సంపూర్ణ మహాభారతము సరళ వ్యావహారిక భాషలో...!

 వన పర్వము పంచమాశ్వాసము- 118 వ రోజు
మాతాపితలను సేవించడం
ధర్మవ్యాధుడు " మహర్షీ! నేను సర్వజ్ఞుడిని కావడానికి మూలమైన ధర్మం నీకు తెలుపుతాను " అన్నాడు. అతనిని గృహాంతర్భాగానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ సుఖాశీనులై ఉన్న తల్లి తండ్రులకు నమస్కరించి కుశలం అడిగాడు. వారు " కుమారా! నీవంటి కొడుకు ఉండగా మాక్షేమమునకు లోటు ఏమి? నీ ధర్మం నీకు తోడుగా ఉండి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయి. నీ వలన మన వంశం పవిత్రమైనది. నీవు మనుష్య జన్మ ఎత్తిన దేవతామూర్తివి. త్రికరణ శుద్ధిగా తల్లితండ్రులను సేవించే నీవు పరశురాముని కన్నా గొప్పవాడివి " అన్నారు. అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికుని తల్లి తండ్రులకు పరిచయం చేయగా వారు కౌశికుని కుశలం అడిగారు. ధర్మవ్యాధుడు కౌశికునితో " వీరు నా జననీ జనకులు వీరిని సేవించి నేను ఇంత జ్ఞానం సంపాదించాను. నేను ఇతర దేవుళ్ళను ఎరుగను తల్లితండ్రులే నా దైవాలు. నేను వీరికి పండ్లు, ఆహారం, వస్త్రములు ఇచ్చి వీరిని సేవిస్తుంటాను. నా భార్యా బిడ్డలు వీరికి సేవ చేస్తుంటారు. యజ్ఞాలు, క్రతువులూ, వేదాలూ అన్నీ వీరే అని భావిస్తాను. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ ఈ అయిదిటిని ఎవరు పూజిస్తారో వారే మహాత్ములు. అయ్యా! పతివ్రత పంపగా ధర్మ సూక్ష్మం తెలుసుకోవడానికి నా దగ్గరకు వచ్చారు. ఆమె అనుగ్రహంతో నేను నీకు చెప్పగలిగాను. నీ వంటే నాకు అప్రియంగా ఉంది. అందుకు కారణం నీవు నీ తల్లి తండ్రుల అనుమతి లేకుండా వేదాద్యయనానికి వెళ్ళి వారిని వ్యాకులతకు గురి చేసావు. వారి పట్ల కృూరంగా ప్రవర్తించావు. నీవు వేదజ్ఞానం సంపాదించినా నీ తల్లి తండ్రులను బాధించినందుకు నాకు నీ ఎడల అప్రియం కలిగినది. నీ తల్లితండ్రులు నీ కొరకు రోదించి గుడ్డి వాళ్ళు అయ్యారు. ఆ సంగతి నీకు తెలుసా? ఇకనైనా వారి వద్దకు వెళ్ళి వారి శోకమును చల్లార్చు. నీ జ్ఞానం పుణ్యం తల్లి తండ్రులను బాధించడం వలన నిష్ఫలం ఔతాయి. నేను చెప్పినది విని వారిని సేవించి తరించు " అని ధర్మవ్యాధుడు చెప్పాడు. కౌశికుడు " మహాత్మా! నీవు చెప్పినట్లే వెళ్ళి నా తల్లితండ్రులను సేవించుకుంటాను. నేను చేసిన పాపం నుండి నీ బోధనలతో విముక్తుడని అయ్యాను. నా భాగ్యవశమున నీ పరిచయ భాగ్యం కలిగినది. నా మనసు ఆహ్లాదం అయింది. నీవు నాకు దైవ సమానుడవు. నీ వలె ధర్మమార్గాన సంచేరించే వాడు అరుదు. వేలకొలది మానవులలో ఏ ఒక్కరో నీ వంటి వాడు ఉంటాడు. నేను నిన్ను శూద్రునిగా తలచడంలేదు. భూత, భవిష్యత్తు, వర్తమానాలను ఎరిగిన నీవు ఏల ఈ శూద్ర జన్మను ఎత్తావో చెప్పు " అన్నాడు.
ధర్మవ్యాధుని పూర్వ జన్మ వృత్తాంతం
అయ్యా మీరడిగినది చెప్పడం నాధర్మం. నేను పూర్వజన్మలో బ్రాహ్మణుడను. వేదవేదాంగాలు చదువుకున్నాను. నాకు ఒక రాజకుమారునితో మైత్రి కలిగిన కారణంగా విలువిద్య కూడా నేర్చుకున్నాను. ఒకరోజు నేను రాజకుమారునితో వేటకు వెళ్ళి అనేక మృగములను చంపాను. నే విడిచిన ఒక బాణం పొదల మాటున గడ్డిచాటున ఉన్న మునీశ్వరునికి తగిలింది. నేను మునీశ్వరుని వద్దకు వెళ్ళి బాధతో నేలమీద దొర్లుతున్న ఆయనతో అనునయ వాక్యాలు పలికాను. ఆయన బ్రాహ్మణుడుగా పుట్టి శూద్రునిలా మృగములను చంపావు కనుక మృగములను చంపు వ్యాధుడిగా జన్మించు " అని శపించాడు. ఎరుగక తప్పు చేసిన నన్ను మన్నించి శాపవిమోచనం కలిగించమని ఆయనను వేడుకున్నాను. ఆ ముని కరుణించి " నా శాపానికి తిరుగు లేదు వ్యాధుడిగా జన్మించినా నీకు ధర్మసూక్ష్మములు తెలియగలవు. నీవు తల్లితండ్రులను సేవించినంత కాలం పూర్వ జన్మ స్పురణ ఉంటుంది. సత్కర్మాచరణము వలన నీవు తిరిగి బ్రాహ్మణ జన్మ పొందగలవు " అని పలికాడు. నేను ఆ ముని శరీరం నుండి బాణం బయటకు తీసి ఆయనను ఆశ్రమానికి చేర్చి గాయానికి మందు వేసి బ్రతికించాను. కానీ నాకు ఈ వ్యాధుని జన్మ తప్పలేదు " అన్నాడు.

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు