒద్దిగ్గా కూచున్న గోబ్బెమ్మల 
చుట్టూ తిరుగుతూ పాటలుపాడే 
పట్టు పావడాల మెరుపులు

ఎంత చక్కని జీవనసరళి 
అంతా కలిసే ఆనందరవళి 
చింతలు వంతలు గుర్తేరాని 
పంతాలేవి  కనపడని పండుగ వేళ

హృదయాలు ఉప్పొంగు 
ఉదయాల ఉత్సాహంలో
మురిసే కన్నుల మెరిసే మెరుపులా
కురిసే వేకువ వెలుగులకు

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు