ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మార్పు బాలకృష్ణమ్మ విద్యారంగానికి చేసిన సేవలు ఉపాధ్యాయ వ్యవస్థకు, పలు హక్కుల పరిరక్షణ, సంస్కరణలకు ఎంతగానో దోహదపడ్డాయని
పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి అన్నారు. పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో మార్పు బాలకృష్ణమ్మ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇదే జిల్లా మందస మండలం భిన్నల మదనాపురంలో మార్పు పద్మనాభం రైతాంగ పోరాటాలకూ ప్రజాహిత కార్యక్రమాలకు అహర్నిశలూ శ్రమించిన మార్పు పద్మనాభం కుమారునిగా తండ్రి ఆదర్శాలను పుణికిపుచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మార్పు బాలకృష్ణమ్మ అని అన్నారు.
తొలుత మార్పు బాలకృష్ణమ్మ చిత్రపటానికి ఉపాధ్యాయులంతా పూలమాల వేసి నివాళులర్పించారు. ఎపిటిఎఫ్ జిల్లా శాఖ ఉపాధ్యక్షులు వై.వి.రమణ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలకు ధర్నా వంటి ప్రక్రియలకు సూత్రధారిగా నిలిచి సాహసోపేతంగా పోరాడిన మహా యోధుడు మార్పు బాలకృష్ణమ్మ అని అన్నారు. ఎం.ఎల్.సి.గా రెండు సార్లు ఎన్నికై, శాసనమండలి ప్రోగ్రసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ నేతగా వ్యవహరించి విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల్ని సభలో ప్రస్తావించి పరిష్కారం దిశగా అహర్నిశలు కృషి చేసీ, శాసనమండలినే ఉపాధ్యాయ ఉద్యమ వేదికగా మార్చగల్గిన మహనీయుడని అన్నారు. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఉపాధ్యాయ సంఘాల ఉనికిని పవిత్రమైన స్థానాల్లో నిల్పిన సవ్యశాచి మార్పు బాలకృష్ణమ్మ అని అన్నారు. ఉపాధ్యాయని ఉప్పలపాటి ఆదిలక్ష్మి మాట్లాడుతూ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితుల్లో తన చొరవతో కీలకమైన ఉత్తర్వులను తీసుకువచ్చేలా అనేక ప్రభుత్వాలతో చర్చలు జరిపి తన మేథస్సును చాటిచెప్పారని గుర్తుచేసారు. ఉపాధ్యాయులు వెలగాడ రాము మాట్లాడుతూ ఉపాధ్యాయుల పక్షాన పోరాడే క్రమంలో పార్వతీపురం రాజమండ్రి మున్నగు ప్రాంతాల్లో జైలు జీవితాన్ని సైతం అనుభవించి, నిర్దోషిగా బయటకు వచ్చిన మహోన్నత పోరాటశీలి మార్పు బాలకృష్ణమ్మ అని అన్నారు. ఉపాధ్యాయని ముల్లు సుజాత మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన అఖిల భారత విద్యా సంఘాల సమాఖ్యకు మార్పు బాలకృష్ణమ్మ ఉపాధ్యక్షునిగా ఎంపికై దేశానికే మార్గదర్శకంబగు సేవలనందించి ఉపాధ్యాయులకు స్పూర్తిదాయకంగా వెలుగొందారని అన్నారు. అందరూ మార్పు బాలకృష్ణమ్మ అమర్ రహే అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో ఎం.పెంటయ్య, పి.దాలమ్మ, స్థానిక ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి